భారత్ నిర్మాణాలకు దీటుగా శరవేగంగా నిర్మాణం సాగిస్తున్న చైనా
మరి కొద్ది నెలల్లోనే పూర్తి కానున్న వంతెన
తాజా ఉపగ్రహాల చిత్రాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులతో కలహాల చిచ్చు కొనసాగేలా చేస్తున్న డ్రాగన్ తాజాగా మరో వివాదానికి తెర తీసింది. లడఖ్ ప్రాంతంలో అత్యంత కీలకమైన పాంగోంగ్ సరస్సుపై కొత్త వంతెనను చైనా శరవేగంగా నిర్మిస్తోంది. గతంలో భారత్‌చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలకు ఈ సరస్సే కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నిర్మాణం పనులు ఇటీవలి కాలంలో వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే 400 మీటర్ల నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన గనుక పూర్తయితే ఈ ప్రాంతంపై చైనా సైనికపరంగా పైచేయి సాధించడానికి వీలవుతుంది. వంతెన పిల్లర్లను కాంక్రీట్ శ్లాబులను అనుసంధానం చేయడానికి చైనా నిర్మాణ కార్మికులు క్రేన్‌ను ఉపయోగిస్తున్న దృశ్యాలు ఈ నెల 16న తీసిన తాజా ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. నిర్మాణం జరుగుతున్న వేగాన్ని పరిశీలించినట్లయితే రాబోయే కొద్ది నెలల్లోనే ఇది పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఈ వంతెన పూర్తయితే ఈ ప్రాంతంలో చైనా ప్రధాన మిలిటరీ స్థావరమైన రుటోంగ్‌కు తూర్పు లడఖ్ లోని సరిహద్దు ప్రాంతాలకు మధ్య రోడ్డు సదుపాయం ఏర్పడుతుంది.
ఫలితంగా చైనా బలగాలను సరస్సు ఒకవైపునుంచి మరో వైపునకు వేగంగా తరలించడానికి వీలవుతుంది. మొట్టమొదటిసారిగా ఈ నెల ప్రారంభంలో ఈ వంతెనకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు మీడియాలో వచ్చాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే చైనా సైన్యాలు పాంగోగ్ సరస్సు వద్ద ఉండే చైనా బలగాలు రుగోంగ్‌కు వెళ్లడానికి సరస్సు చుట్టూ దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. ఈ వంతెన వల్ల ఆ ప్రయాణ దూరం దాదాపు 150 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రతికూల వాతావరణం, హిమపాతాల మధ్య కూడా నిర్మాణం నిరాటంకంగా సాగుతోందని, నిర్మాణ ప్రక్రియకు మద్దతుగా భారీ క్రేన్‌ను కూడా ఉపయోగిస్తున్నారని ఇంటెల్ ల్యాబ్‌లో ‘జియోయింట్ ’ రిసెర్చర్ డేమీన్ సైమన్ అంటున్నారు. పాంగోగ్ సరస్సు ఉత్తర ప్రాంతంలోని ఖుర్నాక్ ఫోర్టు సమీపంలోని రోడ్డు నెట్‌వర్క్‌ను కలుపుతూ కొత్త రోడ్డు నిర్మాణం కూడా జరుగుతున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోందని, దీనివల్ల పటిష్టమైన వాహనాలు తిరగగల రోడ్డు నెట్‌వర్క్ ఏర్పడుతుందని కూడా ఆయన చెప్పారు.
వాస్తవానికి ఈ కొత్త వంతెన నిర్మాణం 1958నుంచి చైనా అధీనంలో ఉన్న ప్రాంతంలో జరుగుతోంది. అయితే ఈ వంతెన నిర్మాణం పూర్తిగా చట్ట వ్యతిరేకమని మన దేశం భావిస్తోంది. ‘కచ్చితంగా వాస్తవాధీన రేఖ ఉన్న ప్రాంతంగా భారత్ వాదిస్తున్న ప్రాంతంలోనే ఈ వంతెన ఉంది’ అని ఫోర్స్ అనాలసిస్‌లో చీఫ్ మిలిటరీ విశ్లేషకుడు సిమ్ టాక్ అంటున్నారు.అయితే ఆచరణాత్మకంగా చూస్తే సరస్సులో అత్యంత ఇరుకైన పాయింట్ ఇదే కాబట్టి వంతెన నిర్మాణానికి చైనా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు కనబడుతుంది. కానీ భారత్ వాస్తవాధీన రేఖగా చెబుతున్న ప్రాంతందాకా చైనా మౌలిక సదుపాయాల నిర్మాణం చొచ్చుకు పోవడం రాజకీయంగా మరింతగా కీలకమైన విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా ‘ చైనా దాదాపు 60 ఏళ్లుగా అక్రమంగా ఆక్రమించుకుని ఉన్న ప్రాంతంలో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి అక్రమ ఆక్రమణలను భారత్ ఎప్పటికీ అంగీకరించదని మీకు బాగా తెలుసు’ అని చైనా నిర్మాణ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ వస్తున్న విదేశాంగ శాఖ అంటోంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు కేటాయించడంతో పాటుగా పలు రోడ్లు, వంతెనలు నిర్మించినట్లు విదేశాంగ శాఖ ఓ వైపు చెప్తుండగా, పాంగోంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న ఈ వంతెన గత ఏడాది సెప్టెంబర్‌లో సరస్సు దక్షిణ వైపున ఉన్న కైలాష్ హైట్స్‌ను తమ అధీనంలోకి తీసుకోవడానికి యత్నించిన భారత బలగాలకు దీటయిన సమాధానమని చెప్పవచ్చునని సైమన్ అంటున్నారు.