బీజింగ్: అవినీతి కేసులో చైనా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ మాజీ చైర్మన్ లాయి జియాఓమన్‌ను ఉరి తీశారు. సెకండ్ మున్సిపల్ ఇంటర్‌మీడియట్ పీపుల్స్‌కోర్టు ఆఫ్ తియాంజిన్ తీర్పుమేరకు శుక్రవారం ఆయనకు ఉరిశిక్షను అమలు చేశారు. పలు బ్యాంకింగ్ సంస్థల నిర్వహణలో కీలక పదవుల్లో పని చేసిన లాయి 2008 2018 కాలంలో పలు అవినీతి చర్యల ద్వారా 1.78 బిలియన్ యువాన్లు (27.60 కోట్ల డాలర్లు )మేర అక్రమంగా సంపాదించినట్టు ఆరోపణలున్నాయి. తనకు లంచాలిచ్చిన వ్యక్తులు, సంస్థలకు రుణాలు ఇప్పించడం, ప్రాజెక్ట్ కాంట్రాక్టులిప్పించడం, ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించడంలాంటివి చేసినట్టు లాయిపై అభియోగాలు మోపారు. అంతేగాక ఆయన చట్టవిరుద్ధంగా ఇద్దరు భార్యలను కలిగి ఉన్నారని కూడా అభియోగాలు మోపారు. తమ దేశంలో ఇప్పుడు అధికారుల అవినీతే పెద్ద సమస్యగా మారిందని వారం రోజుల క్రితం ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.