మెటల్ బాక్సుల్లో గర్భిణులు, పిల్లలు
బీజింగ్ : కరోనా కట్టడికి జోరో కొవిడ్ వ్యూహాన్ని చైనా అనుసరిస్తోంది. కరోనా రోగులు, అనుమానితుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్క కేసు వచ్చినా ఊరంతా క్వారంటైన్‌లో ఉండాల్సిందే. చైనా లోని అతిపెద్ద నగరాలైన షియాన్, టియాంజిన్, అన్యాంగ్ ప్రాంతాల్లో మళ్లీ వైరస్ విజృంభిస్తుండడంతో అనుమానితులను బలవంతంగా క్వారంటైన్ శిబిరాలకు తరలిస్తున్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు, ఎవరైనా సరే రెండు వారాల పాటు బాక్సుల్లాంటి గదుల్లో ఉండాల్సిందే. వీటిలో ఒక బెడ్‌తోపాటు మరుగుదొడ్డి ఉంటుంది. ఈ గదులకు చిన్న కిటికీలు ఉంటాయి. అందులో నుంచి కేవలం తల మాత్రమే బయటకు పెట్టి రోజువారీ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇక చిన్నారులు కూడా పెద్దల సమక్షంలో కాకుండా ఒంటరిగా గదుల్లో ఉండాల్సిందే. చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ప్రజలను క్వారంటైన్లకు తరలిస్తున్నారు.
దీనికోసం వందల బస్సులను ఏర్పాటు చేశారు. ప్రజలను తరలించడానికి క్యూలైన్లలో బస్సులు , చిన్నారులకు పీపీఈ కిట్లు వేసిన తరలిస్తున్న వీడియాలను ఇటీవల కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతోన్న వేళ కరోనాను నియంత్రించడానికి కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు క్వారంటైన్‌లో ఉన్నారు. కఠిన లాక్‌డౌన్ కొన్ని నగరాల్లో అమలవుతుండడంతో ఎవరూ దేనికీ బయటకు రాలేని పరిస్థితి కొనసాగుతోంది. ఆంక్షల వల్ల వైద్య చికిత్స అందక ఇటీవల ఓ గర్భిణి తన శిశువును కోల్పోవలసి వచ్చినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.