Monday, January 20, 2025

చంద్రుడి ఆవలి దిక్కుకు చలో చైనా

- Advertisement -
- Advertisement -

చైనా శుక్రవారం చంద్రమండలంపై అన్వేషణలలో భాగంగా చాంగే 6 యాత్రను చేపట్టింది. 53 రోజుల పాటు సాగే ఈ చంద్రమండల యాత్రలో చైనా చంద్రుడి ఆవలివైపున ఉండే చంద్రశిలలను , అక్కడి ఖనిజాల నమూనాలను సేకరిస్తుంది. వీటిపై శాస్త్రీయ అధ్యయనం సాగిస్తుంది. భూమి నుంచి ఎవరికి కన్పించకుండా ఉండే చంద్రుడి ఆవలి వైపున ఏముందనేది ఆరాతీయడానికి ఈ ప్రయోగం చేపట్టారు. ఛాంగే 6 మిషన్ విజయవంతంగా ఆరంభమైందని చైనా జాతీయ అంతరిక్ష నిర్వహణ సంస్థ (సిఎన్‌ఎస్‌ఎ) శుక్రవారం ప్రకటించింది. ఇంతవరకూ చంద్ర మండల వెనుక ప్రాంతంలోని విశేషాల పరిశోధనలు జరగలేదని, ఈ క్రమంలో ఇప్పటి చాంగే 6 మిషన్ విజయవంతం అయితే అది అంతరిక్ష పరిశోధనలలో కీలక ఘట్టం అవుతుందని చైనా అధికారికంగా తెలిపింది.

చైనా దక్షణ దీవి ప్రాంతం హైనన్ తీరంలోని వెన్‌చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చాంగే 6ను లాంగ్ మార్చ్ 5 వై 8 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగించారు. ఈ ప్రయోగ ఘట్టాన్ని చైనా అధికారిక టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. చంద్రుడి దక్షణ ధృవంలో ఉండే దుమ్మూ, శిలలను సేకరించడం జరుగుతుంది. తమ ఈ మిషన్ అత్యంత అధునాతన సాంకేతికను సంతరించుకుందని అంతకు ముందు చైనా అంతరిక్ష సంస్థ తెలిపింది. ఆటోమోటిక్ శాంపుల్ కలక్షన్, సేకరణ, చంద్రుడిలోని సుదూర ప్రాంతాలలో కలియతిరగడం వంటి వాటితో తిరుగులేని ఫలితాలను సాధిస్తుందని వెల్లడించారు. ఇక ఇప్పటి చైనా మిషన్‌లో భాగంగా ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, స్వీడన్ పేలోడ్స్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన శాటిలైట్ ఐక్యూబ్ క్యూ కూడా ఉంటుంది. పాకిస్థాన్ అంతరిక్ష సంస్థ సుపార్కో , చైనాలోని షాంఘై యూనివర్శిటీ ఎస్‌జెటియు సహకారంత ఈ శాటిలైట్‌ను రూపొందించింది.

పాకిస్థాన్‌కు చెందిన ఒక శాటిలైట్‌ను చైనా తమ చంద్ర మండల యాత్రలో అంతర్భాగంగా తీసుకువెళ్లడం ఇదే తొలిసారి. పాక్ శాటిలైట్‌పై ఉండే అమరికల నుంచి చంద్రుడి ఉపరితలాన్ని ఫోటో తీసేందుకు వీలుంటుంది. ఇంతకు ముందు చైనా తలపెట్టిన చాంగే 5 ప్రయోగం క్రమంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే నమూనాలను సేకరించారు. అక్కడి బురదను సేకరించడం ద్వారా చంద్రుడిపై నీటి ఉనికి గురించి సమాచారం రాబట్టారు. అంతా అనుకూలిస్తే చంద్రుడిపై ప్రత్యేకంగా పరిశోధనల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ఆలోచిస్తోంది. చంద్రుడిపైకి 2030 నాటికి మనిషిని పంపించేందుకు కూడా చైనా సంకల్పించింది. కాగా ఇప్పటికైతే చంద్రుడి దక్షణ ధృవం ప్రాంతంలో విజయవంతంగా తమ మిషన్‌ను చంద్రయాన్ 3 ద్వారా చేపట్టిన తొలి దేశపు ఘనత భారతదేశానిదే. అయితే ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో అన్వేషణ, పరిశోధనల విషయంలో భారతదేశం మరింతగా సాగాల్సి ఉంది. ఈ దశలోనే చంద్రుడి లోతట్టు ప్రాంతాలలోకి చైనా తన ప్రయోగాలను ముమ్మరం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News