Saturday, November 23, 2024

చైనాకే చెల్లింది….

- Advertisement -
- Advertisement -

2020 నాటికి
రైతుల ఆదాయాన్ని
డబుల్ చేస్తానన్న ప్రధాని
మోడీ విఫలమయ్యారు
దేశంలో 65% జనాభా
సాగుమీదే ఆధారపడింది
కానీ జిడిపిలో వ్యవసాయం
వాటా 15% మించలేదు
చైనా, ఇజ్రాయెల్
విధానాలపై అధ్యయనం
జరగాలి : ములుగు
ఉద్యాన వర్శిటీలో జరిగిన
మంత్రివర్గ ఉపసంఘం
భేటీలో మంత్రి కెటిఆర్

రైతు ఆదాయం రెట్టింపు
మరే దేశంలోనూ సాధ్యం కాలేదు

మన తెలంగాణ/ములుగు: వ్యవసాయరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలి..పంటల సాగుకు ఆధునాతన సాంకేతికతను జోడించాలి..శాస్త్రవేత్తలు అకాల వర్షాలు వడగండ్ల వానలను తట్టుకునే వంగడాలను రూపొందించాల్సిన అవసరం ఉంది..రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలి. భాగంగానే వరిమళ్లలో చేపల పెంపకం చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ న్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధానాలపై ఏ ర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ 2వ సమావేశం గురువారం సిద్దిపేట జిల్లా ములుగు ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ వ్యవసాయశాఖతో విశ్వవిద్యాలయ అధికారుల ఆలోచనా విధానం కూడా మారాలని హెచ్చరించారు. ఆదాయం రెట్టింపు అన్నది ఒక్క చైనాలోనే సాధ్యపడిందని వెల్లడించారు. తనకున్న సమాచారం మేరకు మరే దేశంలో నూ ఇది సాధ్యం కాలేదని తెలిపారు.

2020 దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడి ఆచరణలో విఫలమయ్యారన్నారు. దేశంలో దాదాపు 65శాతం జానాభా వ్యవసాయం , దాని అనిబంధరంగాల మీద ఆధారపడివుందన్నారు. అయినప్పటికీ దేశ జిడిపిలో దాని వాటా 15శాతం మించడం లేదన్నారు. వ్యవసాయంలో రైతులకు ఆదాయం ఎలా వస్తుందో అన్నదిశగా ఆలోచన చేయాలన్నారు. చైనా, ఇజ్రాయిల్ దేశాల్లో అవలంబిస్తున్న విధానాలను ఆధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 1987లో చైనాఇండియా దేశాల జిడిపి సమానంగా వుండేదని తెలిపారు. 35ఏళ్లలోనే చైనా 16ట్రిలియన్ డాలర్లకు చేరిందని, ఇండియా మాత్రం 3ట్రిలియన్ డాలర్లవద్దనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరిసాగుతోపాటు వరిమళ్లలో చేపలు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని , ఈ దిశగా ప్రయత్నాలు జరగాలన్నారు. వ్యవసాయానికి ఆధునికత జోడిస్తేనే యువత ఈ దిశగా మళ్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో బ్లూ, పింక్ , ఎల్లో, గ్రీన్ విప్లవాలు విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ తరం ,కొత్తతరం ఎందుకనో వ్యవసాయానికి దగ్గర కావడం లేదన్నారు. పాత, కొత్త అనుభవాలతో ఒక కొత్త విధానం తీసుకురావాలని , యువతను ఆకర్శించాలన్నారు.

తెలంగాణలోని 32జిల్లాల్లో ప్రతిచోటా 25 ఎకరాల్లో రైతు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొత్తతరానికి వ్యవసాయాన్ని పరిచయం చేయాలన్నారు.వ్యవసాయానికి ఆధునికత జోడించేలా శాస్త్రవేత్తలు ఆలోచన చేయాలని సూచించారు. చిన్ననాటి నుండే పిల్లల్లో వ్యవసాయం పట్ల మక్కువ కలిగేలా చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం పౌల్ట్రీ రంగంతోపాటు వ్యవసాయంలో పత్తి , వేరుశనగ పంటలకు ప్రసిద్దిగాంచిందన్నారు. ఏడాదికి రెండు సార్లు 10రోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. దీనిపై క్యాలేండర్ తయారు చేయాలని ,రైతు దినోత్సవం నిర్వహించాలని సూచించారు. శాస్త్రవేత్తలు వడగండ్లు , అకాల వర్షాల వడగండ్ల వానలను తట్టుకునే కొత్తర కం వంగడాలను రూపొందించాలని కోరారు. ఫసల్‌బీమాకు ప్రత్యామ్నాయం గా పంటలు యూనిట్‌గా బీమా కంపెనీలతో మాట్లాడి శాస్త్రీయంగా కొత్తవిధానం తీసుకురావాలని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలని సూచించారు. యాంత్రీకరణలో ఊబర్, ఓలా తరహా సేవలు అందస్తే అది విప్లవాత్మక మార్పుకు నాందీ అవుతుందన్నారు. ఊబర్, ఓలా కార్లు, బైకులు నడుపుతూ లక్షల మంది ఉపాధి పొందుతున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో కూడా ఈ తరహా సేవలు అందుబాటులోకి రా వాలన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ ఈ విషయంపై చొరవ తీసుకోవాలని సూ చించారు.

రైతువేదికలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని, ఐటీ శాఖ సహకారంతో రైతులకు వ్యవసాయంలో మెళకువలు తెలుసుకునేందుకు సాయం అందించాలన్నారు. వ్యవసాయంలో తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యం వ్యవసాయరంగానికే ఇస్తున్నారని వెల్లడించారు. సిఎం ఆలోచనలన్నీ ఈ రంగం గు రించేనని , వ్యవసాయం బలోపేతం చేసి, రైతును రాజుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.వ్యవసాయరంగంలో అనుసరించాల్సిన విధానాల రూపకల్పనలో భాగంగా సబ్ కమిటీ అవసరాన్ని బట్టి వివిధ ప్రాంతాలను సందర్శించి పూర్తి అవగాహనతో విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వానాకాలంలో రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. పప్పు, నూనెగింజల పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. రైతుబంధు అందుకుంటున్న వారిలో 92.5 శాతం మంది ఐదెకరాల లోపు వారేనని, 5 నుండి 10 ఎకరాలు ఉన్నవారు ఆరుశాతం మాత్రమే ఉన్నట్టు తెలిపారు. వ్యవసాయం గౌరవ ప్రదమైనదని, పని చేయడం నామోషీ కాదు అన్న భావన మన యువతలో రావాలన్నారు.రాష్ట్రంలోని రైతులను వివిధ ప్రాంతాలకు విడతల వారీగా తీసుకువెళ్లి అక్కడి వ్యవసాయ పద్దతులు, విధానాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉద్యానపంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలలో ఆలుగడ్డ సాగయితే తెలంగాణ అవసరాలు తీరతాయని, ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టు వెల్లడించారు.మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మిరపలో తామరపురుగు, గత ఏడాది పత్తిలో గులాబీ పురుగులు రైతులను దెబ్బతీశాయన్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారన్నారు. వ్యవసాయ, ఉద్యానరంగ విద్య పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయరంగం ఆర్థికంగా బలపడేందుకు చేయూతనివ్వాలన్నారు. ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయి సందర్శనకు పంపిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గోదాముల సంఖ్య పెంచి నిల్వసామర్ద్యం పెంచాల్సిన అవరం ఉందన్నారు. కోల్ స్టోరేజ్ , డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కలిపించాలన్నారు.
పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి:
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణపై పెద్ద ఎత్తున దృష్టి సారించాలన్నారు. ఆ మేరకు రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ , కామారెడ్డిలలో దాల్ మిల్ లను ఏర్పాటు చేయాలన్నారు. కోల్డ్ స్టోరేజ్ సామర్ద్యం పెంచాలని, చైనా, ఇజ్రాయిల్ వ్యవసాయ విధానాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన క్రాప్ ఇన్సూరెన్స్ విధానంపై దృష్టి సారించాలన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరికల్చర్ సాగు ప్రోత్సహించాలన్నారు. వివిధ కార్పోరేట్ మాల్స్ తో ఒప్పందం చేసుకుని కూరగాయలు పండిస్తూ అధిక లాభాలు సాధిస్తున్నారని తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశంలో ఉత్పత్తి పెరుగుతుండగా , వినియోగం తగ్గుతున్నదన్నారు. వరి ధాన్యంలో యాసంగిలో నూక శాతం తగ్గే వంగడాలను రూపొందించాలన్నారు. 25, 26 శాతం తేమ ఉన్నప్పుడే వరి కోతలు పూర్తి చేస్తే మిల్లింగ్ కు వచ్చే వరకు నూకశాతం తక్కువ ఉంటుందన్నారు. రాష్ట్రంలో అంతరపంటగా కొకొవా సాగును ప్రోత్సహించాలన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి రాకతో తెలంగాణలో పంటల ఉత్పత్తి పెరిగిందన్నారు. నిల్వకు అవకాశం, మార్కెట్ గ్యారంటీ ఉండడంతో రైతులు వరి, పత్తి సాగుకు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. వైవిధ్యమయిన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని కోరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఏ పంటలు సాగుచేస్తున్నారో, ఆ ప్రాంత భూములను బట్టి ఏ పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయో ఆ దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విత్తనపంటల సాగువైపు రైతులను మళ్లించాలని, విత్తనశుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ ఆదాయ పెరుగుదలలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. సిక్కిం తర్వాత తెలంగాణ 6.7 శాతంతో అగ్రస్థానంలో ఉందన్నారు. ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడాల మీద దృష్టి సారించాలన్నారు. కాళేశ్వరం వంటి సాగునీటిని ఎంత కష్టపడి తీసుకువచ్చామో ప్రతి రైతుకు, ప్రతి ప్రజాప్రతినిధికి తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ , వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు , కమీషనర్ హన్మంతు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, విశ్వవిద్యాలయాల విసిలు ప్రవీణ్‌రావు, నీరజా ప్రభాకర్ , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీడ్స్ ఎండి కేశవులు ,ఆగ్రోస్ ఎండి రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News