బీజింగ్: చైనాలో కొత్త రకం కోవిడ్ విజృంభిస్తోంది. ఇది విదేశాల నుంచి దాపురించిన డేల్టా వేరియంట్ రకమని అక్కడి అధికారులు తెలిపారు. చైనా స్థానికులు 26 మందిలో ఈ కొత్త రకం వ్యాధి ధృవీకృతం అయింది. రానున్న రోజుల్లో మరింతగా ఈ కొత్త రకం విజృంభించొచ్చని కూడా అక్కడి అధికారులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.“ప్రస్తుతం చైనాలో పొడసూపిన ఈ కొత్త రకంట కోవిడ్ వ్యాధి విదేశాల డెల్టా రకానికి చెందినది” అని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారి వూ లియంగ్‌యూ ఆదివారం బీజింగ్‌లో విలేకరులకు తెలిపారు.
చైనాలో ప్రస్తుతం వెలుగు చూసిన ఈ కొత్త రకం కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఏడుగురు మంగోలియా, ఆరుగురు గాన్సూ, ఆరుగురు నింగ్‌గ్జియా, నలుగురు బీజింగ్, కాగా హెబీ, హునాన్, షాంఘ్జిలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు సమాచారం. ఇలాంటి లక్షణాలున్న కేసులు కొన్ని హునాన్, యూన్నాన్‌లో కూడా వెలుగుచూశాయి. ఇదిలావుండగా అక్టోబర్ 31 నుంచి జరగాల్సిన మారథాన్ ఈవెంట్‌ను వైరస్ కారణంగా రద్దు చేసింది. కొత్త రకం కోవిడ్ వ్యాధి సోకిన వారు బీజింగ్‌ను సందర్శించడాన్ని నిషేధించారని అక్కడి ఓ దినపత్రిక పేర్కొంది.