Thursday, January 23, 2025

ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి

- Advertisement -
- Advertisement -

ఒకేరోజు లక్ష బస్తాలు రాక..
క్వింటాలు ధర రూ.20.850
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది .వరుసుగా మూడు రోజులపాటు సెలవు రావడం వల్ల సోమవారం నాడు దాదాపు లక్ష వరకు మిర్చి బస్తాలు వచ్చాయి. శుక్రవారం సార్వత్రిక సమ్మె, శని, ఆదివారాలు సెలవు దినాలు కావడం వల్ల సోమవారం మార్కెట్‌కు భారీగా మిర్చి వచ్చి చేరింది. దీనికి తోడు బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్నందున రైతులంతా మిర్చిని విక్రయించి జాతర వెళ్ళాలనే ఉద్దేశ్యంతో ఒకేసారి మార్కెట్‌కు తరలివచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఎపి నుంచి దాదాపు లక్ష బస్తాలను విక్రయానికి తరలించడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది. యార్డ్ లో ఎక్కడ చూసినా మిర్చి బస్తాలు నిండిపోవడంతో మార్కెట్ మెయిన్ గేట్, రెండో గేట్ ముందు బయట దాదాపు 2 వేల వస్తాలను నిల్వ చేశారు. తెల్లవారే సరికి మార్కెట్ పరిసర ప్రాంతంలో ఎక్కడ చూసినా మిర్చి బస్తాల వాహనాలు దర్శనమిచ్చాయి.

జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో స్థానిక వ్యాపారులు పోటీపడి పంట కొనుగోలు చేశారు. జెండా పాటలో మిర్చి పంట గరిష్ఠ ధర క్వింటాల్‌కు రూ. 20, 850 పలికింది. మధ్య రకం క్వింటాల్ రూ.19 వేలు, కనిష్ఠ ధర రూ.16 వేలు పలికింది. తాలు రకం పంటకు క్వింటాల్ రూ.12 వేల గరిష్ఠ ధరతో వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. భారీగా మిర్చి రావడంతో మంగళవారం నాడు మిర్చి కొనుగోళ్ళను నిలుపుదల చేశారు. ఈ సీజన్‌లో ఇంతపెద్ద మొత్తంలో మిర్చి తరలిరావడం ఇదే తొలిసారి. సోమవారం రాత్రి 69 వేల బస్తాలను తూకం వేయగా 40 శాతం తొలకాలు పూర్తి అయ్యినట్లు మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పూర్తి స్థాయిలో కాంటా, తొలకాలు పూర్తికానుందున మంగళవారం కొనుగోళ్ళను నిలిపివేశామని, రైతులు సరుకుతో వచ్చిన సరుకును తీసుకుంటాం కాని కొనుగోళ్లు బుధవారం చేస్తామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News