Wednesday, January 22, 2025

చైనా మాజీ దిగ్గజం లీ ఆకస్మిక మరణం

- Advertisement -
- Advertisement -

హాంగ్‌కాంగ్: చైనాలో మాజీ నేతల గల్లంతు, ఆకస్మిక మరణాలు దిగ్భ్రాంతికి దారితీస్తున్నాయి. చైనా మాజీ ప్రధాని లీ కెక్వియాంగ్ ఆకస్మింగా మరణించారు. 68 సంవత్సరాల లీ ఇంతకు ముందు దేశంలో రెండవ స్థానం నేతగా నిలిచారు. లీ కెక్వియాంగ్ ఆకస్మిక మరణంపై దేశవ్యాప్తంగా అత్యధికులు విచారం వ్యక్తం చేశారు. దేశంలో కీలక పాత్ర వహించిన ఈ నేత, మార్కెట్ కేంద్రీకృత సంస్కరణల దిశలో ముందుకు సాగారని, ఆశాజనక ఫలితాలు సాధించారని ప్రజలు కొనియాడారు. అయితే ఈ మాజీ నెంబరు 2 ఇటీవలి కాలంలో రాజకీయంగా వెనకకు నెట్టారు. ప్రస్తుతం షాంఘైలో విశ్రాంతి తీసుకుంటున్న లీ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు.

2013 నుంచి 2023 వరకూ ఆయన దేశ ప్రధానిగా ఓ దశాబ్ధం పాటు అత్యున్నత స్థాయి నేతగా నిలిచారు. చైనాకు ఆర్థిక మార్గదర్శిగా నిలిచారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాను పలు ఆర్థిక సవాళ్ల నుంచి గట్టెక్కించిన వ్యక్తిగా నిలిచారు. కోవిడ్ 19 ఆ తరువాతి ఆంక్షలు, మరో వైపు అమెరికాతో ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షల నుంచి దేశానికి సరైన మార్గనిర్ధేశనం చేసి, తిరిగి చైనాను పట్టాలపైకి తీసుకువచ్చినట్లు ప్రశంసలు పొందారు. అయితే దేశాధ్యక్షులు, తిరుగులేని నేతగా జిన్‌పింగ్ పట్టు సాధిస్తూ వచ్చిన దశలో కెక్వియాంగ్ ప్రాబల్యం సన్నగిల్లుతూ వచ్చింది.

చైనా సామాజిక మాధ్యమం వియిబోలో ఈ నేత మరణం వార్త వెలువరించగా కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే వందకోట్లకు పైగా వ్యూస్ క్లిక్‌లు వెలువడ్డాయి. సామాజిక మాధ్యమంలో అత్యధిక సంఖ్యలో ఈ నేత మరణంపై సంతాప వ్యక్తీకరణ జరిగింది. ఇక అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ లీ మృతి పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. చైనాలోని జపాన్ ఎంబసీ కూడా విచారం వ్యక్తం చేసింది. లీ ఓ దశలో చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షులుగా అవుతారని ప్రచారం జరిగింది. అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ స్థానంలోకి జిన్‌పింగ్ చేరారు. దేశాధ్యక్షులుగా, కమ్యూనిస్టు పార్టీ, చైనా సైన్యం అధినేతగా అన్ని స్థాయిల్లో తన ప్రాబల్యం చాటుకున్నారు. ఈ దశలోనే ఆయన పట్ల అసమ్మతితో ఉన్న వారు క్రమంగా అదృశ్యం అవుతూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News