Monday, December 23, 2024

చైనాతో జాగ్రత్త!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: చైనా నవ్వుతూ మాట్లాడిందంటే లోపల మండుతున్నదని భావించడం మామూలైపోయింది. దాని మాటలకు, చేతలకు పొంతన కుదరదనే అభిప్రాయం స్థిరపడిపోయింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గత ఆదివారం నాడు చేసిన ప్రకటన ఈ నెల 9న అరుణాచల్‌ప్రదేశ్‌ను ఆనుకొని వున్న వాస్తవాధీన రేఖ వద్ద తన సేనలు పాల్పడిన అతిక్రమణ దుర్మార్గాన్ని ఇంతలోనే మరిచిపోయిందా అనిపించేలా వున్నది. రెండు దేశాల సంబంధాలను నిదానంగా, పటిష్ఠంగా మెరుగుపరచుకోడం కోసం ఇండియాతో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా వున్నామని ఆయన చేసిన ప్రకటనపై ఏ మాత్రం విశ్వాసం కలుగదు.

ప్రేమగా వీపు నిమురుతూ విషమిచ్చే మనస్తత్వాన్ని ఎలా నమ్మగలం? 2020 జూన్‌లో లడఖ్ గాల్వాన్ లోయ వద్ద పెను ఘర్షణ సంభవించినప్పటి ఆక్రమిత ప్రాంతాల నుంచి రెండు దేశాల సేనలు వెనుకకు మళ్ళే విషయమై ఒక వైపు చర్చలు జరుగుతుండగానే అరుణాచల్ వద్ద చైనా రెచ్చిపోడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? యాంగ్ త్సే ఘటన తర్వాతనే గాల్వాన్ లోయ వివాద పరిష్కారం దిశగా 17వ రౌండ్ చర్చలు చైనా వైపు గల చుసుల్ మోల్డో సరిహద్దు పాయింట్ వద్ద జరిగాయి. ఈ చర్చల తర్వాతనే ఈ నెల 25న వాంగ్ యీ సుహృద్భావ ప్రకటన వెలువడింది.

ఈ రెండు సందర్భాల్లోనూ యాంగ్ త్సే ఘర్షణ ప్రస్తావన రాకపోడం విశేషం. వాస్తవానికి తవాంగ్ సెక్టార్‌లో రెండు దేశాల సేనల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని ఈ నెల 9వ తేదీ నాటి సంఘటనే బయటకు పొక్కిందని సమాచారం. అరుణాచల్‌ప్రదేశ్ వద్ద రెండు దేశాల సైన్యాల మధ్య బాహాబాహీ ఘర్షణలు ఇటీవల తరచూ జరుగుతున్నాయని ఒక సైన్యాధికారే చెప్పినట్టు తెలిసింది. సగటున నెలకు రెండు మూడు సార్లయినా సేనలు తలపడుతున్నట్టు ఆ సైన్యాధికారి చెప్పారు. అయితే ఈ నెల 9 నాటి ఘర్షణ తర్వాత రెండు సైన్యాల అధికారుల మధ్య చర్చలు జరగడం వెంటనే ఆ నిప్పు చల్లారిపోడం సంతోషదాయకం. వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల సైన్యాలు తుపాకులను, మందుగుండును ఉపయోగించరాదని 1996లో ఒక ఒప్పందం కుదిరింది.

అందుకే వీధి కొట్లాటల మాదిరి సరిహద్దు ఘర్షణలు. అయితే ఇలా చీటికిమాటికీ తంపులకు దిగే రెండు దేశాల మధ్య శాంతి ఎంత కాలం నిలబడుతుందనే సందేహం సహజంగానే కలుగుతుంది. 2020 ఘర్షణలో చైనా సేనలు ముందుకు చొచ్చుకొచ్చి భారత భూభాగాన్ని కొంత మేర స్వాధీనం చేసుకొన్నట్టు వార్తలు వెల్లడించాయి. ఈ సంఘర్షణల తర్వాత భారత దేశం ఆ ప్రాంతంలో 50 నుంచి 60 వేల మంది సైనికులను మోహరించిందని తెలుస్తున్నది. అలాగే సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇలా సరిహద్దులను భారీ మోహరింపులతో కాపాడుకోడం చాలా ఖర్చుతో కూడుకొన్న పని. 17 రౌండ్ల చర్చలు జరిగినా గాల్వాన్ లోయ కొట్లాట పేచీ పరిష్కారానికి నోచుకోలేదు. ఒకటి రెండు చోట్ల సైన్యం వెనుదిరగడం జరిగినా ఇంకా వివాదాస్పద పాయింట్లు మిగిలే వున్నాయి.

గత జులైలో 16వ విడత చర్చలు జరిగిన తర్వాత సెప్టెంబర్ 8న గోగ్రా హాట్ స్ప్రింగ్స్ అనే చోట రెండు దేశాలు సైనిక ఉపసంహరణను ప్రారంభించాయి. అయితే ఇంకా దౌలత్ బేగ్ వోల్డీలోని దేప్‌సంగ్ వద్ద, దెమ్‌చోక్ సెక్టార్‌లో చార్దింగ్ నల్లా వద్ద ఉపసంహరణలు జరగవలసి వున్నాయి. ఇక్కడే భారీ సంఖ్యలో రెండు దేశాల సేనలు మోహరించినట్టు తెలుస్తున్నది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని చైనా సైన్యం ఏకపక్షంగా మార్చడాన్ని ఎంత మాత్రం అనుమతించబోమని మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత సోమవారం నాడు ప్రకటించారు. అమెరికాతో ఇండియా సన్నిహితంగా వుండడం చైనాకు గిట్టడం లేదు. ఈ మధ్య ఉత్తరాఖండ్ వద్ద చైనాతో గల సరిహద్దుల్లో అమెరికాతో కలిసి భారత సైన్యాలు సంయుక్త విన్యాసాలు జరపడం చైనాకు కంటగింపుగా వున్నది.

బహుశా దీని ప్రేరణతోనే ఇటీవలి తవాంగ్ సెక్టార్ ఘటన జరిగి వుండవచ్చు. అమెరికాతో సన్నిహితంగా వున్నప్పటికీ ఉక్రెయిన్ యుద్ధం విషయంలో దాని అడుగుల్లో ఇండియా అడుగులు వేయలేదు. స్వతంత్రమైన వైఖరిని తీసుకొన్నది. చైనా దీనిని గమనించకపోడం బాధాకరం. అలాగే పసిఫిక్ మహా సముద్రంలో క్వాడ్ ఒప్పందం ద్వారా తనకు వ్యతిరేకంగా అమెరికాతో ఇండియా కుమ్మక్కయిందనే దుగ్ధ చైనాకున్నది. వాస్తవాధీన రేఖను మార్చివేసి భారత ఆధీనంలో వున్న ప్రాంతాలను ఆక్రమించుకోవాలనే వైఖరికి చైనా స్వస్తి చెప్పనంత కాలం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే వుంటాయి. స్పష్టమైన సరిహద్దును నిర్వచించుకోడం కోసం భారత దేశంతో అది సహకరించవలసి వున్నది. అందుకు చర్చలే మార్గం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News