బీజింగ్ : భారత్‌లో కరోనా విలయ తాండవంతో చైనాకు చెందిన ప్రముఖ సిచుయాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ తన కార్గో విమానాలను 15 రోజుల పాటు నిలిపివేసింది. జియాన్ ఢిల్లీ, జియాన్‌ముంబై, చెంగ్డుచెన్నై, చాంగ్కింగ్‌చెన్నై, చెంగ్డుబెంగళూరు, చాంగ్కింగ్‌ఢిల్లీ మధ్య మొత్తం ఆరు మార్గాల్లో పది కార్గో విమానాలను నిలిపివేసినట్టు సోమవారం ప్రకటించింది. దీనివల్ల చైనా నుంచి ఆక్సిజన్, ఇతర వైద్య సామగ్రి దిగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని భారత్ లోని ప్రైవేట్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయ. కరోనా నియంత్రణకు తగిన సహాయం అందిస్తామని చైనా ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు వంటి అత్యవసరాలను సమకూర్చుకోవడం కష్టమౌతుంది. 800 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సోమవారం వెళ్లాయని, మరో 10 వేలు వారంలో సరఫరా అవుతాయని కొలంబో లోని చైనా దౌత్య కార్యాలయం ప్రకటించింది.