Friday, November 22, 2024

చైనాలో స్వేచ్ఛాగళం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: నిరంకుశత్వం ఎందుకోసం వుద్దేశించినదైనా జనాగ్రహాన్ని రుచి చూడక తప్పదు. ఇరాన్‌లో మతోన్మాద పాలకులకు వ్యతిరేకంగానూ, చైనాలో కమ్యూనిస్టు ప్రభువు లకు ప్రతి ఘటనగానూ ప్రజల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తల గుడ్డను (హిజాబ్) మత నిబంధనల ప్రకారం వేసుకోలేదని నిర్భంధించిన వొక మహిళ నైతిక పోలీసుల కస్టడీలో మర ణించడంతో ఇరాన్‌లో కొన్ని మసాల క్రితం మొదలైన ఉద్యమం చినికి చినికి గాలివానై వుప్పెన రూపం ధరిస్తున్నది. ఆదివారం నాడు దేశ వ్యాప్త లారీల సమ్మె జరిగింది. విశ్వ విద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు, రాత్రి పూట వీధి ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

చైనాలో జి జిన్ పింగ్ ప్రభుత్వం కొవిడ్ నిర్మూలన (జీరో కొవిడ్) విధానం సృష్టిస్తున్న దిగ్బంధాన్ని తట్టుకోలేక అక్కడ అనేక నగరాల్లో జనం వీధుల్లోకి వచ్చి తీవ్ర స్థాయి నిరసనోద్యమం నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని బీజింగ్, మహానగరం షాంగై, వురుంపి, నాంజింగ్, గ్యాంగ్జు, వూహాన్‌లలో ప్రజాగ్రహం కట్టలు తెంచు కొంటున్నది. చైనాలో కొవి డ్ మళ్ళీ పెరిగింది. రోజుకి 40000 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. బీజింగ్‌లో పరిస్థితి తీవ్రం గానే వుంది, కేసుల సంఖ్యలో ముందు రోజు కంటే తరువాతి రోజుకి 60 శాతంపైగా విజృంభణ కనిపిస్తున్నది.

ఇతర నగరాల్లోనూ హెచ్చు తగ్గులుగా కేసుల నమోదు కొనసా గుతున్నది. దీనితో విసు గెత్తిపోయిన చైనా పాలకులు కొవిడ్ అంతు చూడాలని నిర్ణయించుకొన్నారు. ప్రజలందరికీ ముఖ్యం గా వృద్దులకు పూర్తి వాక్సినేషన్ జరగలేదు. వేసిన టీకాల ప్రభావం మీదా అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్‌లే శరణ్యమని ప్రభుత్వం భావించింది. అది మోతాదు మించి పోయింది. అపార్ట్‌మెంట్లకు అధికారులు తాళాలు బిగించడం సాగుతున్నది. ఇది వికటించి ప్రాణాలను బలిగొంటున్నది. గత గురువారం నాడు జింజియాంగ్ రాష్ట్ర రాజధాని వురుంపిలో నివొక ఆకాశ హర్మ్యంలో అగ్ని ప్రమాదం సంభవించగా బయటికి పోయే దారి లేక మంటల్లో మాడి పది మంది దుర్మరణం పాలయ్యారు. దీనితో ప్రజాగ్రహం పెల్లుబికింది. అనేక నగరా ల్లో వేల కొద్దీ జనం బయటికి వచ్చి తమ అసంతృప్తిని, తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రారంభిం చారు. దేశానికి తిరుగులేని అధినేతగా, మావో తర్వాత అంతటి ఆదుపాజ్ఞలున్న నాయకుడుగా యిటీవలే వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి స్వీకరించిన జి జిన్‌పింగ్ గద్దె దిగాలని, కమ్యూనిస్టు పాలన అంతమవ్వాలని కొంత మంది నిరసనకారులు నినాదాలివ్వడం గమనార్హం, ఊహాన్‌లో భారీ యెత్తు నిరసనలు చోటు చేసుకొన్నాయి మెటల్ బారికేడ్లను విరిచి పోగులు పెట్టారు, కొవిడ్ పరీక్షా కేంద్రాలను కూల్చి వేశారు.

China ducks Lanka debt restructuring requests

ఇది వూహాన్‌లోనే పుట్టింది,’ వూహాన్‌లోనే అంతమవుతుంది’ అనే నినాదాలు మిన్నుముట్టాయి. కొవిడ్ మొదటి సారి 2019డిసెంబర్‌లో బయటపడి ప్రపంచమంతటికీ వ్యాపించింది. ఇప్పుడు జీరో కొవిడ్ ప్రపంచంలో ఏదేశంలో లేనంత కఠిన షరతులతో అమ లవుతున్నది. ఒకరిని మరొకరు కలుసుకోడానికి వీలు లేకుండా పని పాట్లు బందయిపోయి, ఆఫీ సులకు, మార్కెట్లకు, విహార కేంద్రాలకు వెళ్ళనీయకుండా, తిండి కూడా దూరమై అర్ధాకిలితో ప్రజలు తీవ్ర నిర్భంధాన్ని యెదుర్కొంటున్నారు. స్వేచ్ఛను మరీ ఇంతగా కోల్పోడాన్ని సహించ లేకపోతు న్నారు. కరడుగట్టిన కమ్యూనిస్టు నియంత్రత్వ ప్రభుత్వాన్ని యెదిరించడం యెంత ప్రమాదమో వారికి తెలుసు. అయినా వేరే మార్గం లేక వీధుల్లోకి వస్తున్నారు. షాంగైలో ’జి జిన్ పింగ్, దిగిపో’, కమ్యూనిస్ట్ పార్టీ తప్పుకో, మాకు పి సి ఆర్ టెస్టులు వద్దు, స్వేచ్ఛ కావాలి, పత్రిక స్వేచ్ఛ కావాలి’ అనే నినాదాలిచ్చిన మూడు వందల మందిపై పోలీసులు మిరియాల పొడి (పెప్పర్ స్ప్రే) చల్లారు. దానితో నిరసనకార్ల సంఖ్య బాగా పెరిగి పోలీసులతో ఘర్షణలు సంభవించాయి. సుదీర్ఘ లాక్ డౌన్‌లతో వ్యాపారాలు దెబ్బ తినడం కూడా ప్రదర్శనల తీవ్రతకు దారి తీస్తున్నది.

దేశంలో వాక్స్వాతంత్య్రం లేనందున తెల్ల కాగితాల నిరసనను కూడా చేపట్టారు. తాము చెప్పలేకపోతున్న ప్రతి వొక్క విషయాన్నీ తెల్ల కాగితాల ప్లకార్డులు తెలియజేస్తాయని, వొక నిరసనకారుడు పేర్కొన్నాడు. 2020లో హాంగ్‌కాంగ్ నిరసనకారులు యిటీవల మాస్కోలో యుద్ధవ్యతిరేక ప్రదర్శకులు శ్వేతపత్ర నిరసనను అశ్రయించారు. సుదీర్ఘ లాక్ డౌన్‌ల వల్ల చైనాలో పరిశ్రమలు మూతపడి వుత్పత్తి దెబ్బ తింటున్నది. ఈ ఏడాది 5.5% వృద్ధిని సాధించాలని పెట్టుకొన్న లక్ష్యం దెబ్బతిని 3.9% వద్దనే ఆగిపోతున్నది. గతంలో తీన్ ఆన్ మిన్ స్క్వేర్ వద్ద సంభవించిన నిరసనలు సైన్యం విరుచుకుపడడానికి, విద్యార్థుల ప్రాణార్పణానికి, రక్తపాతానికి దారి తీసింది. యిప్పుడు అనేక నగరాల్లో పెద్ద ఎత్తు నిరసనలు చోటు చేసుకొన్నాయి కాబట్టి అటువంటిది జరిగే అవకాశం లేదు. కాని జి జిన్ పింగ్ ఏవిధంగా స్పందిస్తాడు, జీరో కొవిడ్ కాఠిన్యతను సడలిస్తాడో లేదో చూడాలి. పార్టీ, సైన్యం ఆయన చెప్పు చేతల్లో వున్నాయి కాబట్టి ఆయన అధికారానికి ధోకా వుండదు. సొంత ప్రజలతో అదే సమయంలో తిరిగి విజృంభిస్తున్న కొవిడ్‌తో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. కొవిడ్ నిర్మూలన లక్ష్యం మంచిదే కాని రోగనివారణకు వేసే మందు రోగాన్ని మించిపోయి రోగిని బాధించకూడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News