Sunday, December 22, 2024

భారతీయ రాకెట్‌పై చైనా జాతీయ పతాకం!

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులోని కులశేఖరపట్నంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన రెండు ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశంసిస్తూ తమిళనాడుకు చెందిన డిఎంకె మంత్రి ఒకరు వార్తాపత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటన(యాడ్) ప్రకంపనలు సృష్టించింది. ఆ ప్రకటనలో చైనా పతాకాన్ని రాకెట్‌పై ప్రముఖంగా ముద్రించడంతో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తమిళనాడు పశు సంవర్థక శాఖ మంతిర అనితా రాధాకృష్ణన్ తన వ్యక్తిగత హోదాలో ఈ ప్రకటన ఇచ్చారు. ఈ వివాదాస్పద ప్రకటనపై మంత్రి స్పందించనప్పటికీ ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ నిర్మాణం కానున్న తూత్తుకుడి నియోజకవర్గం ఎంపి కనిమోళి మాత్రం తన పార్టీని సమర్థించారు.జరిగిన తప్పును ఆమె అంగీకరించినప్పటికీ ఆ ప్రకటన తయారుచేసిన డిజైనర్ చేసిన పొరపాటని ఆమె చెప్పారు. తమ పార్టీపైన ఇంత తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయవలసిన అవసరం లేదని ఆమె తెలిపారు. ఆ ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఫోటోలు పక్కపక్కనే ఉండగా వెనుక వైపు మధ్యలో ఒక రాకెట్ బొమ్మ ముద్రించి ఉంది. ఈ వివాదమంతా ఆ రాకెట్‌లోనే ఉంది.

ఎరుపు రంగులో ఉన్న ఆ రాకెట్ ముందు భాగాన(ముక్కుపైన) నాలుగు బంగారు రంగు నక్షత్రాలు, కుడివైపున పెద్దగా ఐదవ నక్షత్రం ఉన్నాయి. అయితే ఇది చైనా జాతీయ పతాకాన్ని పూర్తిగా పోలి ఉండడమే ఈ వివాదానికి అసలు కారణం. దీనిపై అందరికన్నా ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి తీవ్రంగా స్పందించాయి. అధికార డిఎంకెపై ఆయన ఆగ్రహాన్ని ప్రకటించారు. డిఎంకె పనిచేయదని, కాని ఇతరులు ఘనతను తన ఖాతాలో వేసుకుంటుందని ప్రధాని ఆరోపించారు. తమ పథకాలపై వారి స్టిక్కర్లు వేసుకుంటారని, ఇప్పుడు వారు(డిఎంకె) అన్ని హద్దులు దాటారని ఆయన అన్నారు. ఇస్రో లాంచ్‌ప్యాడ్ ఏర్పాటు ఘనతను కూడా తమ కాతాలో వేసుకోవడానికి చైనా స్టిక్కర్‌ను అతికించారని డిఎంకెపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిని అంగీకరించడానికి డిఎంకె సిద్ధంగా లేదని, భారతదేశ అంతరిక్ష విజయాన్ని ప్రపంచానికి చాటడం ఆ పార్టీకి ఇష్టం లేదని, మన శాస్త్రవేత్తలను, మన అంరిక్ష రంగాన్ని వారు(డిఎంకె) అవమానించారని మోడీ ఆరోపించారు.

డిఎంకె నాయకుల చర్యలకు ఇక శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మండిపడ్డారు. డిఎంకెపై ప్రధాని మోడీ మాటల దాడిని బలపరుస్తూ బిజెపి తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. దేశ సార్వభౌమత్వాన్ని డిఎంకె అగౌరపరిచిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా పట్ల డిఎంకె అంకితభావానికి రాకెట్ బొమ్మే నిదర్శనమంటూ ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను డిఎంకె సీనియర్ నాయకురాలు, ఎంపి కనిమోళి తేలికగా కొట్టివేశారు. చైనా పతాకం ఉంటే తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. చైనాను శత్రు దేశంగా భారత్ ప్రకటించలేదని ఆమె వ్యాఖ్యానించారు. చైనా ప్రధాని జీ జిన్‌పింగ్‌ను ప్రధాని మోడీ ఆహ్వానించి వెంటపెట్టుకుని మరీ మహాబలిపురం(తమిళనాడు) తీసుకువెళ్లారని ఆమె గుర్తు చేశారు. నిజాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడని బిజెపి సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News