చైనాలో ఇటీవల ఓ వ్యక్తి నిర్లక్షంగా కారు నడిపి 35 మంది ప్రాణాలను బలిగొన్న కేసులో నిందితుడికి మరణ శిక్ష పడింది. ఈమేరకు న్యాయస్థానం ఆదేశాల ప్రకారం అతడికి శిక్షఅమలు చేశారు. మరో కేసులో ఓ యువకుడికి ఇదే విధంగా మరణశిక్ష అమలు చేసినట్టు చైనా అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది. చైనాకు చెందిన ఫాన్ వీకియూ (62) అనే వ్యక్తి గత ఏడాది నవంబర్ 11న ఝుహాయ్ నగరం లోని స్పోర్ట్ కాంప్లెక్స్ బయట నిర్లక్షంగా కారు నడిపారు. అక్కడ వ్యాయామం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన ఘటనలో 35 మంది మరణించగా, మరో 40 మంది గాయపడ్డారు. అనంతరం కారులో తనను తాను కత్తితో పొడుచుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు.
కోమా లోకి వెళ్లిన అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ఇటీవలే విడాకులు తీసుకున్నాడని, భార్యతో జరిగిన ఆస్తి పంపకం లో అసంతృప్తికి గురవడంతో అతడు ఈ ఘోరానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ సంఘటన అత్యంత ఘోరమైనదిగా పేర్కొంటూ నిందితుడికి మరణశిక్ష విధించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతడికి మరణశిక్ష అమలు చేసినట్టు చైనా అధికారిక మీడియా తెలియజేసింది. చైనాలో ఇటువంటి దారుణాలు అరుదే అయినప్పటికీ గత ఏడాది అక్కడ ఈ తరహా సంఘటనలు వరుసగా చోటు చేసుకోవడం గమనార్హం. జియాంగ్సు ప్రావిన్స్‌లో గత నవంబర్‌లో ఓ యువకుడు కత్తులతో దాడికి పాల్పడిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఈ కేసులో న్యాయస్థానం నిందితుడికి మరణశిక్ష విధించింది. పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ఈ 21 ఏళ్ల యువకుడికి కూడా మరణశిక్ష అమలు చేశారు.