బీజింగ్: చంద్రుడి ఆవలి భాగాన్ని శోధిస్తున్న చైనా రోవర్ యుతు-2 తాజాగా కీలక ఘనతను సాధించింది. అక్కడ వెయ్యి మీటర్ల దూరం ప్రయాణించింది. చందమామకు సంబంధించిన ఒక వైపును మాత్రమే భూమి నుంచి వీక్షించడానికి వీలవుతుంది. కనిపించని అవతలి భాగం గుట్టుమట్టు విప్పేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా 2019లో చాంగె4 వ్యోమనౌకను చైనా పంపించింది. అందులోని యుతు2 రోవర్ అద్భుతంగా పరిశోధనలు సాగిస్తోంది. చైనా జానపద కథల్లోని ‘పచ్చ కుందేలు’ పేరును దీనికి ఖరారు చేశారు. ఈ రోవర్ తాజాగా 1,003.9 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. అనేక చిత్రాలను పంపించింది. ఇప్పటికే ఇది అద్భుతంగానే పనిచేస్తోంది. ఇటీవల ఈ రోవర్ … తనకు 80 మీటర్ల దూరంలోని ఒక వస్తువుకు సంబంధించిన అస్పష్ట చిత్రాన్ని పంపింది. అది సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు ఈ రోవర్ ఆ నిగూఢ వస్తువును 10 మీటర్ల దూరానికి వెళ్లి పరిశీలించింది. దాన్ని శిలగా భావిస్తున్నారు. అది ‘పచ్చకుందేలు’లా కనిపించడం విశేషం.
China Rover Travels over 1000 meters on Moon far side