Tuesday, November 5, 2024

చైనా యుద్ధ కాంక్ష

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఒక దాని వెంట ఒకటిగా, కన్నుమూసి తెరిచేలోగా అనే మాదిరిగా జరిగిన రెండు సన్నివేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం చైనాలో పెరుగుతున్న ఆరాటాన్ని స్పష్టంగా రుజువు చేశాయి. కొంత కాలంగా ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలరాదన్న రీతిలో ఎడమొగం పెడమొగమైన రెండు బలమైన పశ్చిమాసియా దేశాలు ఇరాన్, సౌదీ అరేబియా మధ్య మైత్రీ పునరుద్ధరణ ఒప్పందాన్ని గత శుక్రవారం నాడు చైనా కుదర్చడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అది జరిగిన వెంటనే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నిన్న సోమవారం నాడు జాతీయ పార్లమెంటు సమావేశాల ముగింపు రోజున ప్రసంగిస్తూ ప్రపంచ వ్యవహారాలలో చైనా చురుకైన పాత్ర పోషించదలచిందని, సైన్యాన్ని మహా ఉక్కు గోడ (గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్) గా రూపొందించదలచిందని ప్రకటించారు. ఈ రెండు సందర్భాలకి గల విడదీయరాని సంబంధం స్పష్టంగా కనిపిస్తూనే వుంది.

జిన్‌పింగ్ తన దేశ సైన్యాన్ని గ్రేట్ వాల్‌తో పోల్చడమంటే శత్రుదుర్భేద్యంగా, ఎవరూ చొరరానిదిగా తయారు చేయడమే. చైనాకు రక్షణ కవచంగా వుండేందుకు 20 వేల కి.మీ నిడివిన శతాబ్దాల తరబడి ఆ దేశ చక్రవర్తులు నిర్మింపజేసిన గోడ గ్రేట్ వాల్‌గా ప్రసిద్ధి చెందింది. ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందాన్ని చైనా కుదర్చడానికి విశేష ప్రాధాన్యమున్నది. మధ్య ప్రాచ్యంలో అమెరికా ఉనికికి ఇది చరమ గీతం పాడుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా ఇంధన అవసరాల కోసం మధ్య ప్రాచ్య దేశాల మీద ఆధారపడకుండా తన కాళ్ళమీద తాను నిలబడే ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత ఇరాక్ నుంచి తన సైన్యాలను పూర్తిగా ఉపసంహరించుకొన్న అనంతరం ఆ ప్రాంతంలో దాని పెత్తనం తగ్గుముఖం పట్టింది. ఈ ఖాళీని చైనా పూరిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.

అటు ఇరాన్ ఎలాగూ అమెరికా ఆంక్షల కింద నలిగిపోతూ దానికి బాగా దూరం జరిగే వుంది. సౌదీ అరేబియా కూడా ఇటీవల అమెరికా ఒక్క దానితోనే కలిసి వుండే స్థితి నుంచి అందరికీ సమాన దూరంలో వుండే వైపు జరుగుతున్నది. ఇరాన్ అణు బాంబును తయారు చేయగల స్థాయి యురేనియంను సిద్ధం చేసుకొంటున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాని మీద దాడి చేయగలనని బెదిరించింది. సౌదీ అరేబియా ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకోడం ఇజ్రాయెల్ ను బలహీనపరుస్తుందని ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. అమెరికాతో నిమిత్తం లేకుండా సౌదీ అరేబియా ఈ ఒప్పందంలో చేరడం విశేషమే. తన భద్రత విషయంలో కేవలం అమెరికా మీద ఆధారపడరాదని అది కోరుకొంటున్నట్టు రుజువవుతున్నది. ఇరాన్ సౌదీల మధ్య 2016 నుంచి సంబంధాలు తెగిపోయాయి. చైనా కుదిర్చిన ఇరాన్ సౌదీ స్నేహ ఒప్పందాన్ని ఇతర గల్ఫ్ దేశాలైన యుఎఇ, ఒమన్, కతార్, బహ్రైన్, కువైట్‌లు, ఇరాక్, ఈజిప్టు, టర్కీలు కూడా సమర్థించడం గమనించవలసిన విషయం.

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లకు ఇరాన్ మద్దతు ఇస్తున్నదనే అభిప్రాయం వున్నది. వీరు సౌదీకి కంటగింపుగా తయారయ్యారు. పర్యవసానంగా యెమెన్‌లో మారణ హోమం సాగుతున్నది. సౌదీ, ఇరాన్ ఒప్పందం దానికి చరమగీతం పాడుతుంది. చైనా ఇలా నెమ్మది నెమ్మదిగా ప్రపంచ వ్యవహారాల్లో మరింత బలమైన పాత్రను పోషించదలచిందని స్పష్టపడుతున్నది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ చైనాకు బాగా చేరువైంది. ఇరాన్ తన విదేశీ వాణిజ్యంలో 30% వరకు చైనాపైనే ఆధారపడుతున్నది. వచ్చే 25 ఏళ్ళలో ఇరాన్‌లో 400 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాలని చైనా నిర్ణయించుకొన్నది. ఆంక్షల వల్ల విదేశాల్లో తన చమురును అమ్ముకొనే అవకాశాలు పరిమితం కావడం ఇరాన్‌కు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. దీనితో అతి తక్కువ ధరకు చైనాకు ఆయిల్‌ను విక్రయిస్తున్నది. చైనా అభివృద్ధి ప్రపంచానికి మేలు చేస్తుందని, అలాగే మిగతా ప్రపంచంతో నిమిత్తం లేకుండా చైనా ఒంటరిగా అభివృద్ధి చెందజాలదని జీ జిన్‌పింగ్ చేసిన ప్రకటన ద్వారా తాము చేతులు ముడుచుకొని కూర్చొనే పనే లేదని ఆయన స్పష్టం చేసినట్లు అయింది.

దక్షిణ చైనా సముద్రంలో ఎదురులేని ఆధిపత్యం కోసం చైనా ఎంత దూరమైనా వెళ్ళేలా బోధపడుతున్నది. అలాగే తైవాన్‌ను విలీనం చేసుకోవాలన్న చిరకాల కాంక్షను నెరవేర్చుకోదలచినట్టు స్పష్టపడుతున్నది. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేయడానికి అమెరికా ‘క్వాడ్’ (చతుర్ముఖ భద్రత ఒప్పందం) ను ఏర్పాటు చేసింది. ఇందులో తనతో పాటు ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌లను చేర్చింది. దక్షిణ చైనా సముద్రంతోపాటు సాగర మార్గాల్లో నియమబద్ధమైన వ్యవస్థ నెలకొనేలా చూడడమే క్వాడ్ ఉద్దేశమని ప్రకటించుకొన్నారు. అంటే చైనాను నిలవరించడమే దీని లక్షమని బోధపడుతున్నది. ఈ ఒప్పందంలో మనం కొనసాగే కొద్దీ చైనాకు మనకు మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతుంది. గ్రేట్ వాల్ లాంటి ఉక్కు సైన్యాన్ని నిర్మించదలచానని జీ జిన్‌పింగ్ చేసిన శపథం ఈ నేపథ్యంలో ఇండియాకు కూడా ఒక సవాలే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News