జీవాధారాలైన భూజలవాయువులు కలుషితమయ్యాయి. ప్రపంచమే పెద్ద చెత్త బుట్టయింది. సమాజం వ్యర్థాల ఊబిలో కూరుకు పోయింది. వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్య. సమ్మిళిత ప్రగతిలో చైనా ప్రపంచంలో ముందుంది. వ్యర్థాల ఉత్పత్తిలోనూ మొదటే. 142.54 కోట్ల జనాభాతో వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగానికి పోరాడుతోంది. అందులోనూ మొదటి స్థానంలో నిలిచింది.
అల్జజీరా సాప్తాహిక టెలివిజన్ కార్యక్రమం ‘101 ఈస్ట్’ లో 9 ఏళ్ళ క్రితం చైనా వ్యర్థాల సమస్య, నిర్వహణ వెలుగు చూశాయి. చెత్త చెదారాల నిర్వహణను చైనా ఆధునీకరించింది. ఊటలూరే విశాల పల్లపు ప్రాంతాలతో, అపాయకర పెరళ్ళతో, వ్యర్థాల పునర్వినియోగ కేంద్రాలతో నిర్వహణ ప్రణాళికలు రచించింది. పారిశుద్ధ శ్రామికులకు ప్రత్యామ్నాయ ఉపాధులు కల్పించింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించుకుంది. పారిశుద్ధ కార్మికులు గుంపులుగా గుమిగూడి రోజూ దేశ రాజధాని బీజింగ్ నగర వీధులను శుభ్రపరుస్తారు. 2.2 కోట్ల నగరవాసుల వ్యర్థాలను సేకరిస్తారు. వాంగ్ జిండాంగ్ లాంటి చెత్తను సేకరించే వారికి ఉపాధి, కుటుంబానికి జీవనాధారం లభిస్తున్నాయి.
వాంగ్, భార్య, 11 ఏళ్ళ మేనల్లుడు మెంగ్నాన్‌తో పాటు నివసించేవారు. ఆ పిల్లాడి పోషణకు, చదువుకు ఎన్ని కష్టాలైనా భరిస్తాడు వాంగ్. తాను సేకరించే పాత సీసాలకు వచ్చే డబ్బు వాంగ్ కుటుంబ పోషణకు, మెంగ్నాన్ చదువుకు సరిపోతుంది. అయితే దేశం ప్రకటించిన ‘వ్యర్థాల యుద్ధం’ చెత్తచెదారాలు ఏరుకొని బతికేవారి ఉపాధిని మార్చేసింది. ఈ పారిశుద్ధ సైన్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యామ్నాయ పనులు కల్పించబడ్డాయి.తమ వ్యర్థాలను పునర్వినియోగానికి వీలుగా వేరుచేసి ఉంచమని చైనా వినియోగదారులను ఆదేశించారు. ఒకసారి వాడి పారేసే ప్యాకేజీల పరిమితికి పలు ప్రతిపాదనలు చేశారు. నగరాలలో సామూహిక వ్యర్థాలను కాల్చివేస్తారు. 2020కు గృహ వ్యర్థాలను కూడా కాల్చివేసే ప్రణాళికను ప్రభుత్వం పూర్తి చేసింది. 2017 మార్చిలో 46 నగరాలలో చెత్త వేర్పాటును తప్పనిసరి చేసింది. ప్రజా వ్యవస్థలు, వ్యాపార సంస్థలు వ్యర్థాలను అపాయకరమైన, వంట వ్యర్థాలు, పునర్వినియోగ పదార్థాలుగా వేరుచేయాలి. 2017 నవంబర్‌కు 12 నగరాలు ఆ మేరకు నిబంధనలు సవరించి చట్టాలు చేశాయి.
24 నగరాలు ఈ కార్యక్రమాల నిర్వహణకు పలు ప్రణాళికలు రచించాయి అని గృహ నిర్మాణ, పట్టణ, గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రి వాంగ్ మెంఘుయి అన్నారు. నేటి మంత్రిని హోంగ్ ఆ ప్రణాళికలను కొనసాగిస్తున్నారు. టాంగ్ఝౌ జిల్లా ప్రజా సంస్థల్లో, 2,500 రెస్టారెంట్లలో వ్యర్థాల వేర్పాటు పనులు ప్రవేశపెట్టారు. ఈ ప్రదేశాలలో వేరు చేసిన ఆహార పదార్థాల వ్యర్థాలను ప్రత్యేకంగా నిర్మించిన వాహనాలలో పారిశుద్ధ్య కంపెనీలు తీసుకుపోతాయి. ఆహార వ్యర్థాల్లో ఇతర వస్తువులను కలిపితే నిర్వాహకులు జరిమానా విధిస్తారు. శిక్షిస్తారు. నివాస సమూహాలు కూడా ఈ పద్ధతులను పాటించేటట్లు ప్రోత్సహించారు. నివాస ప్రదేశాలలో ఈ ప్రక్రియలు అమలు చేసినందుకు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. 2017 అక్టోబర్‌కు షాంఘైలో 40 లక్షల నివాస సముదాయాలు ప్రోత్సాహకాలు పొందాయి. ఆ డబ్బులతో నిత్యావసారాలు సమకూర్చుకున్నాయి. షాంక్జి రాష్ట్రం తైయువాన్ నగరంలో మేధోపర వస్తు వ్యర్థాల నిర్వహణ డబ్బాలను స్థాపించారు. ప్లాస్టిక్ సీసాలు, కాగితం వస్తువులకు వేరు వేరు బార్ కోడ్‌లు అతికించి వ్యర్థాల్ డబ్బాలలో పడేస్తారు. ‘చెత్త పోగు చేసే వారు అధిక సంఖ్యలో ఉన్నారు.
వారికి చదువు, నైపుణ్యతలు లేవు’ అని మహిళా వ్యాపారి లియు జుయెసాంగ్ అన్నారు. ఈమె బీజింగ్ చుట్టూ 5,000 వ్యర్థాల సేకరణ యంత్రాలను స్థాపించారు. వినియోగదారులు ఈ కేంద్రాల్లో సీసాలు జమ చేసి, నగదు వసూలు చేసుకుంటారు. దీనితో మధ్య దళారీలు తొలగించబడ్డారు.చైనా విదేశాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను అధిక మోతాదులో దిగుమతి చేసుకునేది. వాటిని పునర్వినియోగాలుగా మార్చేది. ప్లాస్టిక్, కాగితాలు, వస్త్రాల ముడి పదార్థాలు, రసాయనాలు మొదలగు 24 రకాల విదేశీ వ్యర్థాల దిగుమతిని చైనా 2017లో నిషేధించింది. 2018 జనవరిలో ప్లాస్టిక్ దిగుమతులు, పునర్వినియోగ ప్రక్రియలపై పరిమితులు విధించింది. పూర్తి నిషేధానికి పథకాలు వేసింది. ఫలితంగా నెదర్లాండ్స్ లాంటి దేశాలు వ్యర్థాల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పరిపాలన, ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణ, నాణ్యతా పర్యవేక్షణ మంత్రిత్వ శాఖలు దిగుమతుల క్రమబద్ధీకరణ, అక్రమ రవాణాల నిరోధంలో కలిసి పని చేస్తాయి.
వ్యర్థాల మార్పు సౌకర్యాలను, నిర్వహణ పద్ధతులను చైనా మెరుగుపరిచింది. వ్యర్థాలను నిరపాయకర వనరులుగా మార్చుతోంది. మధ్య చైనా రాష్ట్రం హునాన్‌లో వంట వ్యర్థాలను క్రమబద్ధీకరిస్తారు. ముందు చితక్కొడతారు. తర్వాత జల్లెడ పడతారు. యంత్రాలతో నొక్కుతారు. వ్యర్థాల నుండి నూనె, నీళ్ళను, అవశేషాలను వెలికితీస్తారు. ఆధునిక పద్ధతులతో వ్యర్థ పదార్థాల నూనెను మిశ్రమ పారిశ్రామిక చమురుగా, బయో డీజల్‌గా మార్చుతారు. వ్యర్థ జలాలను గాలి లేకుండా మురిగించి సామాన్య వ్యర్థాల స్థాయికి చేర్చుతారు. శుద్ధి చేసి సహజ వాయువులుగా మార్చుతారు. ఈ మురుగు వాయువులు విద్యుదుత్పత్తికి ఉపయోగపడతాయి. వ్యర్థాల అవశేషాలను పెంపుడు కీటకాల ఆహారంగా, పశువుల మేతగా వాడతారు. అనగా వంటగది వ్యర్థాలు అపాయ రహితంగా ఉపయోగపడుతున్నాయి. మధ్య చైనా రాష్ట్రం హుబీలోని సోంగ్జి సిమెంట్ బట్టీలో గృహ వ్యర్థాలను ఉపయోగించే ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో వ్యర్థాలను మండే పదార్థాలు, మండని పదార్థాలు, లోహాలుగా విడగొడతారు. మండే పదార్థాలను సిమెంట్ తయారీలో ఇంధనాలుగా వాడతారు. మండని పదార్థాలను సిమెంటు ముడి పదార్థాలుగా వాడతారు. లోహాలు పునర్వినియోగించబడతాయి.
చైనా పట్టణాలు, నగరాలలో ఎలెక్ట్రానిక్ వ్యర్థాలు ఎక్కువ. పారిశ్రామిక, ఘనరూప వ్యర్థాలను పునర్వినియోగ పదార్థాలుగా మార్చుతారు. గ్రామీణ ప్రజలను వ్యర్థాల నిర్వహణలో చైతన్యపరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల జల కాలుష్యాన్ని సమర్థవంతంగా నిర్మూలిస్తున్నారు. కొన్ని వ్యర్థాలను ఎరువుగా ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మానవ మలాన్ని ఎరువుగా, మూత్రాన్ని ఎరువుగాను, మందుల్లోను వాడతారు. పర్యావరణ, ఆరోగ్య సమస్యలను అధిగమించి, ఆర్థిక, సామాజిక ప్రగతి సాధించాము. 2019 నాటికే వ్యర్థాలన్నిటినీ వనరులుగా మార్చే పథకాలు రూపొందించామని చైనా పర్యావరణ, పరిరక్షణ అధికారి గుయో జింగ్ పేర్కొన్నారు.