- Advertisement -
భారత్ వైపు స్నేహ హస్తాన్ని చాస్తున్న చైనా తమ దేశంలో భారత పౌరుల ప్రయాణాన్ని సులభతరం చేసే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 9 వరకు 85 వేల వీసాలు జారీ చేసింది. ఈమేరకు మనదేశం లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ వెల్లడించారు. “ భారత్ లోని చైనా ఎంబసీ, కాన్సులేట్లు ఈ ఏడాది ఏప్రిల్ 9 వరకు భారతీయులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేశాయి. చైనాను సందర్శించడానికి మరింత మంది భారత స్నేహితులకు స్వాగతం . సురక్షిత, స్నేహపూర్వక, స్ఫూర్తివంతమైన చైనాను అన్వేషించండి.” అని ఫీహాంగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మార్చిలో కూడా ఆయన ఈ తరహా పోస్ట్ చేశారు. అప్పటికే 50 వేల వీసాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వీసా ధరలపై తగ్గింపును డ్రాగన్ మరో ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబరు 31 వరకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతుందని వెల్లడించింది.
- Advertisement -