యుద్ధ సామగ్రిని మోసుకువెళ్లే అతిపెద్ద నౌకగా అంచనా
ఇండో పసిఫిక్ ప్రాంతానికి ముప్పుగా
భావిస్తున్న భారత రక్షణ వర్గాలు
న్యూఢిల్లీ: చైనా ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేయనున్నట్టు భావిస్తున్న 003 భారీ విమాన వాహకనౌక పట్ల భారత రక్షణ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండోపసిఫిక్ ప్రాంతానికి చైనా చర్యలు ముప్పుగా మారనున్నాయని అంచనా వేస్తున్నాయి. గతంలో దక్షిణా చైనా సముద్ర ప్రాంతంలో చైనా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినతీరును గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే హిందూమహాసముద్ర ప్రాంతం(ఐఒఆర్)లో చైనా సృష్టిస్తే తలెత్తే పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాయేతర దేశాలకు సంబంధించి చైనా 003 వాహకనౌకను అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఇప్పటికే లియానింగ్,షాన్‌డాంగ్ అనే వాహకనౌకలను చైనా రంగంలోకి దించింది. ఆ వరుసలో 003 మూడోది.
ఈ దశాబ్దం చివరికల్లా చైనా మరో రెండు వాహకనౌకలను యుద్ధ విభాగం(సిబిజి)లోకి తేనున్నట్టు పాశ్చాత్య నిఘా వర్గాల అంచనా. అయితే, యుద్ధ నౌకల తయారీలో చైనా సాంకేతికత అంతంత మాత్రమేనని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. చైనా తన సాంకేతికతను ఎలా అభివృద్ధి చేసుకున్నదన్న విషయం పక్కన పెడితే, 003 మాత్రం కనీసం ఇండోపసిఫిక్ ప్రాంతంలోనైనా అస్థిరతను సృష్టించగలదని భారత రక్షణవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమ నావీ కూడా చైనాను నిలువరించేందుకు కనీసం 11 సూపర్ క్యారియర్లను(వాహక నౌకలను) ఈ ప్రాంతంలో మోహరించనున్నట్టు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. 003 వాహక నౌక 85,000 టన్నుల బరువుల్ని మోయగల సామర్థంతో నిర్మాణమవుతున్నట్టు అంచనా. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వైమానిక స్థావరాలు, గాలిలోనే యుద్ధ విమానాలకు ఇంధనం అందించే సదుపాయం, యాంటీ సబ్‌మెరైన్లు, రాడార్లులాంటి వ్యవస్థలను ఈ వాహకనౌక మోసుకువెళ్లగలదని అంచనా.
భారత వాహక నౌకల్లో ఏ ఒక్కదానికీ వైమానిక స్థావరాన్ని నిర్వహించే సామర్థం లేదు. ఐఒఆర్‌లో చైనా రెండు వాహకనౌకలను మోహరించినా, అండమాన్ ప్రాంతంలో భారత నావీ ఆపరేషన్ల స్వేచ్ఛకు ఆటంకంగా మారనున్నట్టు నిపుణుల అంచనా. తైవాన్ జలాల్లో అమెరికా వాహక నౌకల మోహరింపుతో చైనా ఎలాంటి ఇరకాటపు పరిస్థితిని ఎదుర్కొంటుందో, ఐఒఆర్‌లో భారత్‌కు అలాంటి పరిస్థితి ఎదురవుతుందని భావిస్తున్నారు. 2022 ఆగస్టు వరకల్లా భారత్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లను మోహరిస్తుంది. ఈ నేపథ్యంలో 2025 వరకల్లా చైనా నాలుగు వాహక నౌకల్ని మోహరిస్తే ఈ ప్రాంతంలో సమతుల్యత దెబ్బతింటుంది. చైనా నుంచి ఎదురు కానున్న ఈ సవాల్‌ను దీటుగా ఎదుర్కోవడంపై భారత రక్షణవర్గాలు దృష్టి సారించాయి. భారత్,చైనాలు కేవలం వాహక నౌకల్ని మోహరించడంలో సమతుల్యత సాధిస్తే సరిపోదని, శత్రు వాహకనౌకల నుంచి దాడులతోపాటు ఖండాంతర క్షిపణుల నుంచి ముప్పును కూడా ఎదుర్కోగల వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.