ఏడాది తరువాత ఒమిక్రాన్‌గా వ్యాప్తి
బీజింగ్ : చైనాలో ఏడాది తరువాత ఇప్పుడు రెండు కొవిడ్ మరణాలు నమోదు అయ్యాయి. ఇటీవలి రోజులలో చైనాలోని పలు ప్రాంతాలలో కరోనా కొత్త వేరియంట్లు ఉధృతరూపం దాల్చడంతో లాక్‌డౌన్‌లు విధిస్తూ వస్తున్నారు. శనివారం ఇద్దరు వ్యక్తులు వైరస్ వ్యాప్తి ప్రాంతం అయిన జిలిన్‌లో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు నిర్థారించారు. 2021 జనవరి తరువాత ఇది దేశంలో నమోదు అయిన తొలి కరోనా మరణాల రికార్డు. అత్యంత ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు చైనాలో నెలకొంది. జిలిన్ ప్రాంతంలో ఇప్పుడు ఈ కొవిడ్ మరణాలతో దేశంలో ఇప్పటివరకూ కరోనా మరణాల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 4368కి చేరుకుంది. ఇప్పుడు ఒమిక్రాన్ కరోనాకు కాటు అయిన వారు ఇద్దరూ వృద్ధులే. వారికి ఇతరత్రా వయో సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. మృతులలో ఓ వ్యక్తి వ్యాక్సినేషన్ చేయించుకోలేదని వెల్లడైంది. ఒమిక్రాన్ వైరస్ ఇప్పుడు అత్యధికంగా జిలిన్ ప్రాంతంలోనే వ్యాప్తి చెందుతూ ఉండటంతో ఇక్కడ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. సరిహద్దులు దాటేందుకు ముందుగా సంబంధిత అధికారులు, పోలీసుల వద్ద అనుమతి తీసుకుని తీరాలి. పేర్లు వివరాలు నమోదు చేసుకోవాలి.