Wednesday, January 22, 2025

తైవాన్‌పై చైనా ఆంక్షలు.. దిగుమతుల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చైనా అన్నంత పనిచేసింది. తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు చైనా కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం ప్రకటించింది. చైనా నుంచి తైవాన్‌కు ఇసుక రవాణాను కూడా ఆపేస్తున్నట్టు వెల్లడించింది. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫలాల దిగుమతులను రద్దు చేస్తున్నామని పేర్కొంది. ఈ పండ్లలో పురుగుల మందు (పెస్టిసైడ్స్) అవశేషాలు అధిక మోతాదులో ఉన్నాయని, ప్యాకింగ్‌పై పరీక్షలు చేయగా, కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొంది. పదేపదే ఈ తరహా ఆనవాళ్లు గుర్తించిన తరువాత ఈ చర్యలు తీసుకున్నట్టు కారణంగా చూపింది.

చైనా నుంచి తైవాన్‌కు ఇసుక రవాణాను నిలిపివేతను చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా ప్రత్యేక ప్రకటనలో నిర్ధారించింది. తైవాన్ లక్షంగా చైనా ఆంక్షలు విధించడం కొత్తేమీ కాదు. 2021 మార్చి లో తైవాన్ నుంచి పైన్‌యాపిల్ దిగుమతులను చైనా నిలిపివేసింది. తైవాన్ అధ్యక్షురాలిగా త్సాయ్ ఇంగ్ వెన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చైనా ఒత్తిళ్లు పెరిగాయి. తైవాన్ చైనాలో అంతర్భాగం కాదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశమని త్సాయ్ ఇంగ్‌వెన్ చెబుతుండటము ఈ ఒత్తిళ్లకు కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనను నిరసిస్తూ చైనా మిలిటరీ కసరత్తు నిర్వహించనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. తైవాన్ ద్వీపం చుట్టూ సంయుక్త కసరత్తు నిర్వహించాలని చైనా భావిస్తున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి.

China stops Trade Import from Taiwan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News