Monday, December 23, 2024

బాలలకు బంగారు కానుక

- Advertisement -
- Advertisement -

బాల్యం అమూల్యమైనది. అట్టి బాల్యానికి భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఆటలు, పాటలు, మాటలు ఇలా వినూత్నమైన కార్యక్రమాల ద్వారా బాలలను ప్రోత్సహించాలి. అందులో భాగంగా బాలల వికాసానికి దోహదపడేది బాలసాహిత్యం. అందుకు కొరకు బాలసాహిత్యం ఎంతగానో బాలల చైతన్యం కొరకు పాటుపడుతుంది. మంచి, నీతి, న్యాయం, ధర్మం వంటి పలు బోధనలు బాలలకు అవగతమవుతాయి. అందుకే నేడు బాలసాహిత్యం విరివిగా పుస్తక రూపాలుగా వెలువడుతుంది.
సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నప్పటికీ బాలల కోసం నేను సైతం అంటూ గేయాలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు రాస్తున్న యువకవి యాడవడం చంద్రకాంత్ గౌడ్.

అందరి కవుల వలే రచనలు కాకుండా విద్యార్థుల్లో ఉన్నటువంటి బహు విధాల సృజనను వెలికి తీయడం చంద్రకాంత్ గౌడ్ లో ఉన్న ప్రత్యేకత. తాను సందర్భానుసారంగా రచనలు చేయడమే కాదు విద్యార్థులచే రచనలు చేయించి బాలసాహితీ లోకానికి పరిచయం చేసిన విజ్ఞలు చంద్రకాంత్ గౌడ్. చంద్రకాంత్ గౌడ్ మనసులో నిత్యం బాలల కోసమే ఆలోచనలు వారి అట్టి ఆలోచనల పరంపరనే ‘చంద్రుడు చెప్పిన కథలు‘ బాలసాహిత్య కథ సంపుటి.

ఇట్టి ‘చంద్రుడు చెప్పిన కథలు‘ బాలసాహిత్య కథ సంపుటిలో 35 కథలు ఉన్నవి. అందులో ప్రతి కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉన్నది. సమాజంలో ఉన్నటువంటి మంచి చెడులను కథలో చూపిస్తూనే నీతి వైపు మార్పు వచ్చేలా కథలను చంద్రకాంత్ గౌడ్ సాగించారు. అలతి కాలంలోనే అద్భుతమైన కథల రచనలు చేసి, చంద్రకాంత్ గౌడ్ చేయి తిరిగిన బాలసాహిత్య రచయితగా పేరు పొందుతున్నారు. చంద్రకాంత్ గౌడ్ ప్రస్తుతం సిద్దిపేటలో నివసిస్తున్న జాతీయ స్థాయిలో బాలసాహిత్య రచయితగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.

‘చంద్రుడు చెప్పిన కథలు‘ బాలసాహిత్య కథ సంపుటిలో ‘చెట్ల ప్రేమికుడు‘ మొదటి కథలో పాఠశాల విద్యార్థి ధనుష్ రకరకాల ఆకృతిలో చెట్లను తీర్చిదిద్దడం మూలంగా పాఠశాల ఎంతో అందంగా ముస్తాబైంది. అందుకు ఉపాధ్యాయులు ధనుష్ ను అభినందించారు. ఇట్టి కథ మూలంగా పాఠశాలలను చెట్ల పెంపకం ద్వారా కూడా అందంగా తీర్చిదిద్దవచ్చని తెలుస్తుంది. మరో కథ ‘ఊరి రుణం‘ కథలో అమెరికాలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి వినోద్ దసరా పండుగకు పుట్టిన ఊరికి వచ్చి పండుగ జరుపుకుని, చిన్నప్పుడు తాను చదివిన బడిని బాగు చేయడమే కాకుండా అనేక రకాలుగా గ్రామానికి ఆర్థిక సహాయం అందజేసి ఊరు రుణం తీర్చుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. చంద్రకాంత్ గౌడ్ రాసిన ఇట్టి కథ ప్రతి ఊర్లలో కూడా చైతన్యం వచ్చేలా ఉంటుంది.

‘విశ్వాసం‘ అంటూ చంద్రకాంత్ గౌడ్ రాసిన మరో కథలో కుక్క పిల్లలను పెంచడం మూలంగా అవి విశ్వాసంతో రాత్రిపూట దొంగలను పసిగట్టి గట్టిగా అరిచి పట్టించడం పట్ల కుక్కలకు మనపై ఉన్న విశ్వాసాన్ని ఈ కథ తెలియజేస్తుంది. మరో కథ ‘ఇంకుడు గుంత‘ ఇందులో ఎనిమిదో తరగతి చదువుతున్నారు రేవంత్ సైన్స్ టీచర్ ఇంకుడు గుంత గురించి తెలియజేయగా తాను తన తండ్రిచే ఇంటి ముందు ఇంకుడు గుంత ఏర్పాటు చేయడం ఎందరికో ఆదర్శమై గ్రామమంతా కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. ఇలా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కథను చంద్రకాంత్ గౌడ్ రాశారు.

ఇలా చంద్రుడు చెప్పిన కథలు బాల కథ సంపుటిలో ప్రతి కథ ఆణిముత్యమే. అన్ని కథలు కూడా సమాజంలో చైతన్యం తీసుకువచ్చే విధంగా సాగుతాయి. ఇట్టి కథల పుస్తకంలో ఇంకొక విశేషం ఏమిటంటే ప్రతి కథ కూడా మన జీవితంలో కదలాడినట్లుగా సాగుతుంది. ఈ కథ సంపుటి చదివితే బాలల వికాసానికి బాటలా సాకారం అవుతుంది. భవిష్యత్తులో యాడవడం చంద్రకాంత్ గౌడ్ మరిన్ని బాలల కథలు రాసి, పుస్తకాలు ప్రచురించి బాల సాహిత్య లోకంలో విహరించాలని ఆశిద్దాం.

ఉండ్రాళ్ళ రాజేశం
9966946084

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News