Friday, November 15, 2024

అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనాకు భారత్ గట్టి చురక

- Advertisement -
- Advertisement -

మీ పిచ్చి వాదనలు వాస్తవాలను మార్చలేవు
చైనాకు భారత్ గట్టి చురక

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే.‘ జాంగ్‌నన్’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్ వేస్తోన్న అడుగులు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ నోరు పారేసుకున్నారు. ఈ విషయమై న్యూఢిల్లీతో దౌత్యపరంగా నిరసన తెలియజేసినట్లు ఆయన తెలిపారు.

దీంతో ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ దీటుగా సమాధానమిచ్చింది.‘ ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను ఉద్దేశిస్తూ చైనా చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్‌లోని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే అరుణాచల్‌లోనూ మా నేతలు పర్యటనలను చేపడతారు. ఈ పర్యటనలను వ్యతిరేకించడం, భారత అభివృద్ధి ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సహేతుకం కాదు. ఇది వాస్తవాలను ఏమాత్రం మార్చదు. అరుణాచల్‌ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. ఈ విషయాన్ని చైనాకు ఇప్పటికే అనేక సార్లు స్పష్టంగా చెప్పాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం అధికారిక ప్రకటనలో తెలిపారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రధాని మోడీ ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. చైనా భారత్ సరిహద్దుల్లోలని తవాంగ్‌కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘ సేలా ’సొరంగమార్గాన్ని ఆయన ప్రారంభించారు.అయితే ఈ రాష్ట్రాన్ని చైనా ‘జాంగ్‌నన్’( దక్షిణ టిబెట్)గా పేర్కొంటోంది. ఈ క్రమంలోనే మోడీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కింది. అది తమ భూభాగమేనంటూ మళ్లీ పాత పాటే పాడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News