న్యూఢిల్లీ : బారత్‌లో జరిగే జి 20 సదస్సుకు చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ వస్తారా? లేక పరోక్షంగా సందేశం పంపిస్తారా? అనేది స్పష్టం కాలేదు. ఈ నెల 9, 10 తేదీలలో భారతదేశం అధ్యక్ష బాధ్యతల్లో సాగే జి 20 సమ్మిట్ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుంది. దీనికి అమెరికా అధ్యక్షులు జో బైడెన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్ , జపాన్, బ్రెజిల్ ఇతర నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయా దేశాల నుంచి అధికారికంగా నిర్థారణ సమాచారం కూడా అందింది.
రష్యా అధ్యక్షులు పుతిన్ ఈ భేటీకి రావడం లేదు. కాగా చైనా ఇంతవరకూ జిన్‌పింగ్ హాజరీపై ఎటువంటి ప్రకటన వెలువరించలేదు. ఈ సమ్మిట్‌లో వ్యక్తిగత హాజరీకి చైనా నేత రాకపోవచ్చునని అనధికారిక వర్గాలు తెలిపాయి. జి 20 సదస్సుకు తమ దేశాధినేత హాజరీపై తాను చెప్పడానికి ఏమీ లేదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. జిన్‌పింగ్ కానీ ఇతర నేతలు కానీ ఈ సమ్మిట్‌కు వెళ్లేది లేనిది తనకైతే ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.