బీజింగ్: గాజాలో ఇజ్రాయెల్ ప్రస్తుత దాడులపై చైనా పరోక్షంగా విమర్శలు కురిపించింది. ఇజ్రాయెల్ చర్యలు ఇప్పుడు ఆత్మరక్షణ స్థాయినిదాటినట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆదివారం వ్యాఖ్యానించారు. ఓ వైపు ఇజ్రాయెల్ సేనలు గాజా ఉత్తరప్రాంతంపై భీకరస్థాయి భూతల దాడులకు సిద్ధం అయిన దశలో చైనా స్పందన వెలువడింది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఇజ్రాయెల్ దాడుల ప్రస్తావన వచ్చిందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఆత్మరక్షణ, దాడులకు ప్రతిదాడుల దశను దాటి ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యవహరిస్తోందని చైనా విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డారు.
కొందరు తప్పుచేస్తే అందరిని శిక్షించే పద్ధతి ఏమిటని ప్రశ్నించారు. ఇజ్రాయెల్ ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం స్పందనలను అర్థం చేసుకోవాల్సి ఉంది. ఐరాస ప్రధాన కార్యదర్శి పిలుపునకు సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. గాజా ప్రజలు తల్లడిల్లుతూ ఉంటే మరిన్ని దాడులు ఏం న్యాయం అన్పించుకుంటాయని ఇజ్రాయెల్ పట్ల చైనా తన కఠిన వైఖరిని మరింత స్పష్టం చేసింది. పరిస్థితి మరింత విషమించకముందే అన్ని పక్షాలు సామరస్యంగా వ్యవహరించాలి. చర్చలకు సిద్ధం కావాల్సి ఉందని తెలిపిన చైనా, ఘర్షణలు మరింత పెరిగిపోయ్యేలా ఎవరూ స్పందించరాదని కోరారు.