Monday, December 23, 2024

చైనా బైబిల్‌ను తిరగరాయిస్తున్నదా?

- Advertisement -
- Advertisement -

మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ(సిసిపి) బైబిల్‌ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఎంపి మైక్ గాలఘెర్ చైనా మీద ఆరోపించాడు. జనాలు దేవుడి కంటే పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉండేట్లుగా మార్చాలని, దానికి గాను అన్ని మతాలను చైనీకరణ గావించాలని, మతం, సోషలిజం ఒకదానికి ఒకటి తోడుగా ఉనికిలో ఉండేట్లు చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగినపుడు 2017లో అధినేత షీ జిన్‌పింగ్ కోరినట్లు, దానిలో భాగంగానే బైబిల్‌ను తిరగరాస్తున్నారని కూడా మైక్ ఆరోపించాడు.ఈ ప్రచారాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు.

పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగరాసే పని పెట్టుకున్నారన్నది వాటిలో ఒకటి. దీన్ని ఒక్క క్రైస్తవ మతానికే పరిమితం చేయలేదని బౌద్ధం, ఇస్లాంకు కూడా వర్తింప చేస్తున్నారని మైక్ ఆరోపించాడు. మతం మీద పూర్తి అధికారాన్ని సాధించేందుకు సిసిపి చూస్తున్నదనే ప్రచారాన్ని అనేక క్రైస్తవ మత సంస్థలు, మీడియాలో కూడా గత ఆరు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. మతం, సోషలిజం సహ జీవనం అన్నది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. మత స్వేచ్ఛను అనుమతించటం అంటే ప్రోత్సహించటం, ఉనికిని కాపాడటం కాదు. తరతరాలుగా వేళ్లూనుకున్న భావనలను క్రమంగా పోగొట్టాలి తప్ప ప్రార్ధనా మందిరాలను కూల్చివేసినా, నిషేధాలతో అణచివేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి.

చిత్రం ఏమిటంటే మతాన్ని అణచి వేస్తున్నట్లు ఒక వైపు ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే 2018లో చైనా ప్రభుత్వంతో పోప్ ఒక ఒప్పందం చేసుకున్నారు.దాని ప్రకారం ప్రభుత్వం ఎంపిక చేసిన వారిని చైనాలో కాథలిక్ మత అధిపతులుగా పోప్ ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా టిబెట్‌లో తదుపరి దలైలామాను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు గాను ముందుగా పోప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక బైబిల్‌ను తిరగరాస్తున్నారని చెప్పేందుకు మైక్ గాలఘెర్ రెండు ఆరోపణలు చేశాడు. న్యూటెస్ట్‌మెంట్ బైబిల్‌లో జాన్ సువార్త ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక మహిళను రాళ్లతో కొట్టడాన్ని చూసిన ఏసుక్రీస్తు వారి వద్దకు వెళ్లి మీలో పాపం చేయని వారెవరైనా ఉంటే ముందుగావారు వచ్చి కొట్టమని చెప్పారన్న కథ అందరికీ తెలిసిందే.దాన్ని చైనా వారు మార్చి ఏసుక్రీస్తే స్వయంగా రాళ్లు వేసినట్లు రాశారని మైక్ ఆరోపించాడు. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. మరి కొన్ని దీన్నే మరో విధంగా ప్రచారం చేస్తున్నారు. ఏసుక్రీస్తు జోక్యం చేసుకున్న తరువాత రాళ్లు వేసిన వారు వెళ్లిపోయారని, వారు నిన్ను చంపారా అని సదరు మహిళను అడిగితే లేదని ఆమె చెప్పిన తరువాత వారు గాక పోతే నేనే చంపేస్తా, ఇలాంటి పాపం మరొకసారి చేయ వద్దు, వెళ్లిపో అన్నట్లుగా బైబిల్‌ను తిరగరాసినట్లు ప్రచారం చేస్తున్నారు. మరొక కథనం ప్రకారం ఫార్సీ (నాటి చట్టాల గురించి తెలిసినవారు) యూదులు ఒకమహిళను తీసుకు వచ్చి ఏసుక్రీస్తు ముందు నిలిపారు.

బోధకుడా ఈ మహిళ వ్యభిచారం చేస్తూ పట్టుబడినది. చట్టం, మోజెస్ మాకు చెప్పిన దాని ప్రకారం అలాంటి మహిళను రాళ్లతో కొట్టాలి. ఇప్పుడు మీరేమి చెబుతారు అని ప్రశ్నించారట. ఇదంతా ఏసుక్రీస్తును ఉచ్చులో ఇరికించేందుకు యూదు నేతలు చేశారట. అప్పుడు ఏసు క్రీస్తు నేల మీద వేలితో ఏదో రాస్తూ (అదేమిటో ఇప్పటికీ తెలియదట) మీలో పాపం చేయని వారెవరైనా ఉంటే ముందుగా వారు రాళ్లతో కొట్టండి అన్నారట. దాంతో వణికిపోయివారు అక్కడి నుంచి వెళ్లిపోయారట. అప్పుడు ఏసు మహిళా వారెక్కడ, ఎవరూ నీ మీద దాడి చేయలేదు కదా అంటే అవునయ్యా అందట. నేను కూడా నిన్ను కొట్టను వెళ్లిపో నీ జీవితంలో ఇంక పాపం చేయవద్దు అన్నాడట. అలా అందరూ వెళ్లిన తరువాత ఏసు ఆమెను స్వయంగా రాయితో కొట్టి నేను కూడా పాపినే అని చెప్పినట్లు చైనా కమ్యూనిస్టులు తిరగరాస్తున్న బైబిల్‌లో ఉందని, దాన్ని తరగతి పుస్తకాల్లో పెట్టారని కొన్ని క్రైస్తవ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఇది ఏసు దైవత్వాన్ని కించపరచటమే అని ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం చైనా, మన దేశం, ఇంకా అనేక దేశాల్లో ఉన్న చట్టం ప్రకారం అక్రమ సంబంధం నేరం కాదు. అందువలన దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టాలని, ఏసుక్రీస్తే ఆ పని చేశారు గనుక మీరూ చేయవచ్చని చైనాలో ఉన్న క్రైస్తవులకు గానీ, మరొకరికి గానీ చెప్పాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు, అందుకుగాను బైబిల్‌ను తిరగరాయాల్సిన అగత్యమూ లేదు. దానికీ సోషలిస్టు సమాజ నిర్మాణానికీ సంబంధం లేదు. అలాగని అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తున్నదీ లేదు.

ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ కారణం తో విడాకులు తీసుకోవచ్చని చైనా చట్టాలలో ఉంది. వివాహం చేసుకున్నప్పటికీ స్త్రీ సదరు పురుషుడి ఆస్తికాదు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 497 ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే సదరు పరపురుషుడు అవివాహితుడైనప్పటికీ అభియోగం రుజువైతే ఐదు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. వివాహిత మహిళకు ఎలాంటి శిక్ష ఉండదు. ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని 2018 సెప్టెంబరు 27న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరొకరి భాగస్వామి అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే నగదు జరిమానా విధించవచ్చని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెప్పింది.చైనాలోని హేనాన్ రాష్ర్టంలోని ప్రొటెస్టెంట్ చర్చిలలో టెన్‌కమాండ్‌మెంట్స్ బదులు చైనా అధినేత షీ జిన్‌పింగ్ చెప్పిన మాటలను బోధించాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు బలవంతం చేస్తున్నారని, ఈ మేరకు మొదటి కమాండ్‌మెంట్‌ను మార్చి రాశారని కూడా అమెరికన్ ఎంపి ఆరోపించాడు.

పశ్చిమ దేశాల భావజాలాన్ని చొరనివ్వకుండా ఇలా చేస్తున్నారని, తిరస్కరించిన ఇద్దరు పాస్టర్లను శిక్షించినట్లు, ఇతరులను అడ్డుకుంటున్నట్లు ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సరన్(ఐసిసి) నివేదించినట్లు పార్లమెంటు కమిటీ ముందు చెప్పాడు. బైబిల్ రెండు రకాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అన్నగ్రంధాలు మనం ఎక్కడైనా చూడవచ్చు. వాటిని తిరగ రాసింది క్రైస్తవులు తప్ప కమ్యూనిస్టులు కాదు. వివిధ మత గ్రంధాల మీద అనేక మంది భిన్నమైన భాష్యాలు రాశారు. క్రైస్తవం కమ్యూనిజానికి అనుకూలమని, వ్యతిరేకమని బైబిల్‌లో ఉన్న అంశాలకు వ్యాఖ్యానం చెప్పిన వారు లేకపోలేదు. అసలు ఏసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు, బైబిల్ అంశాలను ఎవరు, ఎప్పుడు ప్రబోధించారు లేదా ఎప్పుడు రాశారు? అప్పటికీ అసలు కమ్యూనిజం, సోషలిజం అన్న ప్రాథమిక భావనలు కూడా లేవు. అలాంటపుడు ప్రబోధకులు లేదా రాసిన వారు వాటికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలా వాదనలు చేయగలరు. బైబిల్‌ను తిరగరాసి దానిలో ఇలా ఉంది అని చెప్పి జనాన్ని కమ్యూనిజానికి అనుకూలంగా మార్చేంత భావ దారిద్య్రంలో ప్రపంచంలో ఏ కమ్యూనిస్టులూ లేరు. దోపిడీకి వ్యతిరేకంగా జరిపే పోరాటాలను పక్కదారి పట్టించేందుకు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు ప్రతి మతం యత్నించటాన్ని రోజూ మనం చూస్తున్నదే. మన దేశంలో మనుధర్మం పేరుతో అమలు జరిపిన వివక్ష, దుర్మార్గాలు చేస్తున్నపుడే సర్వేజనా సుఖినోభవంతు అని కూడా చెప్పారు.

అందువలన అలా చెప్పిన వారిని మన దేశంలో తొలి సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటారా? ప్రతి సమాజంలో దుర్మార్గాలను చూడలేని అనేక మంది తమ వాంఛలను వెల్లడించారు. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే శాస్త్రీయ సిద్ధాంతం, ఆచరణలను కమ్యూనిస్టులు చెప్పారు. వ్యక్తులకు, వారి ఇండ్లకు, ప్రార్ధనా స్థలాలకు పరిమితం కావాల్సిన మతాన్ని వీధులు, రాజకీయాలు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు తీసుకు రావటాన్ని కమ్యూనిస్టులే కాదు, హేతువాదులు, పురోగామివాదులెవరూ అంగీకరించరు. దేశాల మీద మతపెత్తనం కుదరదు, మత రాజ్యాలు అంతరించాయి. మతం పేరుతో విద్రోహానికి పూనుకుంటే సహించాల్సిన అవసరం ఉందా? తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్ కూల్చివేతలో క్రైస్తవమత పెద్దలు కూడా అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులతో చేతులుకలిపిన చరిత్ర మన కళ్ల ముందు ఉంది. అటువంటి కుట్రలను చైనా సాగనివ్వటం లేదు గనుక దాని మీద తప్పుడు ప్రచారాలు అన్నది స్పష్టం. చైనాలో బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంధాన్ని కూడా సహించరని ప్రచారం చేస్తున్న క్రైస్తవ సంస్థలు నేడు ఐరోపాలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకత, ఖురాన్ గ్రంధాలను తగులపెడుతున్న ఉదంతాల గురించి ఎక్కడా మాట్లాడవు. స్టాక్‌హోవ్‌ులోని టర్కీ ఎంబసీముందు ఖురాన్ ప్రతిని తగుల బెట్టేందుకు స్వీడన్ ప్రభుత్వం ఏకంగా అధికారిక అనుమతి మంజూరు చేసింది.

ఇంకా అనేక దేశాల్లో పచ్చి ముస్లిం వ్యతిరేకులు ఇలానే రెచ్చిపోతున్నారు. వాటి గురించి అమెరికా ఎంపీలెవరూ మాట్లాడరు. అమర జీవుల గళం (విఒఎం) పేరుతో పని చేస్తున్న ఒక సంస్థ ప్రతినిధి టోడ్ నెటెల్టన్ ఒక పత్రికతో మాట్లాడుతూ పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగ రాయాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 2019లో నిర్ణయించిందని, దానిలో కన్ఫూసియస్, బౌద్ధ సూత్రాలను కూడా చొప్పించి పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా రాస్తారని ఆరోపించాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 140 కోట్ల చైనా జనాభాలో ఇండెక్స్ ముండీ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం క్రైస్తవులు కేవలం 5.2, ముస్లింలు రెండు శాతమే. ఏ మతానికీ చెందని వారు 51.8, స్థానిక తెగల మతాల వారు 21.9, బౌద్ధులు 18.3 శాతాల చొప్పున ఉన్నారు. మన దేశంలో మాదిరి 80 శాతం మంది ఉన్న హిందూ మతానికి ముస్లిం, క్రైస్తవుల నుంచి ముప్పు వచ్చిందని చెప్పేవారెవరూ అక్కడలేరు. ప్రపంచంలో ఎక్కడా వర్తమాన కాలంలో ఏదేశంలోనూ ఒక మతస్థులు తమ జనాభాను విపరీతంగా పెంచి మరొక మతానికి ముప్పు తెచ్చిన ఉదంతమేదీ జరగలేదు.

చైనాలో నిజంగా బైబిల్‌ను తిరగరాస్తూ దానిలో కొన్ని భాగాలను ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఉంటే రోవ్‌ులో ఉన్న క్రైస్తవమత కేంద్రానికి, పోప్‌కు తెలియకుండా ఉంటుందా? తెలిస్తే అధికారికంగానే దాని మీద స్పందించిన దాఖలా ఇంతవరకు లేదు. క్రైస్తవుల కోసం పని చేస్తున్నామంటూ ప్రచారం చేసుకొనే వారూ, పత్రికల్లో రాతలు రాసేవారూ చివరికి పోప్ ఫ్రాన్సిస్‌ను కూడా వదలటం లేదు. చైనా అక్రమంగా నియమించిన షాంఘై బిషప్‌ను అంగీకరించినట్లు ధ్వజమెత్తారు. 2018లో చైనాతో పోప్ కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పటికీ రహస్యమేనని, దాన్ని ఇప్పటికి రెండు సార్లు సమీక్షించినట్లు జులై 27న ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. ఒప్పందం ప్రకారం బిషప్పులను ఎంపిక చేసేది చైనా అయినా అధికారికంగా ప్రకటించాల్సింది పోప్ అని దానికి విరుద్ధంగా షాంఘై బిషప్ వ్యవహారం ఉందని, వాటికన్‌కు ఆ సంగతి పత్రికా వార్తల ద్వారా తెలిసిందని కూడా ఆరోపించాడు. ఏప్రిల్ నాలుగున నియామకం జరిగితే జులై 15న పోప్ అధికారికంగా ప్రకటించారని వాపోయాడు. గొడవలెందుకని ఊరుకొని ఆమోదించాం గానీ చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పరోలిన్ చెప్పినట్లు కూడా రాశాడు.

2018 ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా చర్చి సమావేశాలు నిర్వహించటాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. అలాంటి వారంతా చైనా ప్రభుత్వం గుర్తించిన దేశభక్త కాథలిక్ చర్చిలో విలీనం కావాలి. కానీ ఇప్పటికీ రహస్య చర్చలు కొనసాగుతున్నట్లు వాటికన్ మంత్రి అంగీకరించాడు. అలా చేరని వారి మనోభావాలను గౌరవించాలని కూడా ఇప్పుడు మంత్రి చెప్పటాన్ని బట్టి దాని అర్ధం వారికి వెలుపలి నుంచి మద్దతు లభిస్తున్నది. వారికి రక్షణ కల్పించాలని అనేక మంది పత్రికల్లో డిమాండ్ చేస్తున్నారంటే పోప్ కుదుర్చుకున్న ఒప్పందానికి తూట్లు పొడవటం, ధిక్కరణ తప్ప మరొకకాదు. బైబిల్‌ను తిరగరాయాలంటే ఎక్కడైనా పది సంవత్సరాలు అవసరం లేదు. తెల్లవారేసరికి పోటీ గ్రంధాలను రాసేవారున్నారు. కమ్యూనిస్టులు అలాంటి పనికిమాలిన పనిపెట్టుకోరు.గతంలో మతాన్ని అనుమతించరని, ప్రార్ధనా మందిరాలను కూల్చివేశారని చేసిన ప్రచారం అబద్ధమని తేలింది. అందువలన ఎత్తుగడలను మార్చి మతాన్ని తమకు అనుకూలంగా మారుస్తున్నారని, మత గ్రంధాలను తిరగరాస్తున్నారనే తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News