పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లోని సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారిని నిర్మిస్తోంది. ఈ దిశలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఉపగ్రహ ఆధారిత ఛాయాచిత్రాల ద్వారా భారత రక్షణ శాఖ నిపుణులు నిర్థారించారు. గత ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆరంభమైనట్లు గుర్తించారు. ఈ నిర్మాణం పూర్తిగా భారతదేశ ప్రాదేశికత సమగ్రతల ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు స్పందించారు. దేశ సార్వభౌమాధికారికతను కించపరిచే చర్యగా దీనిని పరిగణిస్తున్నారు. ప్రపంచంలోనే అతి ఎతైన యుద్ధ ప్రాంతంగా సియాచిన్ గ్లేసియర్స్‌కు పేరుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భాగంలో సియాచిన్ వద్ద చేపట్టిన పనులు మౌలిక స్థాయిని దాటి ఇప్పుడు రాదార్ల ఏర్పాటు దిశగా ఉన్నాయని వెల్లడైంది.
సియాచిన్‌కు ఉత్తరప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకంగా తన మౌలిక సాధనాసంపత్తిని పెంచుకునేందుకు, తద్వారా భారతదేశ భద్రతా వ్యవస్థకు సవాళ్లు విసరడం చైనా ఆలోచన అని వెల్లడైంది. పిఒకెలోని అత్యంత కీలకమైన షక్సగమ్ లోయను చైనా 1963లో తన ఆక్రమణలోకి తీసుకుంది. ఇక్కడి ఇప్పటి మార్గం చైనాలోని జిన్‌జియాంగ్ అనుసంధాన హైవే జి 219కు మరింత విస్తరణ రాదారిగా ఏర్పాటు అవుతోంది. ఈ రోడ్డు చివరి భాగం భారతదేశపు ఉత్తర చివరి భాగపు సియాచిన్ గ్లేసియర్‌లలోని ఇందిర కల్ లేదా ఇందిరా పాయింట్ వద్ద ఉండే పర్వతాల వద్ద 50 కిలోమీటర్ల లోపున ముగుస్తుంది. ఇది భారతదేశానికి సంబంధించి అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఈ ఫార్వర్డ్ పాయింట్ వద్దకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత ఏడాది మార్చి నుంచి రెంప సార్లు పర్యటించివచ్చారు ఈ దశలోనే నిర్మాణ పనులు చేపట్టి చైనా దూకుడు ప్రదర్శించింది.