Monday, January 27, 2025

చైనా బ్లాక్‌మెయిల్!

- Advertisement -
- Advertisement -

covid 19 second wave in india చైనా తన విస్తరణ కాంక్షను వదులుకోదు, కాకపోతే విరామమిస్తుంది ఆగి ఆగి రగిలే నిప్పులా, నివురు నింపుకొంటూ విడుస్తూ ప్రతాపం చూపించాలనుకొంటుంది. 1962 యుద్ధం తర్వాత దాదాపు 60 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న భారత, -చైనా సరిహద్దులను తిరిగి 2020లో రక్తసిక్తం చేసింది. 2020 మే లో లడఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ ఉల్లంఘనకు పాల్పడిన చైనా మళ్ళీ ఇప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు పేర్లు ప్రకటించి అవి తన భూభాగాలని చెబుతోంది. లడఖ్ వద్ద యధాపూర్వ స్థితిని నెలకొల్పుకొనే చర్చల్లో ప్రతిష్టంభన సృష్టించి తమాషాలు చేస్తున్న చైనా రూటు మార్చి అరుణాచల్ వద్ద కొత్త ఘర్షణ రంగాన్ని తెరవాలనుకొంటున్నదా? అరుణాచల్‌ప్రదేశ్‌లో 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తనదిగా చెప్పుకొంటున్నది. చైనా భాషలో జంగ్నన అని దీనిని పిలుస్తున్నది.

దక్షిణ టిబెట్ అంటున్నది. చైనా తన మ్యాపుల్లో కూడా అరుణాచల్‌ప్రదేశ్‌ను సొంత ప్రాంతంగా చూపిస్తుంది. మన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పెద్దలు అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించేటప్పుడు అభ్యంతరం చెప్పడం మామూలే. అయితే అరుణాచల్ లోని కొన్ని ప్రాంతాలను ప్రత్యేకించి ప్రస్తావించి అవి తనవని ప్రకటించడం అరుదు. గతంలో 2017 ఏప్రిల్‌లో కూడా ఇలాగే చేసింది. అప్పుడు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలను ఎంపిక చేసి అవి తనవని చెప్పింది. వాటికి పేర్ల్ల ప్రామాణీకరణగా దానికి పేరు పెట్టింది, అది ఆరంభమే కాని అంతం కాదని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు అదే పని చేసింది. చైనాకు మనకు మధ్య 3488 కిలోమీటర్ల నిడివి సరిహద్దు వుంది. దీని పై రెండు దేశాల మధ్య సమ్మతి, ఏకీభావం లేకపోడం వల్ల దానిని వాస్తవాధీన రేఖగా పరిగణిస్తున్నారు. సరిహద్దు సమస్య పరిష్కారానికి చొరవ చూపకుండా తరచూ పేచీలకు దిగడం అలవాటు చేసుకొన్న చైనా క్రమంగా అమెరికాతో పోటీపడే ఆర్ధిక శక్తిగా పుంజుకోడంతో మనను గిల్లి ఆనందిస్తున్నది. మనకు సర్వశక్తులున్నప్పటికీ ప్రత్యక్ష యుద్ధ రోజులు దాదాపు ముగిసిపోయాయి.

గత యుద్ధ పరాజయ నేపథ్యమూ మనని వెనక్కి లాగుతూ ఉండవచ్చు. అదేమైనప్పటికీ చైనాను పరోక్షంగా విమర్శించడమే తప్ప ప్రత్యక్షంగా దానిని పల్లెత్తు మాట అన్న పాపాన ఇండియా ఎప్పుడూ పోలేదు. 2020 లో గల్వాన్ లోయలో మన మీద విరుచుకుపడిన తర్వాత చైనా మన భూభాగాలను ఆక్రమించుకొన్న సంగతిని అంగీకరించడానికి సైతం మన పాలకులకు మనస్కరించడం లేదు. ఆ విషయాన్ని ఒప్పుకొంటే దేశ ప్రజల ముందు పరువు పోతుందనే భయమే బిజెపి పెద్దలను పీడిస్తున్నట్టున్నది. చైనా ఫలానా భూభాగాలు తనవని బాహాటంగా చెబుతుంటే, అది ఆక్రమించుకొన్న వాటిని మనవిగా ప్రకటించుకోలేకపోతున్నాము. 2020 ఘర్షణల్లో అసలు మన భూమి ఆక్రమణే జరగలేదని, మన భూభాగం వొక్క అంగుళమూ అన్యాక్రాంతం కాలేదని మనం పార్లమెంటు ముఖంగా ప్రకటించుకొన్నాము. ఆ తర్వా త పరిశోధనాత్మక వార్తా కథనాల్లో వెళ్లడైన వాస్తవాలన్నీ చైనా మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన వాస్తవాన్నే చాటాయి.

పాకిస్థాన్ దగ్గరికి వచ్చే సరికి సర్జికల్ స్ట్రైక్‌ల గురించి గొప్పలు చెప్పుకొనే ఇండియా చైనా విషయంలో తోక ముడుస్తున్న సంగతిని ప్రపంచం గుర్తించడం లేదనుకోడం ఆత్మవంచనే. చైనా తన అంతర్జాతీయ ఆధిపత్య కాంక్ష నెరవేర్చుకొనే వ్యూహంలో భాగంగా స్థానికంగా తన చుట్టుపక్కల దేశాలను వెనుక నడిపించుకొనే తంత్రాన్ని పాటిస్తున్నది. ఇందుకు ఇండియా ఒక్కటే కలిసి రావడం లేదన్నది దానికి కంటగింపుగా వుంది. పైపెచ్చు తనకు గిట్టని రీతిలో తన ప్రధాన శత్రువు అమెరికాతో ఇండియా చెట్టపట్టాలు వేసుకోడం దానికి బొత్తిగా రుచించడం లేదు. దక్షిణ చైనా సముద్రంలో తన ప్రాబల్యాన్నిఎదిరించే శక్తులతో ఇండియా సఖ్యంగా ఉండడం దానికి పుండు మీద కారంగా వుంది. ఆర్ధిక రంగంలో చైనా నుంచి విశేషంగా దిగుమతులు చేసుకొంటున్న మనం దానితో యే విధంగానూ సరితూగే స్థితిలో లేము.

దేశాల మధ్య వివాదాలు తలెత్తేటప్పుడు న్యాయం యెటు వైపు వుందో తేల్చి ఎక్కడుండాల్సినవారిని అక్కడ ఉంచే బలమైన అంతర్జాతీయ వ్యవస్థ లేదు. అమెరికాయే ఐరాసాను కాదని మిత్ర బలగాలతో కలిసి లేనిపోని నెపాలతో ఇరాక్‌ను పచ్చడి చేసిన ఉదంతం కళ్ళ ముందున్నది. అలీన సంప్రదాయాన్ని వదిలిపెట్టి పూర్తిగా అమెరికా వొడిలో పరవశించే విధానాన్ని స్వీకరించిన ప్రధాని మోడీ ప్రభుత్వం గతంలో అవసరానికి మన వైపు దృఢంగా సోవియెట్ నిలబడిన విధంగా అమెరికా ఉంటుందని చెప్పలేని స్థితిలో వుంది. ఈ నేపథ్యంలో చైనా విషయంలో సకల వాస్తవాలనూ దేశ ప్రజల ముందుంచవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వంపై వుంది. దేశ ప్రజల వద్ద చైనాను చావకొట్టామనే రీతిలో ప్రగల్భాలు పలుకుతూ వాస్తవంలో దానిని ఏమీ చేయలేకపోతూ, దాని బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోవలసిరాడం బాధాకరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News