Monday, January 20, 2025

బలపడుతున్న చైనా శాంతి యత్నాలు

- Advertisement -
- Advertisement -

ఏడాది క్రితం ఉక్రెయిన్‌లో మాస్కో తన సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కోరిక మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 26 ఏప్రిల్ -2023న చాలా సేపు ఫోన్‌లో మాట్లాడారు. చైనా -ఉక్రెయిన్ సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభంపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. ఉక్రెయిన్‌తో సంబంధాలను పెంపొందించుకోవడానికి చైనా సంసిద్ధత స్థిరంగా, స్పష్టంగా ఉందని జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. శాంతిని పునరుద్ధరించడంలో, ఉక్రెయిన్ సంక్షోభాన్ని దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించాలని జెలెన్‌స్కీ అభ్యర్ధించారు. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిని బలంగా ప్రోత్సహించే చర్చ సుదీర్ఘంగా, అర్థవంతంగా ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
జిన్‌పింగ్, జెలెన్‌స్కీతో- ఉక్రెయిన్ సంక్షోభం రాజకీయ పరిష్కారం కోసం చర్చలు, సంప్రదింపులు మాత్రమే ఆచరణీయమైన మార్గమని అన్నారు. చైనా రగులుతున్న మంటలను చోద్యంగా చూస్తూ కూర్చోదని, అలాగే ఆ మంటలకు ఆజ్యం పోయదని, ఆ విషమ స్థితిని అవకాశంగా వినియోగించుకుని తాను లాభాలు ఆర్జించుకోదని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఈ వివాదం ఇంకా పెద్ద ఘర్షణగా మారే అవకాశం ఉన్నందున అన్ని పక్షాలు ప్రశాంతంగా, సంయమనంతో ఉండాలని చైనా అధ్యక్షుడు కోరారు. అణు యుద్ధంలో ఎవరూ గెలవరని ఆయన హితవు చెప్పారు. ఈ సంభాషణ సుదీర్ఘంగా, అర్థవంతంగా ఉందని జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. చైనాకు తమ రాయబారి నియామకంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఈ సంభాషణ బలమైన ప్రేరణను ఇస్తుందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం,

యురేషియన్ వ్యవహారాలపై చైనా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని ఉక్రెయిన్, ఇతర దేశాలకు పంపి వివాద పరిష్కారానికి సంబంధించి లోతైన చర్చ నిర్వహిస్తామని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. ఇదంతా ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. మొదటిది ఉక్రెయిన్ సంక్షోభ తీవ్రత కారణంగా ‘చైనా- ఉక్రెయిన్ సంబంధాలను అభివృద్ధి చేయడానికి చైనా సుముఖంగా వున్నది. ‘రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారం’లో మార్పు లేదు. రెండవది, ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతి నెలకొల్పడానికి చర్చలను ప్రోత్సహించాలనే చైనా ప్రధాన వైఖరి మారలేదు. చైనా ఈ సమస్య పట్ల దార్శనికతతో, ఆచరణాత్మక వైఖరిని తీసుకుంటున్నది. దాన్ని బలంగా, స్థిరంగా కొనసాగిస్తున్నది, కనుక అది ప్రపంచంలో మరింత స్పష్టంగా, బిగ్గరగా ప్రతిధ్వనిస్తున్నది. వీలైనంత త్వరగా కాల్పుల విరమణకు, శాంతి పునరుద్ధరణకు దోహదపడేలా చైనా చేస్తున్న తాజా ప్రయత్నమిది.
ఈ ఫిబ్రవరిలో మాస్కో, కీవ్ మధ్య శాంతి కోసం బీజింగ్ 12 పాయింట్ల రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించింది. శత్రుత్వాలకు ముగింపు పలకడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అనేక పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా, చైనా తన వ్యూహాత్మక భాగస్వామి అయిన రష్యాపై ఆంక్షలు విధించడానికి నిరాకరించింది. రష్యాను ఉక్రెయిన్‌పై దాడి చేసిందని ఖండించ లేదు కూడా.
గత నెలలో మాస్కో వెళ్లిన జిన్‌పింగ్ అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇతర రంగా ల్లో సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని ఇరు నేతలు ప్రకటించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ‘ప్రపంచ చిత్రపటంలోనూ, మానవాళి భవిష్యత్తులోనూ కీలకమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని జిన్‌పింగ్ అన్నారు.
ఉక్రెయిన్, ఇతర దేశాలకు దౌత్యవేత్త లీ హుయ్‌ను ప్రత్యేక ప్రతినిధిగా చైనా నియమించింది. ఉక్రెయిన్ సంక్షోభం రాజకీయ పరిష్కారంపై అన్ని పార్టీలతో లోతైన కమ్యూనికేషన్ నిర్వహించే బాధ్యతను రాయబారికి అప్పగిస్తామని జిన్‌పింగ్ చెప్పారు. చైనా లో తమ దేశ కొత్త రాయబారిగా మాజీ వ్యూహాత్మక పరిశ్రమల మంత్రి పావెల్ రియాబ్కిన్ను జెలెన్‌స్కీ నియమించారు.
జిన్‌పింగ్ -జెలెన్‌స్కీ పిలుపుపై మాస్కో స్పందన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన ఫోన్ కాల్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఉక్రెయిన్ అవాస్తవిక డిమాండ్లు శాంతి చర్చలకు అడ్డంకిగా నిలుస్తున్నాయని అన్నారు. అర్థవంతమైన చర్చలను పునఃప్రారంభించడానికి బీజింగ్ చేస్తున్న ప్రయత్నాలను జఖరోవా ప్రశంసించారు. ఉక్రెనియన్ సంక్షోభంలో కీవ్ ప్రభుత్వం ఇంతవరకు సహేతుకమైన చొరవను స్వీకరించలేదు. చర్చలు జరిపేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని అవాస్తవిక డిమాండ్లతో, అల్టిమేటమ్‌లతో ముడిపెడుతోంది అని వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా, రష్యా ఇటీవల విలీనమైన భూభాగాలను సరెండర్ చేసిన తర్వాతే చర్చలు పునఃప్రారంభమవుతాయని కీవ్ పదేపదే చెబుతోంది.ఇలాంటి డిమాండ్లు ఆమోదయోగ్యం కాదని మాస్కో పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరపడం అసాధ్యమని ప్రకటించే డిక్రీపై జెలెన్‌స్కీ అక్టోబర్‌లో సంతకం చేశారు.
నాటో కూటమిలో ఏమి జరుగుతోంది
ఉక్రెయిన్ విషయంలో నాటో కూటమి ఏకాభిప్రాయంతో లేదు. అమెరికా వ్యూహాలను, ఎత్తుగడలను అన్ని దేశాలు ముక్తకంఠం తో ఒప్పుకోవటం లేదు. ముఖ్యంగా ఫ్రాన్స్ తన స్వంత విధానం లో సాగుతోంది. చైనా మధ్యవర్తిత్వంతో రష్యా- ఉక్రెయిన్ వివాదంపై దౌత్యపరమైన చర్చలు ప్రారంభించడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ ప్రయత్నిస్తున్నారు. చైనా సహాయంతో ఈ వేసవి నాటికి రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలను పునరుద్ధరించాలని ఫ్రాన్స్ చూస్తోందని గత వారం బ్లూమ్‌బెర్గ్ అజ్ఞాత వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి రోడ్ మ్యాప్‌ను రూపొందించడంపై విదేశీ సంబంధాల ఇన్ చార్జి చైనా ఉన్నతాధికారి వాంగ్యీతో నేరుగా కలిసి పని చేయాలని మాక్రాన్ తన విదేశాంగ విధాన సలహాదారును కోరినట్లు పేర్కొన్నారు. మాక్రాన్ ఇలా ఏకపక్షంగా ప్రయత్నించడంపై వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై అమెరికా ప్రభుత్వ ఆలోచనా విధానం తెలిసిన వ్యక్తుల ప్రకారం, ఫ్రెంచ్ నాయకుడు ఇటీవల తీసుకున్న చర్యకు వాషింగ్టన్ సుముఖంగా లేదు’ అని ఒక ఏజెన్సీ ఆదివారం నివేదించింది. మిత్ర దేశాలతో సంప్రదింపులు జరపకుండా సున్నితమైన దౌత్యపరమైన అంశంపై మాక్రాన్ స్వేచ్ఛగా, ఏకపక్షంగా మాట్లాడటంపై వైట్‌హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్‌లో శాంతి చర్చలు అవసరమని బీజింగ్ నెలల తరబడి చెబుతూనే, ఏ పరిష్కారమైనా అన్ని పక్షాల ప్రయోజనాలను గౌరవించాలని నొక్కి చెబుతోంది. నాటో తూర్పు విస్తరణ సహా అమెరికా, దాని మిత్రదేశాల చర్యలే ఈ ఘర్షణకు కారణమని చైనా అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. అయినప్పటికీ, మాక్రాన్ చైనాపై వాషింగ్టన్ దూకుడు వైఖరి నుండి పారిస్‌ను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు, బీజింగ్ పర్యటన తరువాత ‘యురోపియన్లు ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించలేరు’ కాబట్టి ఐరోపా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం చూడాలని ఆయన పట్టుబట్టారు. జర్మనీ, పోలాండ్లు ఉక్రెయిన్‌ను, తైవాన్‌ను అనుచితంగా పోలుస్తూ కలగలిపి వ్యవహరిస్తున్నారు.

చైనాని అనవసరంగా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. చైనాలో పర్యటించిన జర్మన్ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్బాక్ కూడా తైవాన్ విషయంలో అమెరికా వైఖరిని పూర్తిగా సమర్థించారు. యూరప్‌లో తాము వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం ప్రయత్నిస్తే కూటమిని బీజింగ్‌పై ఆధారపడేలా చేస్తుందని పోలిష్ మంత్రి మాటియస్జ్ మొరావికీ అన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపరచడానికి, ఉక్రెయిన్‌లో శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి మాక్రాన్ చేసిన ప్రయత్నాలు సమయానుకూలం కాదని అవి కూటమి ఐక్యతను దెబ్బతీస్తాయని ఇతర ఇయు దేశాలు విమర్శించాయి. ఉక్రెయిన్‌పై శాంతి చర్చలను ప్రారంభించడానికి బీజింగ్ మద్దతు ఇస్తుందని, చర్చలు ఐరోపా ‘ప్రాథమిక దీర్ఘకాలిక ప్రయోజనాల’ ఆధారంగా ఉండాలి ‘అన్ని పక్షాల న్యాయబద్ధమైన ఆందోళనలను ‘పరిగణనలోకి తీసుకోవాలి’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్వెన్బిన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News