Wednesday, January 22, 2025

బాలల లేఖా సాహిత్యం

- Advertisement -
- Advertisement -

లేఖ, ఉత్తరం, జాబు అనేవి పర్యాయపదాలు. ‘లెటర్’ అనే ఆంగ్ల శబ్దాన్ని మనం ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నాం. ప్రపంచంలో మొట్టమొదటి లేఖ క్రీస్తుకు పూర్వం మెసపొటోమియాలో సెమిటిక్ లిపిలో రాయబడిందని ‘తెలుగులో లేఖాసాహిత్యం’లో మలయశ్రీ పేర్కొన్నాడు. నిజానికి ఉత్తరం రాయడం ఒక కళ! అత్మీయతకు చిహ్నంగా, మర్యాదకు లక్షణంగా, అవసరానికి బంధువుగా, ఆవేశానికి ఆయుధంగా, ప్రేమకు కానుకగా ఉత్తరాలు ఉపయోగపడుతున్నాయి. జాబు మనం రాసే ఉత్తరం, జవాబు వాళ్ళు రాసే ఉత్తరం అంటారు శ్రీశ్రీ. సంస్కృత వాఙ్మయంలో మనకు ఈ లేఖల ప్రస్తావన కనిపిస్తుంది. కాళిదాసు ‘మేఘసందేశం’ కావ్యంలో మబ్బుతో రాయబారాన్ని పంపడం మనకు తెలిసిందే. ఇదేగాక ప్రాచీన సాహిత్యంలో హంసలు, పావురాలు, రామచిలకలు లాంటి పక్షులతో, భటులు దూతలతో రాయబారాలు, లేఖలు పంపబడేవి.

ఇక తెలుగులో లేఖల ప్రాధాన్యాన్ని గుర్తించి వేలాది లేఖలను సేకరించింది చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ‘సంస్కార సౌజాన్యానికీ, జీవితాంశాల వివేచనకీ, స్నేహశీలతకీ, ప్రేమతత్వానికీ, భాష వైవిధ్యానికీ లేఖాసాహిత్య పరిశీలన ఎంతో ఉపయోగిస్తుంది’. ఆధునిక కాలంలో పండిత్ నెహ్రు వివిధ అంశాలు, వైజ్ఞానిక శాస్త్ర విషయాలు, చరిత్ర సంస్కృతులపై జైలు నుంచి ఇందిరాగాంధీకి రాసిన Letters from a father to Daughter గురించి మనకు తెలిసిందే.
నేటి ఆధునిక కాలంలో ‘జాషువా’ కావ్యం ‘గబ్బిలం’లో ఆయన పరమశివుడికి గబ్బిలంతో రాయబారం పంపడం చూస్తాం. కాలక్రమేణా కాగితం, సిరావంటివి వినియోగంలోకి రావడంతో ఉత్తరాలు, లేఖల రూపంలో వార్తలు, సందేశాలను పంపడం మొదలైంది. నిజానికి లేఖల ప్రారంభం కమ్యూనికేషన్ వ్యవస్థలో ఒక విప్లవంగా పేర్కొనవచ్చు. అటు తర్వాత వచ్చిన టెలిఫోన్ మరో గొప్ప పరిణామం.

సమాజంలో ప్రముఖ స్థానాలు అధిరోహించిన వ్యక్తుల లేఖలకు, ఒక్కోక్కసారి చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది. ఆ లేఖలు రాసినవారికీ, అందుకున్న వారికేకాక ఇతరులకు కూడా వాటి గురించి ఆసక్తి ఉంటుంది. ఆయా ప్రముఖులకు సంబంధించిన సమాచారం సాధారణంగా, ఆ లేఖలలో లభిస్తూ ఉంటుంది. సమాజానికి సంబంధించిన అనేక అంశాలమీద ఆయా ప్రముఖ వ్యక్తుల అభిప్రాయాలు, స్పందనలూ తెలుస్తాయి. వివిధ అంశాలను గురించి, సమస్యలను గురించి వారు చేసే వ్యాఖ్యలు జనసామాన్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. విలక్షణంగా వ్యక్తి మనస్తత్వానికి అద్దంపట్టే విధంగా ఉండే లేఖా సాహిత్యం రూపంలోనూ, ఆధునిక కాలంలో బాలబాలికల కోసం వైజ్ఞానిక శాస్త్ర విషయాలు వస్తువులుగా లేఖారచనలు వేలుబడ్డాయి. ప్రముఖ వైజ్ఞానిక శాస్త్ర రచయితలు వేమరాజు భానుమూర్తి, ఎ.వి.ఎస్. రామారావ్, ఆకెళ్ళ మార్కండేయశర్మ కె.ఎల్. నరసింహారావ్ వంటివారు ఈ విషయంలో మిక్కిలి కృషి చేశారని చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని లేఖల్ని, లేఖాసాహిత్యాన్ని పరిశీలిద్దాం.

చక్రవర్తికి లేఖలు

ఈ పుస్తకం 1956వ సంవత్సరంలో ఆదర్శ గ్రంధం, విజయవాడ వారి ద్వారా ప్రచురింపబడింది. దీనిని రచించిన వారు శ్రీమతి వేమరాజు సుభద్ర గారు. ఈ లేఖలన్నింటినీ న్యాయపతి రాఘవరావు గారు బాల పత్రికలో నెలనెలా ప్రచురించారట. వీటిని రచయిత్రి తన మరిది కోసం రాసుకున్న లేఖలనీ, వాటిని చూసిన న్యాయపతి రాఘవరావు మీ చక్రవర్తిలాంటి అల్లరి పిల్లలు ఆంధ్రదేశంలో అందరి ఇళ్ళలోనూ ఉన్నారు. మీ మరిది కోసం తయారుచేసిన ‘మంచిమందు’ ఒక్కొక్క మోతాదు వాళ్లకు కూడా ఇప్పించి పుణ్యం కట్టుకోండి. ఇది ఇంతమందికి ఏకకాలంలో ఎలా అందుతుంది అన్న సందేహం మీకు అక్కర్లేదు. కావాలంటే మోతాదుతో పాటు అనుపాన క్రమమంతా నెలనెలా బాలలో ప్రకటిద్దాం అని అన్నారని రచయిత్రి ఈ పుస్తకం ముందుమాటలో చెప్పారు.

ఈ పుస్తకంలో పదహారు లేఖలున్నాయి. ఒక్కో లేఖలో ఒక్కొక్క విశేషం చెప్పబడింది. మొదటి లేఖలో జలుబు, దగ్గు, రొంప వంటివి రాకుండా జాగ్రత్తపడాలనీ, ఒకవేళ వస్తే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ జబ్బులు మిగతా వాళ్ళకి అంటకుండా దూరంగా ఉండాలని చెబుతూ దానికో కథ చెబుతూ దానికో కథ చెప్పారు. ఈ కథను వారి భర్త వేమరాజు భానుమూర్తి చేప్పారనీ అది శామ్యుల్ బట్లర్ అనే ఆయన రాసిన పుస్తకంలోనిదని రచయిత్రి చెప్పారు. ఈ కథలో ‘ఏర్ వాన్’ అనే ఒక దేశం ఉంటుంది. ఆ దేశంలో ఎవరైనా జబ్బుపడితే ఆ దేశపు రాజు వాళ్లకి కఠిన శిక్షలు విదిస్తాడట. అయితే ఇలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది రచయిత్రి ఉహ మాత్రమే. కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఆసుపత్రులలో అంటువ్యాధులు వచ్చినవారి కోసం వేరే గది ఉంటుంది. ఆయా రోగగ్రస్తులను ఆ గదులలో ఉంచుతారు. మామూలు జనానికి దూరంగా వేరే గదిలో ఉండటం ఖైదీల లక్షణం కాబట్టి అలా చెప్పి ఉండవచ్చు.

రెండవ లేఖలో శ్వాసకు సంబంధించి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చుకోవడం మంచిదని చెప్పారు. మూడవ లేఖలో వెలుతురు గురించి విశేషాలు చెప్పారు. ఉదయం, సాయంత్రం లేత ఎండలో షికారు తిరగడం మంచిదనీ, గాంధీ గారు అలాగే చేసేవారని చెప్పారు. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్’ అని మనకున్న మంత్రాలు సూర్యుడు ఆరోగ్యమిస్తాడు అని అర్థం చెప్తాయన్నారు. నాల్గవ లేఖలో పరిశుభ్రం గురించి చెప్పారు. ఉదయం, సాయంత్రం చక్కగా స్నానాలు చేయాలనీ ఉతికి శుభ్రం చేసిన దుస్తులు వేసుకోవాలనీ, డిప్తీరియా, కలరా, టైఫాయిడ్, మశూచి మొదలగు వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలనీ వివరించారు. అందుకే మన పెద్దలు ‘దేహమే దేవాలయం’ అని చెప్పారు. ఐదవ లేఖలో పిల్ల లు గోళ్ళు కొరక కూడదని బోధించారు.గోళ్ళను శుభ్రం చేయకపోతే మట్టి బాక్టీరియా నోట్లోకి వెళ్ళి జబ్బులు కలుగచేస్తాయి. ఆరవ లేఖలో తలలో పేలు, కురుపులు వంటివి శుభ్రం లేకపోతే వస్తాయని . ఏడవ లేఖలో దంతాల శుభ్రం గురించి, ఎనిమిదో లేఖలో ఆహారం గురించీ, తొమ్మిదో లేఖలో నీరు ఎక్కువగా తాగాలనీ చెప్పారు. పదవ లేఖలో కాలకృత్యాలు సరియైన సమయంలో తీర్చుకోవాలనీ, పదకొండవ లేఖలో కంటి జాగ్రత్తలు చెప్పారు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ కదా! పన్నెండో లేఖలో చెవిలో గుబిలి తీయటానికి పిన్నీసులు, పుల్లలు పెట్టడం వలన కర్ణభేరి దెబ్బతింటుందని చెప్పారు. పదమూడవ లేఖలో వ్యాయామం ప్రాముఖ్యత గురించీ, పద్నాలుగవ లేఖలో పరిశుభ్రమైన దుస్తులు వేసుకోవాలనీ చెప్పారు. పదిహేనవ లేఖలో విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్త్త్రలనూ వివరించారు. ఈ పదహారు లేఖల ద్వారా పిల్లలకు అవసరమయ్యే అన్ని విషయాలనూ చర్చించారు.

వాడవాడలా విద్యుత్తు

అరవై పేజీల ఈ చిన్ని పుస్తకాన్ని ఆకెళ్ళ మార్కండేయశర్మగారు 1967లో రచించారు. ఈ పుస్తకం ఆధునిక విజ్ఞాన గ్రంథమాల కాకినాడ వారిచే ప్రచురింపబడింది. భారత ప్రభుత్వ విద్యాశాఖ వారు నిర్వహించిన తొమ్మిదవ పోటీలో బహుమతి పొందిన గ్రంథం. మనదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత పంచవర్ష ప్రణాళికల వలన దేశాన్ని అభివృద్ధిపరిచే మార్గంలో ఒక గ్రామమలో విద్యుచ్చక్తిని సరఫరా చేస్తారు. నూనె వత్తి లేకుండా దీపాలు ఎలా వెలుగుతున్నాయన్నది వారి మదిలో మెదిలే సందేహం. ఆ గ్రామంలో ఉన్న సుశీల అనే ఆమె తన తండ్రికి మాకు విద్యుచ్చక్తి వచ్చింది. కాబట్టి ఎన్నో సౌకర్యాలు పొందుతున్నాం. కానీ దీన్ని ఎలా తయారు చేస్తారు? దేనిగుండా అన్ని ఊళ్లకూ ఎలా పంపిస్తారు? విద్యుద్దీపాలు, పంకాలు, రేడియో, నీళ్ళమోటారు ఏ విధంగా పని చేస్తున్నాయి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియవు. కావున నాన్న మీరు శాస్త్రాంశాలు బోధించే ఆచార్యులు కాబట్టి ఈ విషయాలను తెలియజేయండి అంటూ ఉత్తరం రాస్తుంది. దానికి ఆమె తండ్రి మధుసూదన్ ‘ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు?’ అనే ఐదు ఉత్తరాల ద్వారా విద్యుచ్చక్తి గురించి కూలంకుషంగా తెలియజేస్తారు. పుస్తకం చివర విద్యుత్తును కనిపెట్టిన మైఖేల్ ఫారడే ఫోటో ను, అవసరమైన చోట్ల మరికొన్ని ఫోటోలు ఇవ్వడం ద్వారా పుస్తకం చదివినవారికి విషయాలు చక్కగా అర్థమవుతాయి.

నాన్నకు జవాబు

ఈ పుస్తకాన్ని సాక్షరతాభవన్, ఆంధ్రమహిళాసభ వారూ 1979లో చతుర్థ ముద్రణకే 10,000 కాపీలు ముద్రించినట్లు తెలుస్తోంది. దీని మొదటి ముద్రణ ఎప్పుడు జరిగిందో తెలియదు. దీని రచయిత కె.ఎల్. నరసింహారావు. భారత ప్రభుత్వం కొత్తగా అక్షరాస్యులైన వారికోసం రాయబడిన పుస్తకాలకు ఏర్పటు చేసిన పురస్కారం అందుకున్నది. ఈ పుస్తకం బాలలకు రాయబడినది అని ఎక్కడా ముద్రించలేదు కానీ కొత్తగా అక్షరాస్యులైన వారికి ప్రకటించారు. కాబట్టి చిన్న పిల్లలకు ఉపయోగపడేలా ఉంది.సంక్లిష్ట వాక్యాలూ, కష్టమైన పదాలూ లేవు. 5-8 సంవత్సరాల బాలలకు కూడా పనికొస్తుంది. ఈ జాబుల్ని చిన్న చిన్న వాక్యాలుగా రాశారు. రాజు అనే కొడుకు తన తండ్రికి 12 జాబులు రాస్తాడు. అదీ హైదరాబాద్‌లో వ్యవసాయరంగం గురించి తాను తెలుసుకున్న వివరాల గురించి తెలియజేస్తాడు.

అన్ని శాస్త్రాలూ కలిస్తేనే వ్యవసాయరంగం అని చెబుతాడు. చాలా చాలా చాలా సులభంగా అర్థమయ్యే వృత్తులు చాలా తక్కువున్న సామాన్య వాఖ్యలు ఉన్నాయిందులో. వరి వంగడాలలో రకాలు హంస, పద్మ, జయ అనీ మూడు నెలలు, ఆరు నెలలు, ఎనిమిది నెలలు అని రకరకాల పంటలు, వివిధ రకాల నెలలు, ఇలా ఎన్నో రకాల విషయాలను ఈ జవాబులో చర్చించారు. అలాగే ఎరువుల్లో కూడా నత్రజని ఎరువులు, పొటాషియం ఎరువులు, భాస్వరం ఎరువులు అని రకరకాలుంటాయి. నత్రజని తక్కువైతే మొక్క నాసిగా ఉంటుంది. ఎక్కువైతే మొక్క వంగిపోతుంది. పొటాషియం తక్కువైతే ఆకులు మాడినట్టుగా ఉంటాయి. భాస్వరం తక్కువైతే మొక్క బాగా ఎదగదు. ఎక్కువైతే ఈడు రాకముందే మొక్క కాపుకొస్తుంది. ఇలాంటివి ఎన్నో వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలను చాలా చిన్న చిన్న వాక్యాలుగా రాశారు. ఈ పుస్తకం వలన నగర బాలలకు వ్యవసాయ విషయాలు ఎన్నో తెలుస్తాయి.

మన చుట్టూ ప్రపంచం

ఈ పుస్తకాన్ని రచించినవారు ఎ.వి.యస్ రామారావ్. ఇది 1964లో ప్రచురింపబడింది. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత రాజకీయ చైతన్యం పెరిగి చదువుకునే వారి సంఖ్య పెరిగింది. కాబట్టి ప్రపంచం అంటే ఏమిటి? మన దేశం కాక మిగతా దేశాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడి వాతావరణ పరిస్థితులేమిటి? అవి మనకు మిత్రదేశాలో, శత్రుదేశాలో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. ఈ లేఖల ద్వారా ప్రపంచ దేశాలను జనసామాన్యానికి పరిచయం చేయాలని కోరుకున్నట్లు ముందుమాటలో రచయిత పేర్కొన్నాడు. అత్తవారింటనున్న కూతురు సుశీలకు తండ్రి చాణక్య రాసిన ఉత్తరాల సమాహారమే భూప్రపంచ పరిచయం.

భూమ్మీద ఎక్కువభాగం మహాసముద్రాలుగా నీరు నిండి ఉన్నది. ఖండాల గురించి, అలెగ్జాండరు దండయాత్రల గురించి ఈ పుస్తకంలో విపులంగా చర్చించబడింది. ప్రపంచయుద్ధాల గురించి, ఐక్యరాజ్యసమితి ఏర్పడిన విధం కూడా చెప్పబడింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల గురించి చాలా చక్కగా వివరించారు. ఇదంతా కూడా ఐదారు తరగతులు చదివే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావించి ఈ రచనను పరిశోధనలోకి తీసుకోవడం జరిగింది. వైజ్ఞానిక విషయాల్లో ఒక భాగమైన సోషల్ సైన్సెస్ విభాగం కిందికి ఈ రచన వస్తుంది. అక్కడక్కడా అవసరమైన చిత్రాలు కూడా ఇవ్వబడ్డాయి.

డా.కందేపి రాణీప్రసాద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News