Saturday, November 23, 2024

చైనా దూకుడును భారత్ ఆపలేదా!

- Advertisement -
- Advertisement -

అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ కలిగించింది. అవి చైనా స్వాధీనంలో ఉన్న భూభాగంలోనివే అంటూ తమకేమి పట్టన్నట్లు వ్యవహరించింది. చైనా ఆక్రమించిన భారత్ భూభాగమా లేదా చైనా సొంత భూభాగమా అన్న వివరణ లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం పాకిస్థాన్ స్వాధీనంలో ఉన్నప్పటికీ అక్కడ ఆ దేశ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా – రాజకీయపరంగా కావచ్చు లేదా సైనికంగా కావచ్చు మనం నిరసనలు తెలుపుతూ ఉంటాము. ఎందుకనే ఆ భూభాగాన్ని భారత్‌లో అంతర్భాగంగా మనం స్పష్టం చేస్తున్నాము. చైనా విషయంలో అటువంటి స్పష్టత లోపించిందా?

 

గత ఏడాది గాల్వాన్ లోయ వద్ద భారత సైనికులపై దొంగదెబ్బ తీయబోయి భంగపడినప్పటి నుండి సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్నది. రెండు దేశాల సైనికాధికారుల మధ్య పలు పర్యాయాలు చర్చలు జరిగినా వారి ధోరణిలో మార్పు రావడం లేదు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో నిర్మాణాలు, సేనల మోహరింపు కొనసాగిస్తున్నది. దానితో ఇప్పటి వరకు పశ్చిమాన పాకిస్థాన్ సరిహద్దుకు పరిమితమైన ఉద్రిక్తలు ఇప్పుడు చైనా సరిహద్దుకు విస్తరించాయి. చైనా ధోరణుల పట్ల దిగవంత చీఫ్ అఫ్ డిఫెన్సె స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పలు సందర్భాలలో కఠినంగా మాట్లాడారు. చైనా నుండి ఎటువంటి దాడులు ఎదురైనా ఎదుర్కొనేందుకు మన సేనలు సిద్ధపడుతూనే ఉన్నాయి.

సరిహద్దుల్లో రహదారులు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, అత్యాధునిక ఆయుధాలను మోహరించడం వంటివి చేస్తున్నాము. అయితే దౌత్యపరంగా చైనా దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నం తగు స్థాయిలో జరగడం లేదనిపిస్తుంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రదేశాలకు చైనా తమ పేర్లు పెట్టి, నోటిఫై చేసింది. అవ్వన్నీ తమ ప్రాంతాలనే పాత పాట పడింది. దీనిపై ఎప్పటివలే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండన ఇవ్వడం మినహా రాజకీయంగా స్పంద న కనిపించడం లేదు. దేశంలో ప్రధాన రాజకీయ పక్షాలు కూడా ముభావంగా కనిపిస్తున్నాయి.

అంతకు ముందు రెండు పర్యాయాలు, అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ కలిగిచింది. అవి చైనా స్వాధీనంలో ఉన్న భూభాగంలోనివే అంటూ తమకేమి పట్టన్నట్లు వ్యవహరించింది. చైనా ఆక్రమించిన భారత్ భూభాగమా లేదా చైనా సొంత భూభాగమా అన్న వివరణ లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం పాకిస్థాన్ స్వాధీనంలో ఉన్నప్పటికీ అక్కడ ఆ దేశ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా – రాజకీయ పరంగా కావచ్చు లేదా సైనికంగా కావచ్చు మనం నిరసనలు తెలుపుతూ ఉంటాము. ఎందుకనే ఆ భూభాగాన్ని భారత్‌లో అంతర్భాగంగా మనం స్పష్టం చేస్తున్నాము. చైనా విషయంలో అటువంటి స్పష్టత లోపించిందా?

ఈ మధ్యనే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో సహా పార్లమెంటేరియన్ల బృందం టిబెట్ ప్రవాస పార్లమెంటులో ఏర్పాటు చేసిన విందుకు హాజరవడంపై వారం తర్వాత, ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ విధంగా టిబెట్ స్వాతంత్య్రం కోరే వారికి మద్దతు అందించడం మానుకోవాలని అంటూ వారికి హితవు చెప్పింది. అఖిలపక్ష భారతీయ పార్లమెంటరీ ఫోరమ్ ఫర్ టిబెట్ ఆధ్వర్యంలో డిసెంబరు 22న ఢిల్లీలోని ఒక హోటల్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కనీసం ఆరుగురు ఎంపిలు హాజరయ్యారు. వీరిలో కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మేనకా గాంధీ, కెసి రామమూర్తి (కాంగ్రెస్), జైరామ్ రమేష్, మనీష్ తివారీ (కాంగ్రెస్), బిజెడి సుజీత్ కుమార్ (బిజెడి) ఉన్నారు. ఆ విధంగా మన ఎంపిలకు నేరుగా చైనా రాయబార కార్యాలయం లేఖలు రాయడంపై కూడా ప్రభుత్వం నుండి చెప్పుకోదగిన స్థాయిలో నిరసనలు వ్యక్తం కాలేదు. కేవలం బిజెడి ఎంపి సుజిత్ కుమార్ మాత్రమే ఘాటుగా స్పందించారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత పార్లమెంటు సభ్యునికి రాయడానికి చైనా రాయబార కార్యాలయంలో రాజకీయ సలహాదారు ఎవరు? భారత ఎంపిలకు లేఖలు పంపడానికి మీకు ఎంత ధైర్యం? ఏదైనా ఉంటే, మీరు అధికారిక మార్గాల ద్వారా మీ నిరసనను తెలియజేయవచ్చు అంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలను ఉటంకిస్తూ భారతదేశంలో టిబెటన్లు నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకావద్దని భారత ప్రభుత్వం సీనియర్ నాయకులును నాలుగేళ్ల క్రితం కోరడం గమనార్హం. అంటే టిబెట్ అంశంపై ఎంపిలకు సహితం స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ లేదా?

ఈ సంవత్సరం టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తన 80వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఇదివరలో ఆయన జన్మదినం రోజున స్వయంగా ప్రధాని ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈ ఏడాది ట్వీట్ రూపంలో కూడా శుభాకాంక్షలు తెలపలేదు. ఆయనే విదేశాంగ మంత్రిగాని, ప్రభుత్వం తరపున మరెవ్వరు గాని శుభాకాంక్షలు తెలపలేదు. ఈ పరిణామాలు చూస్తుంటే చైనా పట్ల భారత్ నిర్భయంగా వ్యవహరించడంలేదని భావింప వలసి వస్తున్నది. వాస్తవానికి చైనా ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నంత సాన్నిహిత్యం గత ప్రధానులలో ఎవ్వరికీ లేదు. ఆయన మొత్తం మీద 28 సార్లు వ్యక్తిగతంగా కలిసిన్నట్లు చెబుతున్నారు. ప్రధాని కాక ముందు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పలు పర్యాయాలు చైనా సందర్శించారు.

గుజరాత్‌కు చెందిన పలు వాణిజ్య ప్రతినిధి వర్గాలను తీసుకెళ్లారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్‌లో పలు చైనా పెట్టుబడులు కూడా వచ్చాయి. అంతటి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ చైనా విషయంలో ప్రధాని కఠిన వైఖరి అవలంబించకలేకపోవడం పలువురికి విస్మయం కలిగిస్తుంది. స్వదేశంలోని ప్రతిపక్ష నేతలపై ఇక్కడనే కాకుం డా విదేశాలలో కూడా యథేచ్ఛగా విమర్శలు, ఆరోపణలు కురిపించే ఆయన భారత్ పట్ల ద్వైపాక్షిగా ఒప్పందాలను ఉల్లంగిస్తున్న చైనా పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు. తమ దేశంలో ఆర్ధికంగా, ఇతరత్రా సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో తమ ప్రజల దృష్టి మళ్లించడం కోసమో లేదా ఇతరత్రా దూరదృష్టి ఎత్తుగడలతో భాగంగా పొరుగు దేశాలపై దురాక్రమణలు దిగడం చైనాకు పరిపాటి. గాల్వాన్ లోయలో ఘర్షణలను కూడా ఆ దృష్టితోనే చూడవలసి ఉంది.

ఇప్పుడు చైనా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నది. చైనాలో ప్రపంచ జనాభాలో 20 శాతం ఉండగా, ప్రపంచంలోని మంచి నీటిలో 7 శాతం మాత్రమే అక్కడ ఉంది. నీటి కొరత కారణంగా దేశం ఏటా 100 బిలియన్ల డాలర్లకు పైగా నష్టపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొరత, నిలకడలేని వ్యవసాయం పెద్ద మొత్తంలో భూమిని ఎడారిగా మారుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నీటి సంబంధిత విద్యుత్ కొరత సర్వసాధారణమై పోయింది. కొన్ని అంచనాల ప్రకారం, చైనా భూగర్భజలాల్లో 80 నుండి 90 శాతం, దాని నది నీటిలో సగం తాగడానికి చాలా మురికిగా ఉన్నాయి.

దాని భూగర్భజలాల్లో సగానికి పైగా, నది నీటిలో నాలుగింట ఒక వంతు పరిశ్రమలు లేదా వ్యవసాయానికి కూడా ఉపయోగపడవు. హిమాలయ పర్వతశ్రేణులలో పెరుగుతున్న చైనా దూకుడుకు మూలం నీటి సంక్షోభంగా తెలుస్తున్నది. కీలకమైన జలాలు భారతదేశానికి చేరుకోకముందే అడ్డువేసి, తమవైపు మళ్లించడం కోసం చైనా ప్రయత్నాలు చేస్తున్నది. భారతీయ వ్యూహాత్మక విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ చెప్పినట్లుగా, దక్షిణ చైనా సముద్రం, హిమాలయాలలో చైనా ప్రాదేశిక విస్తరణ, అంతర్జాతీయ నదీ పరీవాహక ప్రాంతాలలో నీటి వనరులను సొంతం చేసుకోవడానికి చేస్తున్న రహస్య ప్రయత్నాలతో కూడి ఉంది.గాల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే పట్టుదల దేశ ప్రజలలో పెరిగాయి. దీపావళి, ఇతర పండుగల సమయంలో చైనా నుండి దిగుమతులను గణనీయ సంఖ్యలో మన వ్యాపార వర్గాలు తగ్గించాయి. కానీ గత రెండేళ్లలో చైనా దిగుమతులను తగ్గించడంలో ప్రభుత్వ పాత్ర ఆశించిన మేరకు లేదు. మొత్తం మీద చైనా నుండి దిగుమతులు పెరుగుతున్నాయి.

యుపిఎ ప్రభుత్వంలోనే చైనా దిగుమతులపై ఆధార పడటం దేశ భద్రతకు ప్రమాదకరం కాగలదని ఒక నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఔషధ, టెలి కమ్యూనికేషన్ తదితర రంగాలలో చైనా దిగుమతులపై భారీగా ఆధారపడటం జాతీయ భద్రతను సవాల్ చేస్తున్నట్లు హెచ్చరించారు. ఆ విధమైన స్పష్టమైన హెచ్చరికలు ఉన్నప్పటికి రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేయడం కోసం, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం చేయవలసిన కృషి చేయడం లేదని భావించవలసి వస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News