Sunday, December 22, 2024

చైనా మ్యాపు కుట్ర!

- Advertisement -
- Advertisement -

నోటితో పలకరించి, నొసటితో వెక్కిరించడం చైనాకు అలవాటైన విద్యే. ఇండియాతో గల సరిహద్దుల లోపల నిగూఢంగా గ్రామాలు నిర్మించి దానిని తన భూభాగంగానూ, అరుణాచల్‌ప్రదేశ్ మొత్తాన్ని తనదిగానూ చెప్పుకోడం దానికి కొత్త కాదు. అదే విద్యను చైనా మరొకసారి ప్రదర్శించింది. ఇటీవల దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్‌బర్గ్‌లో బ్రిక్స్ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మన ప్రధాని నరేంద్ర మోడీతో ముచ్చటించి సరిహద్దుల్లోని ఆక్రమణల నుంచి రెండు దేశాల సైన్యాలను ఉపసంహరించుకొందామని సంకల్పం చెప్పుకొన్నట్టు వచ్చిన వార్తల తడి ఆరక ముందే మొన్న సోమవారం నాడు బీజింగ్ ప్రభుత్వం ఒక కొత్త జాతీయ పటాన్ని ప్రచురించింది. జాతీయ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో ఈ పటాన్ని వుంచింది. దాని ప్రకారం మన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌ను తన భూభాగంగా చేర్చుకొన్నది. దానిని టిబెట్‌లో భాగంగా చూపింది.

అలాగే భారత చైనా ఇటీవల ఘర్షణ పడిన డోక్లామ్ ప్రాంతాన్ని కూడా తనదిగానే ఆ పటంలో పేర్కొన్నది. పశ్చిమ సరిహద్దు రంగంలో గల అక్సాయ్ చిన్‌ను సైతం తనదిగానే చెప్పుకొన్నది. అక్సాయ్ చిన్ వాస్తవానికి ఇప్పుడు చైనా ఆధీనంలోనే వున్నప్పటికీ అది భారత భూభాగంగానే పరిగణన పొందుతున్నది. చైనా ఇలా ఎందుకు చేస్తున్నది అనే దానికి బీజింగ్ పాలకుల విచిత్ర చిత్తప్రవృత్తే కారణమని చెప్పుకోవలసి వుంది. గతంలో రెండు సార్లు 2017 ఏప్రిల్‌లో, 2021 డిసెంబర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు చైనా తన పేర్లు ప్రకటించింది. వాటిని దక్షిణ టిబెట్‌లో భాగంగా చెప్పుకొన్నది. వాస్తవాధీన రేఖ వద్ద అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులోని తవాంగ్ సెక్టార్‌లో భారత చైనా సేనలు ఘర్షణ పడిన సందర్భం తెలిసిందే. చైనా ఇలా కొత్త పేర్లు పెట్టిన అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాల్లో పర్వత శిఖరాలు, నదులు, నివాస ప్రాంతాలు కూడా వున్నాయి.

ఇప్పుడు కూడా ఇంచుమించు అదే దుస్సాహసానికి చైనా పాల్పడింది. దీనిపై మన విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ చైనా ఇలా చేయడం కొత్త కాదని అన్నారు. భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలను తన భాగాలుగా చెప్పుకొంటూ పటాలు సృష్టించినంత మాత్రాన వాస్తవ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాదని, తన భూభాగం విషయంలో భారత ప్రభుత్వానికి స్పష్టత వున్నదని ఆయన అన్నారు. ఇలాంటి తప్పుడు మ్యాపులు సృష్టించడం వల్ల ఇతర దేశాలకు చెందిన భూభాగాలు చైనావిగా మారిపోబోవని ఆయన వ్యాఖ్యానించారు. ఆగ్నేయాసిలోని తన పొరుగు దేశాలతో వివాదంలో వున్న దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌లను కూడా చైనా తన భూభాగంగా పేర్కొనడం పట్ల ఇండియా అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల్లో (సెప్టెంబర్ 9, 10) న్యూఢిల్లీలో జి 20 దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనుండగా చైనా ఈ కొత్త మ్యాపును విడుదల చేయడం గమనించదగిన విషయం. జి 20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.

తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశానికి రావలసిందిగా జీ జిన్‌పింగ్‌ను ఇండోనేసియా ఆహ్వానించింది. అక్కడకు ప్రధాని మోడీ కూడా వెళ్ళనున్నారు. ఇలా రెండు దేశాల అధినేతలు త్వరలోనే కలుసుకొనే అవకాశాలు వున్న నేపథ్యంలో చైనా ఇటువంటి వివాదాస్పమైన చర్యలు చేపట్టడం సంబంధాలను ఎంత మాత్రం మెరుగుపరచదు. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా మోడీ జీ జిన్‌పింగ్ కలుసుకొన్న దానికి సంబంధించి భారత్, చైనా విడుదల చేసిన ప్రకటనలలో కూడా తేడా కనిపించింది. సరిహద్దు ఆక్రమణల నుంచి సేనలను ఉపసంహరించేలా సైనికాధికారులను ఆదేశించాలని నేతలు ఇద్దరూ అంగీకారానికి వచ్చారని ఇండియా వైపు నుంచి ప్రకటన రాగా సంబంధాలను మెరుగు పరచుకోడం ముఖ్యమని జీ జిన్‌పింగ్ నొక్కి పలికినట్టు చైనా తరపు ప్రకటన పేర్కొన్నది. చైనా అరమరికలు లేకుండా వ్యవహరించడం లేదని దీనిని బట్టి స్పష్టపడుతున్నది. లోపల ఒకటి, బయట మరొకటిగా వ్యవహరిస్తున్నదని రూఢి అవుతున్నది.

1962 నాటి యుద్ధం తర్వాత చిన్న చిన్న ఘర్షణలు తప్ప మొత్తంగా ఇంత కాలం ప్రశాంతంగా వున్న భారత్ చైనా సరిహద్దులు మళ్ళీ ఉద్రిక్తం కావడం బాధాకరమైన విషయం. 2020 జూన్‌లో రక్తసిక్త ఘర్షణలు జరిగిన లడఖ్ సరిహద్దు ప్రాంతంలో ఉభయ దేశాల సైన్యాలు పూర్వపు ప్రదేశాలకు ఉపసంహరించుకొనే వైపు సైన్యాధికారుల మధ్య 19 సార్లు చర్చలు జరిగినా సమస్య పూర్తి పరిష్కారానికి నోచుకోలేదు. ఇటీవల చోటు చేసుకొన్న 19వ రౌండ్ చర్చలు కొంత ఆశను కల్పించినప్పటికీ చైనా తాజా చర్య కొత్త అనుమానాలకు దారి తీస్తున్నది. ఈ నేపథ్యంలో ఇండియా మరింత అప్రమత్తంగా వుండడమే శరణ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News