Monday, December 23, 2024

యుఎఫ్‌ఒల కూల్చివేత

- Advertisement -
- Advertisement -

ఇటీవల చైనాకు సంబంధించిన గూఢచర్య బెలూన్ (స్పై బెలూన్)ను అట్లాంటిస్ మహా సముద్ర ప్రాంతంలో కూల్చి వేసినా అమెరికాలో వరుసగా మూడు ‘గుర్తు తెలియని ఎగిరే వస్తువు (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెకట్స్, యుఎఫ్‌ఒ)’ లను కూడా కూల్చివేయడం కలకలం సృష్టించాయి. 28 జనవరి 2023న అమెరికా గగనతలంలో కనిపించిన చైనా గూఢచర్య బెలూన్‌ను ఫిబ్రవరి 4వ తేదీన అమెరికా కూల్చి వేయడంతో రెండు దేశాల మధ్య దౌత్య సంక్షోభం ఏర్పడినట్లు పెంటగన్ అధికారులు భావిస్తున్నారు. మూడు బస్సుల సైజ్‌లో ఉన్న చైనా బెలూన్ అమెరికా గగనతలంపై 65,000 అడుగుల ఎత్తున ఎగరడం గమనించిన అమెరికా వెంటనే తీవ్ర స్వరంతో స్పందించి కూల్చివేసింది. చైనా బెలూన్‌ను కూల్చి వేసిన తరువాత అమెరికా, కెనడాలు అప్రమత్తం కావడం, గగనతల గస్తీ వ్యవస్థలను పెంచడం జరుగుతున్నది. అమెరికా మిలిటరీ అంచనాల ప్రకారం అమెరికా రక్షణ వ్యవస్థల నిఘా సమాచార సేకరణ నిమిత్తం చైనా బెలూన్‌ను వాడడం జరిగినట్లు భావిస్తున్నారు.
యుఎఫ్‌ఒల కూల్చివేత కలకలం

అలస్కా ప్రాంత సముద్రంలో ఒక కారు సైజ్‌లో ఉన్న ఒక గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యుఎఫ్‌ఒ)ను యూయస్ ఫైటర్ జెట్ 10 ఫిబ్రవరి కూల్చి వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 11న సిలిండర్ ఆకారంలో ఉన్న మరో యుఎఫ్‌ఒను అలస్కా సరిహద్దులోని యుకోన్ ప్రాంతంలో అమెరికన్ యఫ్-22 ఫైటర్ కూల్చి వేసినట్లు కెనడా అధికారులు తెలుపడం కొంత ఆందోళన కలిగించే వార్తగా గుర్తించారు. ఈ యుఎఫ్‌ఒ లక్ష్యం ఏమిటో పూర్తిగా తెలియనప్పటికీ గగనసీమ నియమాలను ఉల్లంఘించడం తీవ్ర పరిణామంగా కెనడా అధికారులు గుర్తిస్తున్నారు. 12 ఫిబ్రవరి రోజున 20,000 అడుగుల ఎత్తున మోంటానా, మిచిగాన్ ప్రాంతాల్లో కనిపించిన అష్టభుజ ఆకారం కలిగిన యుయఫ్‌ఒను వరుసగా మూడవసారి కూల్చి వేసినట్లు ప్రకటించారు.

గ్రహాంతరవాసుల పనేనా..!

కొద్ది రోజుల వ్యవధిలోనే మూడు యుఎఫ్‌ఒలను కూల్చివేసిన అమెరికా అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుఎఫ్‌ఒలు గ్రహాంతరవాసుల పని కావచ్చని కూడా ఆలోచిస్తున్నారు. ఎలాంటి మానవ ఉనికి కనిపించని ఈ యుఎఫ్‌ఒలు ఎలాంటి సమాచారాన్ని లేదా సిగ్నల్స్‌ను పంపకపోయినప్పటికీ ఇవి దేశ రక్షణ వ్యవస్థలకు, పౌర విమాన రద్దీకి తీవ్ర ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.మూడు రోజుల్లో మూడు రహస్య మానవ రహిత యుఎఫ్‌ఒలు గగనతలంలో విహరిస్తున్నల గుర్తు తెలియని వస్తువులను లేదా ఏలియన్స్‌ను గుర్తించడం దేశ భద్రతకు, పౌర విమాన రక్షణకు ప్రమాదకరంగా మారినట్లు అందరు అంగీకరిస్తున్నారు.

అమెరికా ఎదుర్కొంటున్న ఈ ప్రమాదకర అనుభవంతో ప్రపంచ దేశాల రక్షణ వ్యవస్థలు తమ తమ గగనసీమ గస్తీలను పెంచడం, ఈ యుఎఫ్‌ఒల లక్ష్యం, మూలాలను తెలుసుకునే పరిశోధనలకు పదును పెట్టడం సముచితంగా ఉన్నది. ప్రపంచ వ్యాప్త దేశాల రక్షణ వ్యవస్థలు అమెరికా వ్యవస్థల స్థాయిలో ఉండకపోవచ్చని, యుఎఫ్‌ఒలు గగనతలంలో తిరిగినా గుర్తించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నీ దేశాలకు లేకపోవచ్చని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థలను తెలుసుకోవడానికి చైనా సంధించిన గూఢచర్య బెలూన్ ఘటన ముక్తకంఠంతో ఖండించవలసిందే. ఇలాంటి అంతర్జాతీయ గగనసీమ నియమాలకు విరుద్ధంగా జరిపే గూఢచర్య ఘటనలు రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకరంగా మారక ముందే తగు చర్యలు తీసుకోవాలని పౌర సమాజం కోరుకుంటున్నది.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News