వాషింగ్టన్ : చైనాకు కమ్యూనిస్టు దేశం అయిన క్యూబాలో గూఢచార స్థావరం ఏర్పర్చుకుని ఉందని అమెరికా ఆరోపించింది. క్యూబాలో చైనా నిర్వహణలో ఈ వేగు సంస్థ కనీసం 2019 నుంచి సాగుతూ వస్తోందని బైడెన్ అధికార యంత్రాంగంలోని ఓ అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చైనా తన ప్రయోజనాల కోసం ఇతర దేశాల రహస్యాలను సేకరించుకునే పనిలో ఉంది. ఈ వ్యవస్థను చాలా వ్యూహాత్మకంగా విస్తరించుకుంటోందని తెలిపిన అమెరికా అధికారి ఒక్కరు చైనా తన నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ, ఈ దిశలో సమర్ధతను చాటుకొంటోందన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం చైనా స్పైబేస్ క్యూబాలో చాలా ఏండ్లుగా ఉందన్నారు. చైనా వేగు చర్యలను నివారించేందుకు ఇటీవలి కాలంలో అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తోంది.
చైనా ఆటకట్టు దిశలో ఇతర మిత్రదేశాల సహకారం తీసుకొంటోంది. దౌత్య మార్గాలు, ఇతరత్రా చర్యలతో చైనాకు చెక్ దిశలో కొంత పురోగతి ఉందని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఇంటలిజెన్స్ విషయాలపై పట్టున్న వైట్‌హౌస్ సంబంధిత అధికారి తన పేరు చెప్పకుండా చైనా వేగు చర్యలను ప్రస్తావించారు. ప్రత్యేకించి క్యూబాలో చైనా వేగు స్థావరం ఉండటం ఆందోళన కల్గించే విషయం అని తెలిపిన ఈ అధికారి క్యూబా చైనాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా గూఢచార్యచర్యలను చేపట్టాలని వ్యూహాలు పన్నాయని వివరించారు. ఈ క్రమంలో క్యూబాలో కీలకమైన ఎలక్ట్రానిక్ సమాచార కేంద్రం ఏర్పాటుకు ఇరు దేవాల నడుమ సూత్రప్రాయం అంగీకారం కుదిరిందన్నారు. క్యూబా చైనా స్పై బంధం గురించి స్థానిక వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇవన్నీ నిరాధార వార్తలు అని వైట్‌హౌస్ అధికారికంగా తోసిపుచ్చింది.