చైనా సిడిసి డైరెక్టర్ స్పష్టీకరణ
బీజింగ్ : కరోనాను నియంత్రించే సామర్థ్యం తమ టీకాలకు అంతగా లేదని, అందువల్ల తమ దేశంలో అభివృద్ధి చేసిన రెండు టీకాలను కలగలిపి వాటి సామర్థ్యాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సిడిసి గావో ఫూ తెలిపారు. సామర్థ్యం ఎక్కువగా లేనందున వాటిని వినియోగించడంపై తర్జనభర్జన పడుతున్నామని గావో తెలిపారు. కరోనా టీకాలను తయారు చేయడానికి ఉపయోగించిన ఎంఆర్‌ఎన్‌ఎ పద్ధతిని స్వయంగా తప్పు పట్టిన గావోయే ఇప్పుడు ఎంఆర్‌ఎన్‌ఎ విధానంలో టీకాలను తయారు చేసే ప్రక్రియను పరిగణన లోకి తీసుకోవాలని సూచించారు.. పశ్చిమ దేశాల టీకాలపై ఒకప్పుడు అక్కసు వెళ్ల గక్కిన చైనా ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని ఒప్పుకోక తప్పడం లేదు. చైనాకు చెందిన సినోవ్యాక్ రూపొందించిన కరోనా టీకాకు 50.4 శాతం సామర్థ్యం ఉందని బ్రెజిల్ నిర్ధారించింది. అదే అమెరికాలో తయారు చేసిన ఫైజర్ టీకా సామర్థ్యం 97 శాతం అని రుజువైంది. చైనాలో 34 మిలియన్ల మందికి రెండు డోసుల టీకా 64 మిలియన్ల మందికి ఒక డోసు అందించారు.