Saturday, November 23, 2024

చైనా కొత్త ప్రధానిగా లీ కియాంగ్..

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనా నూతన ప్రధానిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన చైనా పార్లమెంట్ సమావేశంలో లీ కియాంగ్ అభ్యర్థితానికి అనుకూలంగా మొత్తం 2947 ఎన్‌పిసి సభ్యులలో 2936 ఓట్లు వచ్చాయి. దీనితో లీ కియాంగ్ ప్రధాని పదవికి ఎన్నికయినట్లు చైనా పార్లమెంట్ నిర్థారించింది. చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్‌కు లీకియాంగ్ అత్యంత సన్నిహితుడు. 63 సంవత్సరాల లీకియాంగ్ ఇప్పుడు ఉన్న ప్రధాని లీ కెకియాంగ్ స్థానంలో వచ్చారు. కెకియాంగ్ గత పది సంవత్సరాలుగా చైనా ప్రధానిగా ఉన్నారు. చైనా తిరుగులేని నేత జిన్‌పింగ్ లీ కియాంగ్ పేరును ప్రతిపాదించారు. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు దేశ పార్లమెంట్ అయిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పిసి) శనివారం సమావేశం అయింది. ఈ వార్షిక సదస్సు నామమాత్రపు నిర్ణయాధికార కార్యవర్గంగా ఉంది.

సాధారణంగా అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ( సిపిసి) చేసే ప్రతిపాదనలన్నింటిని మొక్కుబడి ప్రక్రియ తరువాత పార్లమెంట్ ఆమోదించడం ఆనవాయితీగా సాగుతోంది. ఇప్పుడు జరిగిన వార్షిక సమావేశంలో దేశాధ్యక్షులు జిన్‌పింగ్ ప్రతిపాదించిన అభ్యర్థికి ఆమోదముద్రవేశారు. అయితే ప్రెసిడెంట్ జిన్‌పింగ్ మాదిరిగా ఇది ఏకగ్రీవ ఎన్నిక కాలేదు. ప్రధాని పదవికి జరిగిన ఎన్నికలో ముగ్గురు వ్యతిరేకంగా ఓటేయగా, ఎనమండుగురు ఓటింగ్‌ను బహిష్కరించారని కొన్ని వివరాలను హాంగ్‌కాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక తెలిపింది. ఓటింగ్ తరువాత లీ కియాంగ్ దేశ ప్రధానిగా నిర్థారిస్తూ దేశాధ్యక్షులు ఉత్తర్వులు వెలువరించడం, ఆ తరువాత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని కియాంగ్ ప్రమాణం చేయడం జరిగిపొయ్యాయి.

తరువాత ప్రెసిడెంట్ జిన్‌పింగ్ కొత్త ప్రధానిని అభినందిస్తూ కరచాలనం చేసినప్పటి ఫోటోలు మీడియాకు వెలువరించారు. ప్రపంచ రెండో అతి పెద్ద ఆర్థికశక్తిగా ఉన్న చైనా గత మూడేళ్లుగా జీరో కోవిడ్ ఆంక్షల భారాన్ని ఇదే దశలో పలు కారణాలతో పశ్చిమ దేశాల నుంచి ఎదుర్కొంటున్న ఎదురుగాలుల మధ్య దిగజారుతోన్న పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రధానిపై ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News