Sunday, April 20, 2025

చైనా షాక్… అమెరికా షేక్

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలతో బెదిరిస్తూ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగా చైనా కూడా దీటుగా చర్యలు చేపట్టింది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని చైనా నిలిపివేసింది. దీంతో పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ తయారీ, సెమీకండక్టర్ల కంపెనీలకు సమస్యలు ఎదురు కానున్నాయి. అంతేకాదు అగ్రరాజ్యానికి చైనా తాజాగా మరో షాక్ ఇచ్చింది. అమెరికా వైమానిక రంగ దిగ్గజమైన బోయింగ్ నుంచి ఎటువంటి డెలివరీలు అంటే వైమానిక రంగంలో వినియోగించే విడిభాగాలను అమెరికా నుంచి కొనుగోలు చేయవద్దని స్వదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది.

ఈ షాక్‌లు అమెరికాను షేక్ చేస్తున్నాయి. అయినా అమెరికా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. తమ మార్కెట్ పైనే చైనా ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి చైనాయే తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని సన్నా యి నొక్కులు నొక్కుతోంది. చైనా ప్రస్తుతం రూపొందిస్తున్న ఎగుమతుల నిబంధనలు అమలులోకి వచ్చే వరకు చైనా పోర్టుల నుంచి మాగ్నెట్‌ల ఎగుమతులు కావు. కార్లు, డ్రోన్లు నుంచి రోబోలు, క్షిపణులు వరకు అత్యంత అవసరమైన మేగ్నెట్లు ఎగుమతి కాకుంటే అమెరికాతోపాటు మరికొన్ని దేశాల్లో ఈ అరుదైన ఖనిజాలపై ఆధారపడే కంపెనీలు శాశ్వతంగా మూతపడక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు 90 శాతం చైనా నుంచే సరఫరా అవుతున్నాయి. అమెరికాలోని లాక్‌హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి సంస్థలు 90% ముడి పదార్ధాలకోసం చైనా పైనే ఆధారపడుతున్నాయి. కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్‌లో చైనా తనకున్న సామర్ధాన్ని సాయుధంగా వినియోగిస్తోంది.

అంతేకాదు ఈ అపురూప, కీలక ఖనిజాల ఎగుమతి లైసెన్సులను కూడా పరిమితం చేయవచ్చు. కీలకమైన లోహాలను సృష్టించే అవకాశం అమెరికాకు లేదు. కానీ అత్యంత అవసరమైన పరికరాలను సృష్టించవలసిన అగత్యం తప్పదు. పునరుత్పాదక సహజ ఇంధన ఉత్పత్తి, శక్తివంతమైన కంప్యూటర్ల తయారీపై ప్రపంచ దేశాలన్నీ ఆధారపడి ఉంటున్నందున అరుదైన లోహాల అవసరం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ల వైబ్రేషన్ యూనిట్లకు అరుదైన రసాయనిక మూలకాలు టెర్బియమ్, డిస్ప్రోజియం ఎంతో అవసరం. ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లకు శక్తి నియోడిమియమ్ అనే మూలకం వల్ల లభిస్తుంది. మందుగుండు సామగ్రికి, సెమీకండక్టర్ చిప్‌లకు, టంగ్‌స్టన్ అనే లోహంఉపయోగపడుతుంది. జెట్ ఇంజిన్లకు, డ్రిల్లింగ్ రిగ్‌లకు మిశ్రమ లోహాలు వినియోగిస్తారు.

దాదాపు ఈ అపురూప ఖనిజాల తవ్వకాలను, ప్రాసెస్‌ను చైనాయే నిర్వహిస్తోంది. ఈ మేరకు కావలసిన మౌలిక సౌకర్యాలను కొన్ని దశాబ్దాలుగా చైనా సమకూరుస్తోంది. ఫలితంగా టెస్లా, యాపిల్ వంటి అనేక కంపెనీలు తమకు కావలసిన అరుదైన మూలకాల కోసం చైనా పైనే ఆధారపడుతున్నాయి. అందుకనే భౌగోళిక రాజకీయ బేరసారాలు సాధనంగా తమ ఆధిపత్యాన్ని సాగించడానికి చైనా వెనుకాడడం లేదు. 2010లో జపాన్‌తో ఉద్రిక్తతలు తలెత్తడంతో కీలకమైన ఖనిజ మూలకాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. గత రెండేళ్లుగా గేలియమ్, గేర్మేనియమ్, గ్రాఫైట్ వంటి కీలకమైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ఈ పరిస్థితిని ఊహించే వైట్‌హౌస్ ఈ నెల తమ టారిఫ్‌ల పరిధి నుంచి కీలకమైన ఖనిజాలను మినహాయించడం గమనార్హం. కానీ అన్ని దేశాలకు ఏడు రకాల కీలక ఖనిజాల మూలకాల ఎగుమతులపై చైనా నియంత్రణను వైట్‌హౌస్ అడ్డుకోలేదు.

వాణిజ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే ఈ లోహాలను బేరసారాల సాధనంగా వినియోగించుకోవాలన్నది చైనా లక్షం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉపయోగించే మైక్రోచిప్స్ కూడా చైనా టార్గెట్ చేసే జాబితాలో ఉన్నాయి. రానున్నకాలంలో అరుదైన లోహాల మూలకాల ఎగుమతులు చైనా నుంచి తగ్గిపోవచ్చు. ఎగుమతుల నియంత్రణ విధానాలకు అనుగుణంగా కంపెనీలు చైనాకు దరఖాస్తులు పెట్టుకోవలసి వస్తుంది.ఈ ప్రభావం లాక్‌హీడ్ మార్టిన్ వంటి అమెరికా రక్షణ సంస్థలపై పడవచ్చు. ఈ కంపెనీలు క్షిపణుల తయారీకి, జెట్ విమానాలకు కీలక ఖనిజ మూలకాలు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో చైనా వంటి ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలని అమెరికాకు వాణిజ్య నిపుణులు సూచిస్తున్నారు. మరికొందరు ఈ ఖనిజాల కొరత తీరాలంటే చంద్రునిపై ఖనిజాల తవ్వకం చేపట్టడమే సరైన పరిష్కారమని సూచిస్తున్నారు.

కొన్ని వాణిజ్య సంస్థలు అమెరికాలో ఖనిజాల తవ్వకాన్ని, ప్రాసెసింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఇలాంటి మార్పులకు ట్రంప్ టారిఫ్‌లు రాయితీలు కల్పించే అవకాశం ఉంది. అలాగే సరఫరా చైన్లను విస్తరించుకోవాలని అమెరికా కంపెనీలపై ఒత్తిడి ప్రారంభమైంది. అయితే కీలకమైన ఖనిజాల సరఫరా విస్తరించడానికి పెట్టుబడుల సమస్యే ప్రధాన అడ్డంకి. ఇలాంటి ప్రయత్నాలను వేగవంతం చేయడానికి అమెరికాలో తగినంత మౌలిక సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ లేవు. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో మైనింగ్ ఇంజినీరింగ్ చేపట్టగల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు క్రమంగా తగ్గిపోతుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కొత్తగా గనుల తవ్వకాన్ని వేగవంతం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చినా ఇప్పట్లో అది సాధ్యం కాకపోవచ్చు. అమెరికా స్వయం సామర్థం సాధించి కీలకమైన ఖనిజాల తవ్వకాన్ని, ప్రాసెసింగ్ చేపట్టాలంటే మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News