Wednesday, January 22, 2025

యుద్ధ పరిష్కారం: చైనా వైఖరి

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ సంక్షోభం రాజకీయ పరిష్కారంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ 24- 2023న 12 అంశాలని వివరిస్తూ తమ వైఖరిని ప్రకటించింది. ఉక్రేయిన్‌పై రష్యా ఆక్రమణ యుద్ధానికి సంవత్సరం నిండిన సందర్భం అంటూ మన మీడియాలో కొన్ని విశ్లేషణలు ప్రచురించారు. అవన్నీ దాదాపుగా పాశ్చాత్య మీడియా అందించిన సమాచారం, వాదనలపై ఆధారపడినవే. జి-20 దేశాల సమావేశాలలో ఏకాభిప్రాయానికి రాలేక అధ్యక్ష స్థానం నుండి భారత్ ఉక్రెయిన్ స్థితిపై ఒక పరిశీలన మాత్రమే ప్రకటించగలిగింది. ఈ నేపథ్యంలో చైనా ప్రకటించిన ఈ అవగాహన ఆసక్తికరంగాను, ఆలోచనాత్మకంగాను ఉన్నది. ఈ ప్రతిపాదనలను లోతుగా పరిశీలించి అర్ధం చేసుకోవటం అవసరం.

1. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం: ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలతో సహా విశ్వ వ్యాప్తంగా గుర్తించబడిన అంతర్జాతీయ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి. అన్ని దేశాల సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం, ప్రాదేశిక సమగ్రతను కాపాడాలి. చిన్న- పెద్దా, ధనిక-పేద, బలమైన- బలహీనమైన దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాలూ అంతర్జాతీయ సమాజంలో సమాన సభ్యులే. అంతర్జాతీయ సంబంధాలను నియంత్రించే ప్రాథమిక నిబంధనలను అన్ని పక్షాలు పాటించాలి. అంతర్జాతీయ న్యాయాన్ని దాని సముచితత్వాన్ని రక్షించాలి. అంతర్జాతీయ చట్టాలను అమలు చేయటంలో ద్వంద్వ ప్రమాణాలను తిరస్కరించాలి.

2. ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని విడిచిపెట్టడం: ఒక దేశ భద్రతను ఇతరులకు హాని కలిగే విధంగా ముందుకు తీసుకెళ్లకూడదు. ఒక ప్రాంత భద్రతకోసమని సైనిక కూటములను బలోపేతం చేయడం, వాటిని విస్తరించడం చేయకూడదు. అన్ని దేశాల న్యాయబద్ధమైన భద్రతా ప్రయోజనాలను, వారి ఆందోళనలను తప్పనిసరిగా పరిగణించాలి, సరైన విధంగా పరిష్కరించాలి. సంక్లిష్టమైన సమస్యకు సులువైన పరిష్కారం వుండదు. అన్ని పక్షాలు ఉమ్మడిగా, సమగ్ర మైన, సహకారంతో సుస్థిర భద్రత కల్పించే దార్శనికతను అనుసరించాలి. దీర్ఘకాలిక ప్రపంచ శాంతి స్థిరత్వాలను దృష్టిలో ఉంచుకుని, సమతుల్యమైన, ప్రభావవంతమైన, స్థిరమైన యూరోపియన్ భద్రతా వ్యవస్థను రూపొందించడంలో సహాయపడాలి. ఇతరుల భద్రతను పణంగాపెట్టి తమ భద్రతను సాధించడాన్ని అన్ని పక్షాలూ వ్యతిరేకించాలి, కూటముల మధ్య ఘర్షణను నివారించాలి. యురేషియా ఖండంలో శాంతి స్థిరత్వం కోసం కలిసి పని చేయాలి.

3. విరోధాన్ని విరమించుకోవడం : సంఘర్షణ, యుద్ధం ఎవరికీ ప్రయోజనం చేకూర్చవు. అన్ని పక్షాలూ హేతుబద్ధంగా, సంయమనంతో వ్యవహరించాలి. రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను తీవ్రతరం చేయటం మానివేయాలి. సంక్షో భం అదుపు తప్పకుండా నిరోధించాలి. పరిస్థితులు మరింత క్షీణించకుండా జాగ్రత్త వహించాలి. రష్యా, ఉక్రెయిన్‌లు ఒకే దిశలో పని చేయడానికి, సాధ్యమైనంత త్వరగా ప్రత్యక్ష చర్చలను పునఃప్రారంభించడానికి అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలి, తద్వారా క్రమంగా పరిస్థితిని చక్కదిద్ది, అంతిమంగా సమగ్ర కాల్పుల విరమణకు చేరుకోవాలి.

4. శాంతి చర్చలను పునఃప్రారంభించడం: ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలు, సంప్రదింపులు మాత్రమే ఆచరణీయ పరిష్కారం. సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలను ప్రోత్సహించాలి, వాటికి మద్దతు ఇవ్వాలి. అంతర్జాతీయ సమాజం శాంతి కోసం చర్చలను ప్రోత్సహించే సరైన విధానానికి కట్టుబడి ఉండాలి, వీలైనంత త్వరగా రాజకీయ పరిష్కారానికి తలుపులు తెరవడానికి సహాయపడాలి. సంఘర్షణలో భాగస్వాముల మధ్య చర్చల పునఃప్రారంభానికి పరిస్థితులు, వేదికలను సృష్టించాలి. ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుంది.

5. మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడం: మానవతా సంక్షోభాన్ని తగ్గించడానికి అనువైన అన్నిచర్యలను ప్రోత్సహించాలి, మద్దతు ఇవ్వాలి. మానవతా కార్యకలాపాలను తటస్థంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి. మానవతా సమస్యలను రాజకీయం చేయకూడదు. సాధారణ పౌరులభద్రతను గట్టిగా పరిరక్షించాలి, సంఘర్షణ ప్రాంతాలనుంచి వారిని తరలించడానికి మానవతా కారిడార్ల ఏర్పాటు జరగాలి. పెద్ద ఎత్తున మానవతా సంక్షోభాన్ని నివారించడానికి సంబంధితప్రాంతాలకు మానవతా సహాయాన్ని పెంచడానికి, మానవతా పరిస్థితులను మెరుగుపరచడానికి, వేగవంతమైన, సురక్షితమైన, అంతరాయం లేని మానవీయ సహాయం అందించడానికి ప్రయత్నాలు అవసరం. యుద్ధ ప్రాంతాలకు మానవతా సహాయాన్ని అందించడంలో ఐక్యరాజ్య సమితికి సమన్వయ పాత్ర పోషించడంలో మద్దతు ఇవ్వాలి.

6. పౌరులు, యుద్ధ ఖైదీల రక్షణ: ఘర్షణ పడుతున్న పక్షాలు అంతర్జాతీయ మానవతా చట్టానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి, పౌరులు లేదా పౌర సౌకర్యాలపై దాడి చేయకూడదు, మహిళలు, పిల్లలు ఇతర బాధితులను రక్షించాలి. యుద్ధ ఖైదీలకున్న ప్రాథమిక హక్కులను గౌరవించాలి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధఖైదీల మార్పిడికి చైనా మద్దతు ఇస్తుంది. దీని కోసం మరింత అనుకూలమైన పరిస్థితులను సృష్టించాలని అన్ని పక్షాలకు పిలుపు నిస్తుంది.

7. అణు విద్యుత్ కేంద్రాలను సురక్షితంగా ఉంచడం: అణు విద్యుత్ కేంద్రాలు లేదా ఇతర శాంతియుత అణు కేంద్రాలపై సాయుధ దాడులను చైనా వ్యతిరేకిస్తుంది. కన్వెన్షన్ ఆన్ న్యూక్లియర్ సేఫ్టీ (సిఎన్‌ఎస్)తో సహా అంతర్జాతీయ చట్టాలను పాటించాలని, మానవ కల్పిత అణు ప్రమాదాలను ఖచ్చితంగా నివారించాలని అన్ని పక్షాలకు పిలుపు నిచ్చింది. శాంతియుత అణు కేంద్రాల భద్రతను ప్రోత్సహించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఎఇఎఏ)కు చైనా మద్దతు ఇస్తుంది.
8. వ్యూహాల ముప్పులు నిరోధించడం: అణ్వస్త్రాలు ఉపయోగించ కూడదు. అణుయుద్ధాలు చేయకూడదు. అణ్వాయుధాల ముప్పును నివారించాలి. అణ్వాయుధాలు వాడతామనే బెదిరింపులనువ్యతిరేకించాలి. అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించాలి. అణు సంక్షోభాన్ని నివారించాలి. రసాయన, జీవాయుధాల పరిశోధన, అభివృద్ధి, వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ దేశమూ చేపట్టకూడదని చైనా భావిస్తుంది. చైనా వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది.

9. ధాన్యం ఎగుమతులను సులభతరం చేయడం: రష్యా, తుర్కియే, ఉక్రెయిన్, ఐక్యరాజ్య సమితి సంతకాలు చేసిన నల్లసముద్ర ధాన్యం ఒప్పందాన్ని అన్ని పక్షాలు పూర్తిగా, సమర్థవంతంగా సమతులనంతో అమలు చేయాలి. ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషించడంలో ఐరాసకు మద్దతు ఇవ్వాలి. చైనా ప్రతిపాదించిన ప్రపంచ ఆహార భద్రతపై సహకారం ప్రపంచ ఆహార సంక్షోభానికి ఆచరణీయమైన పరిష్కారాన్ని అందిస్తుంది.
10. ఏకపక్ష ఆంక్షలను నిలిపివేయడం: ఏకపక్ష ఆంక్షలు, పెద్ద ఎత్తున చేసే ఆర్ధిక ఒత్తిళ్లు సమస్యను పరిష్కరించలేవు. అవి కొత్త సమస్యలను సృష్టిస్తాయి. భద్రతా మండలి ఏకపక్ష ఆంక్షలను చైనా వ్యతిరేకిస్తోంది. సంబంధిత దేశాలు ఇతర దేశాలపై ఏకపక్ష ఆంక్షలు విధించి, తమ అధికార పరిధిని ‘దుర్వినియోగం చేయడం మానుకోవాలి, తద్వారా ఉక్రెయిన్ సంక్షోభాన్ని తగ్గించడంలో తమ వంతు పాత్ర పోషించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు వారి ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడానికి వారి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి పరిస్థితులను సృష్టించాలి.

11. పారిశ్రామిక, సరఫరా గొలుసులను స్థిరంగా ఉంచడం: అన్ని పక్షాలు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిత్తశుద్ధితో కాపాడుకోవాలి. ఆర్థిక వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సాధనంగా లేదా ఆయుధంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకించాలి. సంక్షోభాన్ని తగ్గించడానికి; ఇంధనం, ఆహారం, వాణిజ్యం, రవాణాలో అంతరాయాలు నిరోధించడానికి, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను కొనసాగించడానికి అంతర్జాతీయ సహకారం, ఉమ్మడి ప్రయత్నాలు అవసరం.

12. సంఘర్షణానంతర పునర్నిర్మాణాన్ని ప్రోత్సహించడం: సంఘర్షణ ప్రాంతాలలో సంఘర్షణ అనంతర పునర్నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో చైనా శసహాయం అందించడానికి, నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది.

డా. జతిన్ కుమార్- 9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News