Monday, January 20, 2025

ఎల్‌ఎసి వద్ద చైనా భారీ నిర్మాణాలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: వాస్తవాధీన రేఖ వద్ద చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాయం పెంటగాన్ ఒక నివేదికలో పేర్కొంది.అండర్‌గ్రౌండ్ స్టోరేజిలు, కొత్త రోడ్లు, సైనిక పౌర వినియోగానికి వీలుగా కొత్త ఎయిర్‌పోర్టులు, హెలీప్యాడ్‌ల నిర్మిస్తోందని తెలిపింది. అదే సమయంలో డోక్లాం వద్ద కూడా అండర్‌గ్రౌండ్ స్టోరేజి ఫెసిలిటీలను ఏర్పాటు చేసింది. భూటాన్ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతానికి సమీపంలో గ్రామాల నిర్మాణం కూడా చేపట్టిందని ఆ నివేదిక పేర్కొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామంటూనే వివాదాస్పద ప్రాంతాలకు త్వరగా చేరుకునేందుకు వీలుగా డ్రాగన్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టిందని పెంటగాన్ తన నివేదికలో వెల్లడించింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన ‘ మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్‌మెంట్’ పేరుతో పెంటగాన్ ఈ నివేదికను విడుదల చేసింది.

మూడేళ్ల క్రితం తూర్పు లడఖ్ ప్రాంతంలోని కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పలు దఫాలుగా జరిగిన మిలిటరీ, దౌత్య చర్చల తర్వాత అనేక ప్రాంతాలనుంచి ఇరుదేశాల దళాలు వెనక్కి తగ్గినప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రశాంత వాతావరణం నెలకొనలేదు. ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరు పక్షాలు కూడా తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో చర్చలు పెద్దగా పురోగతి సాధించలేదని ఆ నివేదిక పేర్కొంది. చైనా సైన్యం 2022నుంచి ఎల్‌ఎసి సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల నిర్మాణం చేపట్టినట్లు ఆ నివేదిక తెలిపింది. అందులో రోడ్లు, విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు,భూగర్భ నీటి నిల్వ సౌకర్యాలు, ఎయిర్‌ఫీల్డ్‌లు,సైనిక స్థావరాలను చైనా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.

డోక్లామ్‌లో భూగర్భ నిల్వ సౌకర్యాన్ని నిర్మించిందని, ఎల్‌ఎసిలో ని మూడు భాగాల్లో కొత్త గా రోడ్ల నిర్మాణం జరిపిందని, భూటాన్ సరిహద్దుల్లో కొత్తగా గ్రామాలను ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా 2022లో సరిహద్దు రెజిమెంట్‌ను మోహరించిందని, దానికి సహకారం అందించేందుకు జిన్‌జియాంగ్, టిబెట్‌మిలిటరీ డిస్ట్రిక్ట్‌లలోని రెండు విభాగాలను సైతం మోహరించినట్లు పెంటగాన్ వివరించింది. వీటితో పాటుగా పశ్చిమ సెక్టార్‌లోని ఎల్‌ఎసిలో నాలుగు కంబైన్డ్ ఆర్మ్‌డ్ బ్రిగేడ్లను, ఈస్టర్న్ సెక్టార్‌లోని మూడు బ్రిగేడ్లను మోహరించిందని, ఎల్‌ఎసినుంచి కొన్ని బ్రిగేడ్లను ఉపసంహరించినా ఇంకా చాలా మంది సైనికులు ఉన్నారని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.కాగా చైనాభారీ ఎత్తున అణ్వాయుధాలను సమకూర్చుకుంటోందని పెంటగాన్ తన నివేదికలో తెలిపింది.2021తో పోలిస్తే వీటి సంఖ్య ఏకంగా 100పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం చైనా వద్ద 500పైగా అణు వార్‌హెడ్‌లు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయని,2030 నాటికి వీటి సంఖ్య 1000కి చేరుకునే అవకాశం ఉందని కూడా ఆ నివేదిక తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News