క్వాడ్ సదస్సు సమయంలోనే కవ్వింపు చర్య
టోక్యో: ఓ వైపు టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్న సమయంలోనే మంగళవారం చైనా, రష్యా యుద్ధ విమానాలు జపాన్‌కు దగ్గర్లో ఉమ్మడి విన్యాసాలు నిర్వహించాయి. ఈ విషయాన్ని వెల్లడించిన జపాన్ రక్షణ మంత్రి నొబువో కిషీ దీనిపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘చైనాకు చెందిన రెండు హెచ్6కె బాంబర్లు, మరో రెండు రష్యా టియు95 ఎంఎస్ యుద్ధ విమానాలు మంగళవారం జపాన్ సముద్రం, తూర్పు చైనా సముద్రం, పసిఫిక్ సముద్రం మీదుగా సంయుక్త వ్యూహాత్మక గస్తీ నిర్వహించాయి. ఈ విమానాలు అంతర్జాతీయ నిబంధనలను కానీ, జపాన్ గగనతలాన్ని కానీ ఉల్లంఘించలేదు’ అని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ తెలిపింది. రష్యాకు చెందిన గూఢచార సమాచారం సేకరించే విమానం కూడా హక్కయిడోకుసమీపంగా వెళ్లిందని కిషీ తెలిపారు. క్వాడ్ సదస్సు జరుగుతున్న సమయంలో జరిపిన ఈ విన్యాసాలను ఆయన ‘రెచ్చగొట్టే చర్య’గా పేర్కొన్నారు.