ముక్కుపచ్చలారని చిన్నారులు పట్టుతప్పుతున్నారు. మత్తులో తడబడుతున్నారు. మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారు. ఒక్కసారే కదా… అంటూ మొదలయ్యే మత్తు అలవాటు క్రమంగా జీవితాన్ని అంధకారం చేస్తోంది. మద్యం, గంజాయి, వైట్‌నర్ తదితర వాటికి అలవాటైనవారు చదువు, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు మానసిక క్షోభ కలిగిస్తున్నారు. ఉన్నతస్థాయికి చేరాల్సిన బిడ్డలు డ్రగ్స్ పంజరంలో చిక్కడం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వెలుగుచూసిన సంఘటనలు డ్రగ్స్ బెడద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మూడు నెలల క్రితం రూ. 8.5 కోట్ల విలువైన ఎంఫిటమైన్ మత్తుమందు దొరకడం నివ్వెరపరిచింది. చిన్నపిల్లలకు గంజాయి అలవాటుచేసి, ఆపై వారితోనే దాన్ని అమ్మిస్తున్న ముఠా యాంటీ నార్కోటిక్ సెల్‌కు పట్టుబడింది.
2018 2022లో దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసుల్లో 5.13 లక్షల మంది అరెస్టు అయితే, 1.48 లక్షల మందికి మాత్రమే శిక్షలుపడ్డాయి. 2019 లో కేరళలో 4,709 కేసులు నమోదయ్యాయి. తూర్పు ఢిల్లీ పురపాలక పాఠశాల్లోని 8 నుంచి 11 ఏళ్లలోపు పిల్లల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు మత్తులో జోగుతున్నారని అధికారిక అధ్యయనాలు తేల్చాయి. ఎయివ్‌సు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో హైదరాబాదు, బెంగళూరు, ముంబై, లక్నో, చండీగఢ్, ఇంఫాల్ తదితర పది నగరాల్లో సాగిన సర్వేలోనూ కలవరపరిచే అంశాలెన్నో వెల్లడయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని 8 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో పది శాతానికి పైగా గంజాయి, నల్లమందు, మద్యం, పొగాకుకు అలవాటుపడ్డారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) దర్యాప్తులో పలు ఉదంతాలు బయటపడ్డాయి. తాజాగా 40 వేల మందికిపైగా డ్రగ్స్ వినియోగదారులను అధికారులు గుర్తించారు. అందులో గత ఏడు నెలల కాలంలోనే సుమారు ఆరు వేల మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
మత్తు పదార్థాల సరఫరాదారులు, విక్రేతలతో పాటు వాటికి అలవాటుపడి భవిష్యత్తును పాడుచేసుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులను గుర్తించేందుకు టీజీన్యాబ్ రంగంలోకి దిగింది. పెడ్లర్ల నుంచి సేకరించిన సమాచారంతోపాటు ర్యాండవ్‌ుగా పరీక్షలు నిర్వహిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా 40 వేల మందికిపైగా గుర్తించింది. వారికి కౌన్సిలింగ్ ఇస్తూ మత్తునుంచి బయటపడేలా తోడ్పాటునిస్తోంది. అయితే ప్రతి వంద మందిలో తొంభై మంది మిత్రుల ప్రోద్బలంతోనే మొదటిసారి గంజాయి తాగామని, తరువాత క్రమంగా అలవాటుగా మారిందని తెలిపారు. నిషేధిత ఉత్పత్తులను అలవాటు చేయడానికి, విక్రయించడానికి అసాంఘిక శక్తులు పాఠశాలలను లక్ష్యంగా చేసుకోవడంతో విద్యార్థులు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. మాదకద్రవ్యాలను ఉచితంగా రుచి చూపిస్తూ చిన్నారులను నెమ్మదిగా ఈ రొంపిలోకి దింపుతున్నారు. పిల్లలను క్రమేణా వాటికి బానిసలను చేసి, సరఫరాదారులుగా మార్చుతున్నారు.
హైదరాబాద్‌లో 20 పాఠశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు ఒక ముఠా మాయవలలో చిక్కినట్లు లోగడ వెలుగులోకి వచ్చింది. చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిది నుంచి పదో తరగతిలోపు విద్యార్థుల బ్యాగుల్లో ఈ సిగరెట్లు, మత్తు చాక్లెట్లు దొరికిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. హైదరాబాద్ వంటి పలు నగరాల్లో మద్యం తాగిన అనుభూతినిచ్చే చాక్లెట్లు లభ్యమవుతున్నాయి. గంజాయితో పాటు రంగుల్లో కలిపే రసాయనాలు, జిగుర్ల వంటి వాటిని సేవిస్తూ ఎంతోమంది బాలలు తమ ఆరోగ్యాలను గుల్ల చేసుకుంటున్నారు. అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా ఈ మహమ్మారికి బానిసలవుతూ పట్టుబడుతున్నారు. గత ఏడాది పాఠశాల పిల్లలకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద లభించిన జాబితాలో 70 మంది విద్యార్థులుండగా, వారిలో 25 మంది 9, 10 శాతం ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేస్తున్న యువతులు, మహిళల నంబర్లు ఉన్నాయి. నోటీసులిచ్చేందుకు ఫోన్ చేసినప్పుడు తమ బిడ్డల్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. విషయం బయటకు పొక్కితే పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
తెలిసీ తెలియని వయసులో దుష్పరిణామాలను ఊహించలేని మనసు నిషా గుప్పిట్లో పసిడి రెక్కల బాల్యం ఛిద్రమవుతోంది. బడి పిల్లలే లక్ష్యంగా ప్రాంతాలకు అతీతంగా జడలు విప్పుకున్న నిషా వ్యాపారం తల్లిదండ్రులను వణుకుపుట్టిస్తోంది. తాము తీసుకెళ్లేది మత్త పదార్థమని వారికి తెలియదు. వాడితే కలిగే దుష్పరిణామాల గురించి ఆలోచనే లేదు. పొట్లాల్లో నింపి ఇస్తారు. చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లి ఇచ్చేస్తారు. ఇదీ నగరాల్లో గంజాయి రవాణాలో మైనర్ల పాత్ర. ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసు తనిఖీలు తప్పించుకునేలా చిన్నారులతో కొంతమంది ఇలా చేయిస్తున్నారు. క్రమక్రమంగా పిల్లలు కూడా వీటికి అలవాటు పడుతున్నారు. నల్లమందు, గంజాయి, కొకైన్, ఇన్‌హ్యాలెంట్స్ (పెయింట్స్ థిన్నర్స్, డ్రైక్లీనింగ్ ఫ్లూయిడ్స్, హెయిర్ స్ప్రె, డియోడ్రెంట్స్, స్ప్రే పెయింట్స్) వాడకంలో పిల్లలు భాగస్వాములవుతున్నారు. ఇన్‌హ్యాలెంట్స్ వాడకంలో పెద్దల కంటే పిల్లలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
వీటిని పెద్దల్లో 0.58%, పిల్లల్లో ఏకంగా 117% వాడుతున్నారు. పిల్లల్లో గంజాయి పీల్చుతున్న వారు 0.9% ఉంటే పెద్దల్లో 3.3% ఉన్నారు. నల్లమందు వినియోగిస్తున్న వారిలో పిల్లలు 1.8%, పెద్దలు 2.1% ఉన్నారు. మత్తుమందుల వాడకంలో పిల్లలు 0.58% ఉంటే, పెద్దలు 1.21% మంది ఉన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో దేశంలోనే పంజాబు అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య 3.1 కోట్లు ఉంది. నల్లమందును దేశవ్యాప్తంగా 2.3 కోట్లు, మత్తుమందును 1.3 కోట్ల మంది వినియోగిస్తున్నారు. నాలుగైదు ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా గంజాయి, నల్లమందు, మత్తుమందుల వాడకం తీవ్రస్థాయిలో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మత్తుమందు తీసుకున్న వారిలో మెదడులోని న్యూక్లియర్ అకెంబెన్స్‌ను ప్రేరేపిస్తుంది. దీంతో ఎక్కడలేని సంతోషం, అవధుల్లేని ఆనందం కలుగుతుంది. మళ్లీమళ్లీ అవి కావాలని మెదడు ప్రేరేపిస్తుంది. డీఎడిక్షన్ కేంద్రాలను పటిష్టవంతం చేసి బాధితులను మామూలు వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వారిపై నిఘా వేసి ఉంచాలి. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలి.
కోడం పవన్‌కుమార్ 9848992825