Monday, December 23, 2024

చైనా సోషలిస్టు ఆధునికీకరణ

- Advertisement -
- Advertisement -

చైనా ఆర్థిక సంస్కరణలను, ఓపెన్ డోర్ పాలసీని చేపట్టి నేటికి 45 సంవత్సరాలు పూర్తయ్యింది. 1978 డిసెంబరు 18న కామ్రేడ్ డెంగ్‌క్సియావోపింగ్ నాయకత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టీ 11వ కేంద్ర కమిటీ 3వ ప్లీనరీ ఈ విధానాన్ని చేపట్టింది. ఈ 45 ఏళ్ళలో చైనా ఎన్నో సవాళ్ళను, కష్టాలను ఎదుర్కొని నేడు అన్ని రంగాలలో అనూహ్యమైన అభివృద్ధిని సాధించి పేద వ్యవసాయ దేశాన్ని నూతన అంతర్జాతీయ శక్తిగా మార్చి వేసింది. 1978లో చైనా జిడిపి 149.54 బిలియన్ డాలర్లు అనగా మొత్తం ప్రపంచ జిడిపిలో 1.75 శాతంగా మాత్రమే వుండగా, 2022 నాటికి 18 ట్రిలియన్ డాలర్ల జిడిపితో మొత్తం ప్రపంచ జిడిపిలో 18.6 శాతంగా వుంటూ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది. ఈ 45 ఏళ్ళలో దేశంలోని 800 మిలియన్ల ప్రజలను (80 కోట్లు) కటిక దారిద్య్రం నుంచి బయటపడవేసింది. ఈ గణాంకాలన్నీ ప్రపంచ బ్యాంకు తెలిపినవే. ఈ 45 ఏళ్ళలో చైనా ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి.

1978లో చైనాలోని పట్టణ ప్రాంత తలసరి ఆదాయం కేవలం 343 యువాన్లు కాగా, 2022లో అది 36,883 యువాన్లు. ఆదాయ పెరుగుదలకు, జీవన ప్రమాణాల పెరుగుదలకు సూచిక అయిన ఏంగెల్స్ గుణకము (Engel’s Co-efficient) గ్రామీణ ప్రాంతాల ప్రజలది. 1978లో 67.7 శాతం వుండగా, 2022కు అది 33 శాతానికి పడిపోయింది. ఐక్యరాజ్య సమితి (UN) ఉపయోగించే ఏంగెల్స్ గుణకం 30 40 శాతం వుంటే అక్కడ మంచి జీవన ప్రమాణాలు వున్నట్లు లెక్క. 2012 నుంచి చైనా ప్రపంచంలోనే రెండవ పెద్ద ఆర్థికశక్తిగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిశక్తిగా, అతిపెద్ద ట్రేడర్‌గా కొనసాగుతున్నది. అనేక రంగాలలో ముఖ్యంగా ఫార్ట్యూన్ 500 కంపెనీల సంఖ్యలో, 5జి స్టేషన్ల సంఖ్యలో, బ్రాడ్ బాండ్ యూజర్ల సంఖ్యలో, హైస్పీడ్ రైల్వేల, హైవేల పొడవులో నేడు చైనా ముందంజలో వుంది. ఈ 45 ఏళ్ళలో చైనా సాధించిన ఈ అద్భుత ప్రగతికి అనేక ప్రత్యేకతలున్నాయి. చైనా ఈ 45 ఏళ్ళలో ఇంతటి గణనీయమైన అభివృద్ధిని సాధించడం మానవ జాతి చరిత్రలో కనీవినీ ఎరుగనిది.

చైనా ప్రజల జీవన ప్రమాణాలు మాత్రమే పెరగడం కాక చైనా సాధిస్తున్న ఈ అద్భుత పురోగతి అంతర్జాతీయం అభివృద్ధికి కూడా చాలా ఎక్కువగా తోడ్పడుతున్నది. 2013 2021 సంవత్సరాలలో చైనా జిడిపి పెరుగుదల సంవత్సరానికి సరాసరి 6.6 శాతం వుంది. ఇది అంతర్జాతీయ జిడిపి సరాసరి పెరుగుదల 2.6 శాతం కంటె చాలా ఎక్కువ. ఈ కాలంలో అంతర్జాతీయ అభివృద్ధికి చైనా వాటా 38.6 శాతం. జి7 దేశాల మొత్తం వాటా కంటె ఇది ఎక్కువ. చైనా ఆధునికీకరణ అమెరికా, పశ్చిమ దేశాల దానికంటే విభిన్నమైనది. ఇతరులకు హాని జరుగకుండా, యుద్ధాలు చేకుండా, ప్రజలను దోపిడీ చేయకుండా అంటే వలసవాద, సామ్రాజ్యవాద విధానాలకు పూర్తిగా భిన్నమైన విధానాలను అనుసరించి చైనా ఈ ప్రగతిని సాధించింది. చైనా దేశ అభివృద్ధి ప్రజలందరి ఉమ్మడి సౌభాగ్యానికి (Common prosperity) ఉద్దేశించబడినది. అమెరికా, పశ్చిమ దేశాల అభివృద్ధి ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యక్తిగత ఆస్తికి ప్రాముఖ్యతనిస్తూ అసమాన సంపద పంపిణీతో ధనిక, పేదల మధ్య అంతరాన్ని పెంచేదిగాను, సమాజంలో అసమానతలను సృష్టించేదిగాను వుంటుంది.

అంతేగాక చైనా అభివృద్ధి 140 కోట్లు గల అత్యధిక జనాభాకు సంబంధించినది. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అన్ని దేశాల జనాభా కంటె ఎక్కువ జనాభా కలిగివున్న చైనా దేశం అభివృద్ధి అంతర్జాతీయ అభివృద్ధి రూపురేఖలను పూర్తిగా మార్చివేయగలిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే చైనా అభివృద్ధి శాంతియుత అభివృద్ధిగా వుంటూ, ప్రపంచానికి అనేక అవకాశాలు కల్పించే అందరి ప్రజల ప్రయోజనాలకు అనుగుణ్యమైనది. ఈ విధంగా చైనా సోషలిస్టు ఆధునీకీకరణ మార్గంలో అప్రతిహతంగా ముందుకుపోతుంటే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, సోవియట్ రష్యా మాదిరిగా విఫలమవుతుందని ఈ 45 ఏండ్లలో పశ్చిమ దేశాల ఆర్థికవేత్తలు కొందరు అనేక విధాలుగా దుష్ర్పచారం సాగించారు. ఈ ‘ఆర్థిక’వేత్తల చైనా ‘విఫల’ సిద్ధాతాలన్నీ ఈ 45 ఏళ్ళలో ఘోరంగా విఫలమయ్యాయి. చైనా సోషలిస్టు ఆధునికీకరణ మార్గంలో అనేక సవాళ్ళను ఎదుక్కొంటూ 2049కల్లా ఒక అభివృద్ధి చెందిన, బలమైన, ప్రజాతంత్ర ఆధునిక సోషలిస్టు దేశంగా మారాలనే తన లక్ష్య సాధనకు పురోగమిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News