భారత సైన్యం విడుదల చేసిన వీడియోలో దృశ్యాలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులనుంచి బలగాల ఉపసంహరణకు భారత్, చైనాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇరు దేశాల బలగాల ఉపసంహరణ బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తూర్పు లడఖ్‌లోని దక్షిణ వైపునుంచి బలగాల ఉపసంహరణకు చైనాతో ఒప్పందం కుదిరినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరుబలగాల ఉపసంహరణ బుధవారం ప్రారంభమైనట్లు చైనా రక్షణ శాఖ కూడా ఇదివరకే ప్రకటించింది. కాగా ఈ సరస్సు దక్షిణతీరం నుంచి చైనా తన ట్యాంకులను చైనా బుధవారం వేగంగా ఉపసంహరించుకుంది. భారత సైన్యం విడుదల చేసిన వీడియోలో కనిపించిన దానిప్రకారం పాంగాగ్ సో దక్షిణ వైపునుంచి భారత, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయి.
భారీ ఆయుధాలతోదళాలు చాలా దగ్గరగా ఉన్నట్లు కూడా ఈ వీడియోలో కనిపించింది. కాగా పాంగాంగ్ సోనుంచి భారత, చైనా బలగాల ఉపసంహరణ తొలి దశ ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వ్యూహాత్మక శిఖరాలపైకి చేరకున్న భారత బలగాలు ఈ దశలో చివరగా వెనక్కి తిరిగి వస్తాయి. ఈ ప్రక్రియ సంతృప్తికరంగా పూర్తయితే కైలాష్ రేంజ్‌లో బలగాల ఉపసంహరణ చేపడతారు. పాంగాంగ్‌సోనుంచి బలగాల ఉపసంహరణ తర్వాత 10వ విడత కార్ప్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో డెసాగ్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్, దెమ్‌చోక్ ప్రాంతాలనుంచి బలగాల ఉపసంహరణపై చర్చిస్తారు.