Tuesday, February 4, 2025

ట్రంప్ యాక్షన్.. చైనా రియాక్షన్

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధానికి చైనా నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయగా, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించింది. చమురు, వ్యవసాయ పరికరాలపై ఆ టారిఫ్ 10 శాతం ఉంటుందని స్పష్టం చేసింది. టంగ్‌స్టన్ సంబంధిత పదార్థాల ఎగుమతులపై నియంత్రణ విధించింది. పీవీహెచ్ కార్పొరేషన్, ఇల్యుమినా ఇంక్ వంటి అమెరికా సంస్థలను విశ్వసనీయత లేనివాటి జాబితాలో చేర్చింది.

ఇదే కాకుండా అనైతిక వ్యాపార పద్ధతులు అవలంబిస్తున్న అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ పైనా చైనా విచారణ జరపనుంది. ఈ రెండు పెద్ద దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాలు విధించుకోవడంతో ట్రేడ్ వార్ భయాలు మొదలయ్యాయి. ఇప్పటికే చైనా కరెన్సీ యువాన్ విలువ పతనమైంది. ఆ ప్రభావం ఇతర దేశాల కరెన్సీల పైనా పడింది. ఆస్ట్రేలియా డాలర్, న్యూజిలాండ్ డాలర్ విలువలు పడిపోయాయి.
డబ్లుటీవోలో సవాలు
ట్రంప్ సుంకాలు విధించడంపై ఇప్పటికే చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ మండిపడింది. దాన్ని డబ్లుటీవోలో సవాలు చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులు కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారీ బెదిరించకుండా , ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. తాజాగా సుంకాల రూపంలో కౌంటర్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News