Monday, January 20, 2025

‘చైనా’ యుద్ధోన్మాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఆవలివైపున తవాంగ్ ఇతర ప్రాంతాలకు సమీపంలోనే చైనా అత్యధిక సంఖ్యలో డ్రోన్లను, యుద్ధ విమానాలను మొహరించుకుని ఉన్నట్లు ఈ ఇమేజ్‌లతో స్పష్టం అయింది. వీటిని ప్రధాన టిబెట్ వైమానిక స్థావరాలలో సిద్ధంగా ఉం చారు. డ్రోన్లు, అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలను ప్రత్యేకించి భారతదేశపు ఈశా న్యం వైపు గురి చూసి ఉంచారు. ఇది ఈ ప్రాంతాన్ని దెబ్బతీసే సన్నాహపు చర్యగా చిత్రాలతో స్పష్టం అవుతోంది.

ప్రఖ్యాత ఐటి కంపెనీ మాక్సర్‌కు చెందిన మాక్సర్ శాటిలైట్ల చిత్రాలు వెలువడే దశలోనే భారతీయ వైమానిక దళం అరుణాచల్ ప్రదేశ్ గగనతలంలో పోరాట స్థాయి యుద్ధ విమానాలతో గగనతల గస్తీలను ముమ్మరం చేసుకుంది. చైనా నుంచి వైమానిక విన్యాసాల సందడి పెరిగినందున తాము ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని వాయుదళ వర్గాలు తెలిపాయి. అరుణాచల్ మీదుగా భారతీయ గగనతలాన్ని దాటుకుని వచ్చేందుకు చైనా యుద్ధ విమానం ఒక్క టి ఇటీవల సాహసించింది. దీనిని తిప్పికొట్టేందుకు గత కొద్ది వారాలలో రెండుసార్లు భారతీయ వాయుసేన తమ విమానాలను రంగంలోకి దింపింది. చైనా విమానాల నుంచి దాడిని తిప్పికొట్టేందుకు సిద్ధం అయింది.

డబ్లుజడ్ 7 డ్రాగన్ డ్రోన్లతో నిఘాచర్యలు?

అరుణాచల్ ప్రదేశ్‌కు కేవలం 150 కిలోమీటర్లు ఈశాన్యంలో ఉన్న చైనాకు చెందిన బంగ్డా వైమానిక స్థావరంలో చైనా సైనికుల సందడి నెలకొంది. ఇక్కడ అత్యంత అధునాతనమైన డబ్లు జడ్ 7 డ్రాగన్ డ్రోన్లు సంచరిస్తున్నాయి. వీటిని అధికారికంగా 2021లో చైనా సైన్యానికి వెన్నుదన్నుగా ప్రవేశపెట్టారు. ఈ డ్రోన్లకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి నిరంతరాయంగా 10 గంటల వరకూ సంచరిస్తాయి. ప్రత్యర్థుల సమాచారాన్ని, కీలక విషయాలను రాబట్టుకునేందుకు, ఇదే దశలో తమ ప్రాంతాలలో పర్యవేక్షణకు , సమన్వయానికి వీటిని వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిల్లోని సైనిక బలగాలకు , ప్రధాన ఇంటలిజెన్స్ వ్యవస్థలకు ఎప్పటికప్పుడు తగు సమాచారం గణాంకాలను అందించడం ద్వారా క్రూయిజ్ మిస్సైల్స్ అవసరం అయినప్పుడు భూతలంపైని తమ నిర్ధేశిత లక్షాలను గురిచూసి దెబ్బతీయగలవు. ఈ శ్రేణి డ్రోన్లు లేకపోవడం ఇండియాకు బలహీనతనే .

అక్సాయ్ చిన్ , మక్‌మెహన్ రేఖ వద్ద చురుగ్గా చీని సైన్యం

సరిహద్దులలో అత్యంత వ్యూహాత్మకం, కీలకం, యుద్ధంలో గెలుపోటములను ప్రభావితం చేసే ప్రాంతాలలో అక్సాయ్ చిన్, మక్‌మెహన్ రేఖ ఇతర ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ చైనా వ్యూహాత్మక రీతిలో కార్యాచరణకు దిగుతోందనే సంకేతాలు ప్రమాదకరమేనని భారత వైమానిక దళ మాజీ పైలెట్ సమీర్ జోషీ తెలిపారు. జోషికి చెందిన న్యూస్పేస్ కంపెనీ ఇప్పుడు హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌తో కలిసి దేశం కోసం అవసరం అయిన సరికొత్త డ్రోన్ల రూపకల్పన పనిలో ఉంది. ఈ ప్రాంతంలో చైనా సమీకరించుకుని ఉన్న డ్రోన్లు అత్యంత శక్తివంతంఅయినవని సమీర్ చెప్పారు.

చైనా వాయు సైన్యాన్ని సరైన విధంగా భారత భూభాగ స్థావరాలపైకి దాడికి పాల్పడేలా చేయడం, టార్గెట్‌లను వారు ఎంచుకునేలా చేయడం దెబ్బతీసేలా చేయడానికి ఈ డ్రోన్లు కీలకమైనవని వెల్లడైంది. సమయం చూసుకుని సుదూర, సమీప ప్రాంతాలపైకి దాడికి దిగగలిగేలా టార్గెట్లు ఎంచుకునేందుకు ఈ డ్రోన్లు అందించే డాటా ఆ తరువాత దాడికి ఆయువుపట్టు అవుతాయని నిపుణులు తెలిపారు. ఎంచుకున్న ప్రాంతాలపైకి ఇతర డ్రోన్లు, లేదా ఫైటర్ విమానాలకు సంధించిన క్షిపణులు, ఇతర ఆయుధాలతో దాడికి దిగేందుకు వీలేర్పడుతుందని యుద్ధ క్షేత్ర వ్యవహారాల అనుభవజ్ఞులు స్పష్టం చేశారు. గత నెల 27వ తేదీనే చైనా ఏకంగా 10 ఫ్లాంకెర్ తరహా యుద్ధ విమానాలను షిగాసే ఎయిర్‌పోర్టు వద్ద సిద్ధం చేసుకుని ఉంది. వీటితో కెజె 500 వైమానిక పాటవ వ్యవస్థలు కూడా ఉన్నాయి.

ఈ నెల 14న బంగ్డా ఎయిర్‌బేస్‌లో కదలికలు

ఇప్పుడు ఎన్‌డిటీవీ సంపాదించిన శాటిలైట్ ఇమేజ్‌లను పరిశీలించుకుంటే 14వ తేదీనే సరిహద్దులకు సమీపంలోని బంగ్డా వైమానిక స్థావరం వద్ద రెండు ఫ్లాంకెర్ తరహా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రష్యా నిర్మితం అయ్యి భారత వైమానిక దళం వాడుతోన్న స్యూ 30ఎంకెఇలకు చైనా నమూనాలుగా నిర్మితం అయ్యాయి.

ఘర్షణాయుత స్థావరాలలో చైనా వ్యూహాత్మక దాడి కేంద్రాలు

శాటిలైటు ఛాయాచిత్రాల క్రమంలో సరిహద్దులకు ఆనుకుని చైనా అత్యంత పటిష్టమైన దీర్ఘకాలికం మనగలిగేస్థాయి యుద్ధ వేదికలు లేదా ప్లాట్‌ఫారంలను ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంది. ఘర్షణలకు తావుండే ప్రాంతాలలో భారతీయ సేనలపై నిఘాలు, దాడికి దిగడం, అయోమయం కల్పించడం వంటి ఎత్తుగడలకు వీలుగా ఉండే ప్లాట్‌ఫాంలను చైనా ఇప్పుడు సిద్ధం చేసుకుని ఉందని సైనిక విషయాల ప్రముఖ విశ్లేషకులు సిమ్ టాక్ తమ ప్రత్యక్ష క్షేత్రస్థాయి పరిశీలన తరువాత వెల్లడించారు. ప్రత్యేకించి టిబెట్ ప్రాంతంలో చైనా కదలికలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. 2017 డోక్లామ్ ప్రతిష్టంభన తరువాత టిబెట్ ప్రాంతాన్ని ఎంచుకుని చైనా అత్యధికంగా బలగాలను మొహరించుకుంటూ వస్తోంది. ఇక్కడి ఫ్లాట్‌పాంలో దీర్ఘకాలికంగా బలోపేతం అవుతూ వస్తోన్న విమానబలగాలు ఇతర శక్తిసామర్థాలతో ఖచ్చితంగా భారత వైమానిక దళానికి ప్రధాన సవాలు ఏర్పడుతుందనే ఆందోళనను మిలిటరీ నిపుణులు వ్యక్తం చేశారు.

చైనా యుద్ధక్రీడల దశలోనే భారతీయ వైమానిక విన్యాసాలు

బంగ్డా వద్ద చైనా బలగాల బలోపేతం పరిణామాలను భారతీయ సైనిక వర్గాలు తీవ్రంగానే తీసుకున్నాయి. దీనికి ప్రతిగానే ఐఎఎఫ్ అరుణాచల్ ప్రదేశ్‌లో గతవారం భారీ స్థాయి సైనిక విన్యాసాలకు దిగింది. అయితే వీటికి తవాంగ్ ఘర్షణలకు సంబంధం లేదని అధికారవర్గాలు ప్రకటించినా ఇది వాస్తవికంగా క్షేత్రస్థాయి పరిణామాలతో బుకాయింపుగా మారింది. చైనా ఎప్పటికప్పుడు భారతీయ వైమానిక దళం వ్యూహాలను, రాడార్ వ్యవస్థలను పసికట్టడం, ఎలక్ట్రానిక్ అతిక్రమణలకు పాల్పడుతూనే ఉందని వెల్లడయింది. క్షేత్రస్థాయిలో ఘర్షణలు లేదా సైనికులు తలపడటం జరిగితే అవసరం అయిన రీతిలో దాడులకు దిగేందుకు అవసరం అయిన అత్యంత విలువైన డాటాను ఇప్పటికే చైనా పోగుచేసుకుందని ఇమేజ్‌ల్లోని తీవ్ర అంశాలు స్పష్టం చేశాయి.

ఇటీవలే తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్‌స్టే ప్రాంతంలో పరస్పర సైనిక ఘర్షణలు జరిగాయి. ఈ ఘటన తరువాతనే కాకుండా అంతకు ముందునుంచే చైనా సైన్యం కదలికలు , సరిహద్దులలోని గస్తీ పాయింట్లను అతిక్రమించడం వంటివి జరుగుతూ వస్తున్నాయని నిపుణులు ఇప్పటి శాటిలైట్ ఇమేజ్‌ల నేపథ్యంలో విశ్లేషిస్తున్నారు. అత్యంత ఎతైన ప్రాంతంలోని ఓ స్థావరాన్ని స్వాధీనపర్చుకోవడానికి మంచుపతనం దశలో చైనా బలగాలు చేసిన యత్నాలను భారతీయ జవాన్లు తిప్పికొట్టిన దశలో ఇప్పుడు చైనా దీర్ఘకాలికంగా తమ రణతంత్రానికి పదును పెట్టుకున్న వైనం వెల్లడైంది.

రక్షణ మంత్రి ముక్తసరి ప్రకటన

ఇటీవలి తవాంగ్ ఘర్షణపై విపక్ష పట్టు తరువాత ఎట్టకేలకు రక్షణ మంత్రివెలువరించిన సంక్షిప్త ప్రకటనలో చైనా ఏకపక్షంగా సరిహద్దులలో యధాతథ స్థితిని మార్చేందుకు యత్నించిందని తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఈ పరిణామం జరిగిందని తెలిపారు. ఇతరత్రా ఈ మాటలను తీసుకుంటే భారతీయ భూభాగంలోకి చొరబడేందుకు చర్య జరిగినట్లు, ఈ క్రమంలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగినట్లు, ఈ దశలో స్పష్టతకు రాని సంఖ్యలో ఇరుపక్షాలకు చెందిన జవాన్లు గాయపడ్డట్లు తెలిపారు.

2020 నుంచే చైనా హంగామా

ఓ వైపు కరోనామహమ్మారి దశ ఉన్నప్పుడే చైనా అత్యంత చాకచక్యంగా సైనిక పాటవం పెంచుకుంది. వైమానిక స్థావరాలు, సాధనాసంపత్తి పెంచుకోవడం, యుద్ధ విమానాలను తరలించడం, రవాణా వ్యవస్థ బలోపేతం, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ బలోపేతం జరిగింది. ఆ తరువాత టిబెట్‌లోని కీలక ప్రాంతాలను ఎంచుకుని సాధనసంపత్తిని పెంచింది. దుర్భేధ్యపు స్థావరాలను నిర్మించుకుంది. ఏకంగా ఈ ప్రాంతంలో అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ రవాణాకు సైనిక తరలింపు కోసం రైల్వే మార్గాలను కూడా నిర్మించింది. సైన్యానికి అవసరం అయిన సాధనాసంపత్తికి రాచబాటలను కొండప్రాంతాలలో ఏర్పాట్లు చేసుకుందని ఇప్పటి శాటిలైట్ల ఛాయాచిత్రాలలో కన్పించే నిర్థిష్టమైన స్థావరాల దశలో వెల్లడైంది.

3 కీలక ఎయిర్‌బేస్‌లు

చైనా అత్యంత కీలకమైన మూడు వైమానిక స్థావరాలను బలోపేతం చేసుకుంది. బంగ్డా ( ఇది అరుణాచల్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది), లాహ్‌సా (సరిహద్దులకు 250 కిమీలు) , ఇక షిగట్సే (సిక్కిం సరిహద్దుకు 150 కిమీలలో ఉంది) . పలు ప్రాంతాలలో మానవరహిత వాహనాలు (యుఎవి) సంచరిస్తున్నాయని ఇమేజ్‌లతో స్పష్టం అయింది. ఇంతకాలంగా గగనతలంలో దాడుల సామర్థ విషయంలో భారతదేశానికి ఉన్న పైచేయిని ఇప్పుడు ఈ మధ్య అతి కొద్ది సంవత్సరాల తమ డ్రాగన్ ఆపరేషన్‌తో చైనా తోసిరాజందని విశ్లేషకులు సమీర్ జోషీ తెలిపారు. ఇప్పటకీ లాహ్‌సా గొంగార్ ఎయిర్‌పోర్టు వద్ద శరవేగంతో రన్‌వేల విస్తరణ జరుగుతూ ఉన్నట్లు శాటిలైటు ఇమేజ్‌లు తెలిపాయి. ఇప్పటివరకూ భారత్‌కు అత్యంత శక్తివంతమైన కాపలా స్థావరాలుగా ప్రధాన ఎయిర్‌బేస్‌లు కొన్ని ఉన్నాయి. అసోం మైదాన ప్రాంతాలోని పలు ఎయిర్‌బేస్‌లు ,తేజ్‌పూర్, మిసామరి, జోర్హాట్, హషిమరా, బగ్డోగ్రా వంటివి వైమానిక స్థావరాలుగా నిలిచాయి.

చైనా చర్యలకు అడ్డుకట్ట వేశాయి. దశాబ్దాలుగా మన వాయుసేన ఈ ప్రాంతంలో బలిష్టంగా ఉంటూ చైనా వైమానిక దూకుడుకు చెక్‌పెడుతూ ఉంది. భౌగోళికంగా భారతీయ ప్రాంతం నుంచి చైనా వైపు వైమానిక దాడులు తేలిగ్గా జరిపేందుకు వీలుంటుంది. పైగా చైనా భారీ స్థాయి విమానాలు ఇంతకాలం వరకూ భారతీయ వైమానిక పాటవాన్ని దెబ్బతీయలేని స్థితిలోనే ఉంటూ వచ్చాయి. చైనాకు చెందిన టిబెట్ ఎయిర్‌బేస్‌లు అతి ఎత్తు ప్రాంతాలలో ఉండటం చైనా యుద్ధ విమానాలు అత్యంత వేగపు సామర్థంతో లేకపోవడం ఇంతవరకూ ఉన్న డ్రాగన్ బలహీనతలు అయ్యాయి.

అయితే ఇటీవలికాలంలో పరిస్థితి మారిందని చైనా అత్యంత చాకచక్యంగా తన యావత్తూ యుద్ధ వ్యవస్థను బలోపేతం చేసుకుందని, టిబెట్‌లో ఎయిర్‌ఫోర్స్ స్థావరాల నుంచి భారత భూభాగంపైకి దాడికి బలం సంతరించుకుందని స్పష్టం అయింది. సరిహద్దులలోని కొన్ని నిర్థిష్ట స్థావరాలనుంచి చైనా యుద్ధ విమానాల ప్రయోగం జరిగితే ఇది ఇంతకు ముందటితో పోలిస్తే తీవ్రస్థాయిలో మన వాయుదళ యుద్ధ విమానాలను దెబ్బతీయగలవని పరిశీలకుల విశ్లేషణలో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News