Thursday, January 30, 2025

చైనా ప్రాజెక్టుతో బ్రహ్మప్రళయమే!

- Advertisement -
- Advertisement -

ఉత్తర హిమాలయాలలో కైలాస పర్వతపాదం వద్ద హిమానీనదంలో పుట్టి, టిబెట్‌లో యార్లంగ్ జంగ్బోగా, అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాం గ్‌గా పేరొందిన బ్రహ్మపుత్ర నది ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. పొరుగున ఉన్న చైనా ఈ నదిపై జలవిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించడమే ఇందుకు కారణం. బ్రహ్మపుత్రపై 137 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదని, దీనికి చైనా ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని జిన్హువా వార్తాసంస్థ నాలుగు రోజుల క్రితం ప్రచురించిన ఓ కథనం భారత్‌లో కలకలం రేకెత్తిస్తోంది. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే చోట ఒక విశాలమైన అగాధంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ఉపక్రమిస్తోంది. ఈ ప్రాంతం భారత సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండటం భారత ప్రభుత్వ కలవరపాటుకు కారణం. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం సాకారమైతే, చైనా- భారత సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై సర్వాధికారాలు చైనాకు అన్యాపదేశంగా సంక్రమిస్తాయనడంలో సందేహం లేదు. వేసవిలో ఈ నదీ జలాలను భారీస్థాయిలో మళ్లించుకునే అవకాశం పొరుగు దేశానికి దక్కడమే కాదు, వర్షాకాలంలో పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే, దిగువన మన దేశంలోని అనేక రాష్ట్రాలు ముంపునకు గురై, ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి దారితీస్తుంది. అసలే, మెరుపు వరదలకు బ్రహ్మపుత్ర పెట్టింది పేరు. సముద్రానికి ఆటుపోట్లు వచ్చినట్లుగానే, బ్రహ్మపుత్రకు అలలపోటు ఉంటుంది. వరదల సమయంలో ప్రళయభీకరంగా పారే బ్రహ్మపుత్రను ఆరితేరి చూడటం కూడా భీతిగొల్పుతుందంటే అతిశయోక్తి కాదు. అలాంటిది, చైనా ఒకేసారి దిగువకు నీరు వదిలితే ముంపు ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఊహించుకోవచ్చు. పైగా భూకంప జోన్‌లో ఉన్న టిబెట్ వద్ద ఈ భారీ ప్రాజెక్టును నిర్మించపూనుకోవడం చైనా దుందుడుకుతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అరుణాచల్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర, దాని ఉపనదులే ప్రాణాధారం. ఈ నదిపై ఆధారపడి కోట్లాది మంది జీవనం గడుపుతున్నారు. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో 40 శాతం జలవిద్యుత్తు, 30 శాతం నీటి అవసరాలకు బ్రహ్మపుత్రే ఆధారం. ఇప్పటికే చైనా నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్‌పై ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంగ్జీ నదిపై 181 మీటర్ల ఎత్తున 2.33 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ డ్యామ్ కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిపోయిందని, సూర్యుడినుంచి భూమి రెండు సెంటీమీటర్ల దూరం జరగడానికి కూడా ఈ ప్రాజెక్టే కారణమని వారు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఇదే అతి పెద్ద ప్రాజెక్టు కాగా, దీనిని మించిన స్థాయిలో నిర్మించనున్న బ్రహ్మపుత్ర ప్రాజెక్టు మరెన్ని అనర్థాలకు కారణమవుతుందో చెప్పలేం. ఇరుదేశాల మధ్య బ్రహ్మపుత్ర నదీ జలాలపై 2002లో తొలి ఒప్పందం కుదిరింది. ఈ నదిపై చేపట్టే ప్రాజెక్టులు, జల వినియోగంపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నది ఆ ఒప్పందం సారాంశం. కానీ కొంతకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడిన కారణంగా చైనా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇచ్చగించడం లేదు. పైగా చివరిసారి కుదిరిన ఒప్పందం కాలపరిమితి గత ఏడాది ముగిసిపోవడంతో ఇప్పుడు చైనా జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధపడుతోంది. గత కొంతకాలంగా చైనా- భారత్‌ల మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా మారాయి. నాలుగేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్ సరిహద్దుల వద్ద చైనా భారీ స్థాయిలో బలగాలను మోహరించడం, గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తడం వంటి సంఘటనలతో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే నిరంతర దౌత్య ప్రక్రియతో పాటు మోడీ, జీ జిన్‌పింగ్ ఇటీవల రష్యాలోని కజాన్ వేదికగా భేటీ అయిన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాయని భావిస్తున్న తరుణంలో చైనా జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చే ప్రమాదం గోచరిస్తోంది. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ, ఐదో ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. చైనాకు కంటగింపుగా మారింది. పైపెచ్చు, అమెరికా -భారత్‌ల మధ్య గత దశాబ్దకాలంగా బలపడిన మైత్రీబంధం కూడా చైనీయులకు కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. బ్రహ్మపుత్రపై తాను నిర్మించదలచిన ప్రాజెక్టు వల్ల భారత్, బంగ్లాదేశ్‌లకు ఎలాంటి ప్రమాదమూ ఉండదని చైనా నమ్మబలుకుతున్నా మేకవన్నె పులిలాంటి ఆ దేశం మాటలు విశ్వసించలేనివి. అంతర్జాతీయ మద్దతును కూడగట్టి, ఒత్తిడి పెంచడం ద్వారా చైనా నిర్మించ తలపెట్టిన బ్రహ్మపుత్ర ప్రాజెక్టును నిలువరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News