బీజింగ్ : సముద్ర మట్టానికి 8,830 మీటర్ల ఎత్తులో ఎవరెస్టు పర్వత శిఖరంపై చైనా వాతావరణ కేంద్రాన్ని నెలకొల్పింది. చైనా శాస్త్రవేత్తల నేతృత్వంలో పర్వతారోహకుల బృందం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయగలిగారు. శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ఈ కేంద్రం సౌర ఫలకాల విద్యుత్ సాయంతో స్వయంగా పనిచేయగలుగుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని అందిస్తుంది. ప్రతి 12 నిమిషాలకోసారి ప్రసారం చేసేలా దీని రేడియో స్టేషన్‌ను కోడ్ చేశారు. రెండేళ్ల వరకు పనిచేసేలా దీన్ని డిజైన్ చేశారు. బ్రిటిష్, అమెరికా శాస్త్రవేత్తలు గతంలో సముద్ర మట్టానికి 8430 మీటర్ల ఎత్తులో ఎవరెస్టు శిఖరం దక్షిణం వైపు వాతావరణ కేంద్రాన్ని నెలకొల్పి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఈ కొత్త కేంద్రం అధిగమించింది.