నూతన సంవత్సర వేడుకల వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. చైనా, తైవాన్ రెండూ వేర్వేరు కాదని ఆయన అన్నారు. తైవాన్ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరని జిన్పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ జలసంధికి రెండు వైపుల (చైనా, తైవాన్) ఉన్న చైనా ప్రజలు అంతా ఒకే కుటుంబం అని జిన్పింగ్ అన్నారు. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరని ఆయన చెప్పారు. మన మాతృభూమిని ఏకం చేయడాన్ని ఎవరూ అడ్డుకోజాలరని ఆయన అన్నారు. అందుకే తైవాన్ చుట్టూ వైమానిక,
నౌకాదళ విన్యాసాలు చేపట్టామని జిన్పింగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే చైనా, తైవాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ను బల ప్రయోగం ద్వారా ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. గత మే నెలలో లాయ్ చింగ్ తైవాన్ అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత ఆ దేశ ప్రాదేశిక జలాల్లో చైనా ఇప్పటి వరకు మూడు మార్లు భారీ మిలిటరీ విన్యాసాలు చేపట్టింది. వాస్తవానికి చైనా, తైవాన్ రెండు దేశాలు పరస్పర విరుద్ధమైన జీవన విధానాలు కలిగి ఉంటాయి. చైనా కమ్యూనిస్ట్ దేశం కాగా, తైవాన్ ప్రజాస్వామ్య దేశం.