తైవాన్ అధ్యక్ష విజేతకు ఫెర్డినాండ్ మార్కోస్ అభినందన
ఫిలిప్పైన్స్ రాజకీయ వాగ్దానాలు ఉల్లంఘించారని విమర్శ
అది చైనా విదేశాంగ వ్యవహారాల అతిక్రమణే
బీజింగ్ : తైవాన్ అధ్యక్ష ఎన్నికల విజేత లాయ్ చింగ్ తేకు అభినందన సందేశాన్ని పంపించినందుకు ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌ను చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధిక్షేపించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం ఫిలిప్పైన్స్ రాయబారిని పిలిపించి ఫెర్డినాండ్ తీరుకు ఆక్షేపణ తెలియజేసింది. చైనా పట్ల ఫిలిప్పైన్స్ చేసిన రాజకీయ వాగ్దానాలను మార్కోస్ వ్యాఖ్యలు తీవ్రంగా ఉల్లంఘించాయని, చైనా విదేశాంగ వ్యవహారాల్లో తీవ్ర జోక్యమేనని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మావో నింగ విలేకరులతో చెప్పారు.
తైవాన్‌ను తన అంతర్భాగమని చైనా చెప్పుకుంటున్నది. అవసరమైతే తమ బలంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలమని చైనా వాదిస్తోంది. తైవాన్ ప్రభుత్వానికి చట్టబద్ధతను ఆపాదించే ప్రకటనలను చైనా ఖండిస్తుంటుంది. ‘తైవాన్ సమస్యపై నిప్పుతో చెలగాటమాడవద్దని ఫిలిప్పైన్స్‌కు స్పష్టం చేయదలిచాం. తైవాన్ సంబంధిత అంశాలపై తప్పుడు మాటలు, పనులు వెంటనే మానుకోవలసిందని హెచ్చరిస్తున్నా. తైవాన్ స్వాతంత్య్రం, వేర్పాటువాద శక్తులకు తప్పుడు సంకేతాలు ఏవైనా పంపడం మానుకోవాలి’ అని మావో నింగ్ అన్నారు. తైవాన్ అధ్యక్షుడుగా ఎన్నికైన లాయ్ చింగ్ తేను మార్కోస్ జూనియర్ సోమవారం అభినందించారు.