బీజింగ్: ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను చైనా తప్పుపట్టింది. భారతదేశానికి దౌత్యపరంగా తన నిరసన తెలిపింది. భారతదేశ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయని చైనా అధికారికంగా విమర్శించింది. గతవారం ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీ శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో 13,000 అడుగుల ఎత్తున నిర్మితమైన అత్యంత కీలకమైన వ్యూహాత్మక సెలా టన్నెల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఈ ప్రాంతంలో భారతీయ సేనల కదలికలు మరింత సులువు అయ్యేందుకు, ప్రత్యేకించి ప్రాధాన్యతల భౌగోళిక ప్రాంతంలో ఉన్న తవాంగ్‌కు అన్ని కాలాల్లోనే మార్గ రవాణా అనుసంధానం ఏర్పడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా చాలాకాలంగా వాదిస్తోంది. ఈ ప్రాంతం తమకు సౌత్ టిబెట్ వంటిదని చెపుతూ వస్తోంది. చైనా ఈ ప్రాంతాన్ని తమ భాషలో జాంగ్‌నాన్ అని వ్యవహరిస్తోంది. ఈ ప్రాంతంలో భారతీయ నేతలు ఎవరు పర్యటించినా నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు దౌత్యపరంగా ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్ సందర్శనను తప్పుపట్టింది. ఈ ప్రాంతం తమదే అని చైనా అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ఇప్పుడు స్పష్టం చేశారు.