చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్
ఒక్క రోజే 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు
బీజింగ సహా ఇతర నగరాల్లో ప్రజలందరికీ సామూహిక పరీక్షలు
గ్వాంగ్‌ఝులో లాక్‌డౌన్ ఆంక్షలు
బీజింగ్: కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఆ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 11,773 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాజధాని బీజింగ్‌లో అదే రోజు 118 కేసులు వెలుగు చూశాయి. దీంతో అక్కడ ఉన్న 2 కోట్ల మంది ప్రజలకు అధికారులు రోజువారీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన 10 వేల మందికి పైగా బాధితుల్లో ఆ వ్యాధి లక్షణాలు లేనప్పటికీ ఒక్క రోజే ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కొవిడ్ ఆంక్షలను సడలించాలని చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న 24 గంటలు గడవక ముందే పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో కొవిడ్ కొత్త దశ కట్టడికి ఆ దేశ అధికార యంత్రాంగం తిరిగి ఆంక్షలను అమలులోకి తెచ్చింది. కోటీ 30 లక్షల జనాభా కలిగిన గ్వాంగ్‌ఝు నగరంలో 3,775 కేసులు వెలుగు చూడడంతో అధికారులు అక్కడి ప్రజలకు పరీక్షలు నిర్వహించడం మొదలు పెట్టారు.
అంతేకాకుండా శనివారం రోజు ఇళ్లలోనే ఉండాలని జిల్లా ప్రభుత్వం సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది. ఆహారం కొనుగోలు చేయడానికి ఒక్క మనిషిని మాత్రం బైఇకి అనుమతించడం జరుగుతుందని ప్రకటించారు. హాంకాంగ్‌కు ఉత్తరంగా 75 మైళ్ల దూరంలో ఉన్న ఈ నగరంలో అన్ని బస్సు, సబ్‌వే సర్వీసులను నిలిపి వేశారు. పాఠశాలలను సైతం మూసివేశారు. గ్వాంగ్‌ఝు నగరంనుంచి బీజింగ్‌కు, ఇతర నగరాలకు విమాన సర్వీసులను సైతం రద్దు చేశారు. మరో వైపు దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు, కార్యాలయ భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి ప్రవేశించే వారు ఆ రోజు జరిపిన వైరస్ పరీక్షలో నెగెటివ్ ఉన్నట్లుగాసర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. జెంగ్‌ఝౌ, చాంగ్‌క్విన్ నగరాల్లో దాదాపు 50 లక్షల మంది లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. చాంగ్‌క్విన్ నగరంలో పాఠశాలలను సైతం మూసి వేశారు.
అయితే అక్కడ ఎంత ందికి వైరస్ సోకిందో మాత్రం అధికారులు వెల్లడించలేదు. మరో వైపు జెంగ్‌ఝౌ నగరంలో దాదాపు 66లక్షల మంది ప్రజలకు శనివారం భారీ ఎత్తున సామూహిక పరీక్షలను నిర్వహించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు జరిగిన నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వ్యాపార, వినియోగ కార్యకలాపాలు తగ్గుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది చైనా ఆర్థిక వృద్ధి 3 శాతం మేరకే ఉండవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత దశాబ్దకాలలంలో చైనాలో వృద్ధి రేటు ఇంత తక్కువగా ఉండడం ఇదే మొదటి సారవుతుంది. మరో వైపు మరో ఏడాది పాటు చైనాలోజీరో కొవిడ్ విధానం కొనసాగవచ్చని ఆర్థికవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
China Reports 11773 new corona cases in a day